చెత్తనుండి విద్యుత్ ఉత్తదే... | Trash power uttade ... | Sakshi
Sakshi News home page

చెత్తనుండి విద్యుత్ ఉత్తదే...

Published Fri, Dec 13 2013 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

చెత్తనుండి విద్యుత్ ఉత్తదే...

చెత్తనుండి విద్యుత్ ఉత్తదే...

కార్యరూపం దాల్చని ప్రాజెక్టు
 =రూ.2.80 కోట్లకు జీహెచ్‌ఎంసీ కక్కుర్తి
 =దాదాపు అటకెక్కించినట్టే..
 =ఇటు తీరని చెత్త సమస్య..
 =అటు ఉత్పత్తి కాని విద్యుత్

 
సాక్షి, సిటీబ్యూరో: చెత్త నుంచి విద్యుదుత్పత్తి. ఇటు చెత్త సమస్య తీరుతుంది.. అటు విద్యుదుత్పత్తి... ప్రాజెక్టు ఉద్దేశం బాగుంది. ఎటొచ్చీ సాకారం దిశగానే అడుగు ముందుకు పడటం లేదు. అదిగో ఇదిగో అంటూనే మరో ఏడాది గడిచిపోతోంది. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ  ప్రతిపాదించిన ఒక్క ప్రాజెక్టూ కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా విద్యుదుత్పత్తి సంగతటుంచి గ్రేట ర్‌లో చెత్త సమస్యకూ పరిష్కారం  దొరకట్లేదు. నగరంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల్లో ఆర్టీఎఫ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు ప్రధానమైనది.

ఈ సంస్థతో జీహెచ్‌ఎంసీకి కుదిరిన ఒప్పందం మేరకు.. ఏళ్ల క్రితమే విద్యుదుత్పత్తి జరగాల్సి ఉంది. 2011లోనే ఉత్పత్తి జరగ్గలదని భావించినా, నేటికీ  పనులు పూర్తికాలేదు. జీహెచ్‌ఎంసీ వాటా ధనం చెల్లింపు జరగనందునే ఉత్పత్తి ప్రారంభించలేకపోతున్నామని ఆర్డీఎఫ్ చెబుతోంది. ఏటా వందలాది కోట్లు వివిధ ప్రాజెక్టుల కింద ఖర్చు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ తాను చెల్లించాల్సిన మిగతా వాటా ధనం రూ. 2.80 కోట్లు చెల్లిస్తే.. ఆర్డీఎఫ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుండేది. ఘనవ్యర్థాల నిర్వహణ సామర్థ్యం పెరిగేది. చెత్త సమస్యకు కొంత పరిష్కారం లభించేది. మరోవైపు ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతోంది. దీంతో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ప్రాజెక్టుకు రూపకల్పన ఇలా..

గ్రేటర్ నుంచి రోజూ వెలువడుతున్న దాదాపు 3850 మెట్రిక్ టన్నుల చెత్తలో 700 మెట్రిక్ టన్నుల చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. దీనితో జీహెచ్‌ఎంసీ (పూర్వపు ఎంసీహెచ్) దశాబ్దం క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. 11 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్ ఏర్పాటుకు రూ. 84 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. అందులో 70 శాతం సొమ్మును ఆర్థిక సంస్థల నుంచి  సేకరించాలని, మిగతా 30 శాతం ఈక్విటీ షేర్ (రూ. 25.20 కోట్లు)లో 26 శాతం (దాదాపు రూ. 6.55 కోట్లు) జీహెచ్‌ఎంసీ పెట్టుబడిగా పెట్టాలనేది ఒప్పందం. ఒప్పందం కుదిరినా.. పనుల పురోగతిపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించలేదు.

రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ తన  వాటా సొమ్ములో రూ.3.75 కోట్లు చెల్లించింది. ఇంకా రూ. 2.80 కోట్లు చెల్లించాలి. 2011 నవంబర్ నాటికే విద్యుత్ ఉత్పత్తి  జరగ్గలదని భావించినా.. 2012 మార్చి వరకు ప్లాంట్ ఏర్పాటు పనులే జరిగాయి. జీహెచ్‌ఎంసీ నుంచి అందాల్సిన మిగతా వాటా సొమ్ము.. కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ఈ చెత్త నుంచి విద్యుత్ పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఇచ్చే దాదాపు రూ. 10 కోట్ల రాయితీ అందితే ఉత్పత్తి ప్రారంభించేవారమని, కానీ.. అటు కేంద్రం ఇచ్చే నిధులు, ఇటు జీహెచ్‌ఎంసీ వాటా ధనం రానందునే ఉత్పత్తిని చేపట్టలేకపోతున్నామన్నది ఆర్డీఎఫ్ వాదన.  
 
అంతా సిద్ధమైనా..

విద్యుదుత్పత్తికి గాను గ్రేటర్ శివార్లలోని నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆర్డీఎఫ్‌కు చెందిన 26 ఎకరాల స్థలంలో పనులు ప్రారంభించారు. గ్రేటర్ నుంచి రోజూ అక్కడకు తరలించే 700 టన్నుల చెత్తలో పది శాతం(70 టన్నుల)  చెత్త తరలింపునకయ్యే వ్యయం ఆర్డీఎఫ్‌దే కాగా, మిగతా 630 టన్నుల చెత్తను జీహెచ్‌ఎంసీ అక్కడకు తరలిస్తుంది.

ఇందుకుగాను టన్నుకు రూ.25 వంతున రోజుకు రూ. 15750 జీహెచ్‌ఎంసీకి ఆర్డీఎఫ్ రాయుల్టీగా చెల్లిస్తుంది. ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీకి విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఇంత గొప్ప ప్రాజెక్టు కేవలం రూ.2.80 కోట్ల చెల్లింపు వద్దే ఆగిపోవడం గమనార్హం. ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement