తప్పెవరిది? ముప్పెవరికి?
- అక్రమ నిర్మాణాల్లో అందరూ పాత్రధారులే
- ప్రభుత్వ విభాగాల సమన్వయలేమి.. ప్రజలకు శాపం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా జీహెచ్‌ఎంసీ అధికారులు 25 అక్రమ భవనాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియతో ఎప్పుడు ఏ బుల్‌డోజర్ వచ్చి తమ ఇంటిపై పడుతుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏళ్లకేళ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చోద్యం చూసిన అధికారులు.. ఉన్నపళంగా విరుచుకుపడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూల్చివేతల్లో సైతం బడాబాబుల జోలికి పోకుండా చిరుజీవులపైనే ప్రతాపం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి.
అధికారులు అక్రమాలను ఆదిలోనే అడ్డుకుని ఉంటే నిర్మాణాలే జరిగేవి కావని కొందరు.. అధికారుల లాలూచీ వల్లే అదనపు అంతస్తులు నిర్మించుకున్నామని ఇంకొందరు అంటున్నారు. గ్రేటర్‌లో ఏళ్లకేళ్లు అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలసినా.. వాటిని అడ్డుకోకుండా అక్రమ మార్గంలోనే నల్లా, విద్యుత్, తదితర కనెక్షన్లు కూడా ఇవ్వడంతో పలువురు అనుమతుల్లేని ఇళ్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలతో భీతిల్లుతున్నారు.
ఎవరిది తప్పు?
జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లేమి ప్రజలకు ముప్పు తెస్తోంది. ఎవరికి వారు ఆదాయం కోసం నిబంధనల్ని, సర్కారు ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతుండటంతో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండాపోతోంది. నాలుగు విభాగాల నడుమ సమన్వయం ఉండి.. నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే అక్రమ నిర్మాణాలకు ఎవరూ సాహసించేవారు కాదు.
పైసా పైసా కూడబెట్టో, అప్పులు తెచ్చో, కాస్త తక్కువ ధరలో వస్తుందనో స్థలాలు కొని నిర్మాణ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రజలపై అధికారులు ఇప్పుడు ప్రతాపం చూపుతున్నారు. ఈ అక్రమాలను మొదట్లోనే అడ్డుకొని ఉంటే, ఎవరూ వాటి జోలికి పోయే వారు కాదు. నిర్మాణం నుంచి ప్రారంభిస్తే నల్లా, విద్యుత్ కనెక్షన్, అమ్ముకునే పక్షంలో రిజిస్ట్రేషన్‌లో సైతం అందినకాడికి దండుకొని ప్రజలకు ‘సహకరించిన’ ఆయా విభాగాల వారు.. ఏళ్లు గడిచాక ఇలా చర్యలకు దిగుతారని ఎవరూ ఊహించలేదు.
అమలుకు నోచని నిబంధనలు
ఇల్లు నిర్మించాలంటే జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందాలి. అందుకు అనుగుణంగానే నిర్మాణం పూర్తి చేయాలి. అప్పుడే జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అక్రమాలను నిరోధించే లక్ష్యంతోనే దీన్ని తప్పనిసరి చేశారు. ఈ సర్టిఫికెట్ లేనిదే కరెంట్, నీరు, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వమని ప్రకటించారు. కానీ, ఆయా పనులు నిర్వహించే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేదు. లంచాలకు మరిగి ఆక్యుపెన్సీ లేకున్నా నీటి, కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు. అమ్మకాల, కొనుగోళ్ల రిజిస్రేషన్లు సైతం జరిగాయి. గడచిన నాలుగేళ్లలో 40 వేల రిజిస్ట్రేషన్ల దాకా జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామనడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
ఆక్యుపెన్సీకి రాని దరఖాస్తులు
గడచిన నాలుగేళ్లలో భవన నిర్మాణ అనుతుల కోసం జీహెచ్ ఎంసీకి 50 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, వాటిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం అందిన దరఖాస్తులు ఆరున్నర వేలు. అంటే డీవియేషన్లు లేని భవనాలెన్నో ఎవరైనా తేలిగ్గానే అంచనా వేసుకోవచ్చు.
కూల్చివేతల్లో పక్షపాతం లేదు..
బడాబాబులను వదిలి చిరుజీవుల భవనాలనే కూల్చివేస్తున్నారనడంలో వాస్తవం లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. గడచిన రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాల గురించి జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులే వందకుపైగా ఉన్నాయన్నారు. తమ కాల్‌సెంటర్ (040-21 11 11 11)కు ఫోన్ చేసేవారు అక్రమ భవనం ఎక్కడ ఉన్నది, ఏరియా, ఇంటి నెంబరు తదితర వివరాలందజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 900 అక్రమ నిర్మాణాలను గుర్తించామని, పక్షపాతానికి తావులేకుండా గ్రేటర్‌లోని 18 సర్కిళ్లలోనూ కూల్చివేతలు జరుపుతున్నామన్నారు.