అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు | Do not overlook illegal structures | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు

Published Wed, Jul 17 2019 4:51 AM | Last Updated on Wed, Jul 17 2019 7:48 AM

Do not overlook illegal structures - Sakshi

సాక్షి, అమరావతి: చట్ట నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతుంటే గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. గత ప్రభుత్వం కళ్లుమూసుకుని చేసిన తప్పును తాము చేయబోమంది. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. కృష్ణానది, కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్‌ పేరుతో నిర్మించిన అక్రమ కట్టడం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు సీఆర్‌డీఏ ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలిపేస్తూ గత వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఆర్‌డీఏ కమిషనర్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  

అనుమతులు లేవని పిటిషనరే ఒప్పుకున్నారు..  
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, రైతు సంఘం భవన్‌ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని పిటిషనరే ఒప్పుకున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలని భావించిన వాటి కూల్చివేతలో భాగంగా పిటిషనర్‌ భవనానికి సైతం షోకాజ్‌ నోటీసు ఇచ్చామని, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరి, ఆ వెంటనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని వివరించారు.కృష్ణానదికి 100 మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలు ఉండడానికి వీల్లేదని ఎన్‌జీటీ 2017లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. రాజధాని ప్రాంత పరిధిలో అభివృద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్‌డీఏకు అన్ని అధికారాలున్నాయని,  నదీ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధి కూడా సీఆర్‌డీఏదేనని అన్నారు. సీఆర్‌డీఏ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై పిటిషనర్‌కు ఏవైనా అభ్యంతరాలుంటే, వాటిపై ఉన్నతాధికారులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉందన్నారు. దీనిని ఉపయోగించుకోకుండా పిటిషనర్‌ నేరుగా పిటిషన్‌ దాఖలు చేశారని, ఇలా దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదని ఏజీ తెలిపారు.

అవి కేవలం తాత్కాలిక ఉత్తర్వులే..
ఆ తరువాత పిటిషనర్‌ కేదారీష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చింది కేవలం తాత్కాలిక ఉత్తర్వులు మాత్రమేనన్నారు. తాత్కాలిక ఉత్తర్వులపై దాఖలు చేసే అప్పీల్‌కు విచారణార్హత లేదన్నారు. తమ భవనం అక్రమ కట్టడమని అంతిమ నిర్ణయానికి వచ్చిన తరువాతనే షోకాజ్‌ నోటీసు ఇచ్చారని, ఇది అన్యాయమన్నారు. అసలు వంద మీటర్ల లోపు నిర్మాణాలను కూల్చివేయాలని ఎన్‌జీటీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వాదించారు. ఈ సమయంలో శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఎన్‌జీటీ ఏ కేసులో ఆదేశాలు ఇచ్చిందీ.. ఆ కేసు నంబర్, ఆదేశాలు ఇచ్చిన సంవత్సరం తదితర వివరాలను వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement