ముంబై: దక్షిణ ముంబైలోని నెహ్రూ పార్క్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యానవనం లోపల వెలిసిన రాజకీయ పార్టీల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని నారీమన్ పాయింట్ సిటిజన్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) సోమవారం విచారణకు వచ్చింది. దీన్ని జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి, రేవతి దేరేలతో కూడిన ధర్మాసం విచారించింది. ఈ ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలు, గుడిసెలను ఎందుకు తొలగించలేదంటూ బీఎంసీని ప్రశ్నించింది. జాతీయ నాయకుల విగ్రహాలపై గౌరవం ఉంటే ముందే ఈ భూమి కబ్జా కాకుండా చూసుకొని ఉండాల్సిందని మండిపడింది. మంత్రాలయ, అసెంబ్లీ సమీపంలో ఎలాంటి కబ్జాలు జరగకుండా చూస్తున్న కార్పొరేషన్ ఉద్యానవనంలోనూ అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుందని ప్రశ్నించింది.
ఇలాంటి భూకబ్జాలు ఆ ప్రాంతంలో భద్రతకు పెనుసవాల్‌గా మారుతాయని తెలిపింది. ఆ ఉద్యానవనంలో ఎంతో మంది నడుస్తుంటారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఈ రోజు ఆ ప్రాంతంలో భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబర్ రెండు, ఇతర రోజుల్లో జాతీయ నాయకులను గౌరవించే సమయంలో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారని, మిగతా రోజుల్లో పట్టించుకోవడం లేదని గుర్తు చేసింది. ఆ ప్రాంతంలో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించాల్సిందేనని మరోసారి బీఎంసీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 22కి వాయిదా వేసింది. ఆ లోపు ఏమేమీ చర్యలు తీసుకున్నారనే దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఉద్యానవనంలో మహత్మా గాంధీ, జవహారలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు కూడా ఉన్నాయి.
అక్రమ కట్టడాలు ఎందుకు తొలగించలేదు?
Published Mon, Dec 23 2013 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement