కొంగొత్త కాంతులు
- ఎల్‌ఈడీ వెలుగులు
- రూ. 927 కోట్లతో ప్రణాళిక
- టర్న్‌కీ పద్ధతిలో చెల్లింపులు
- ఈఈఎస్‌ఎల్ భాగస్వామ్యం
- ఆరు మార్గాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగం ఏటా చేస్తున్న ఖర్చులో సింహభాగం కరెంటు చార్జీలకే చెల్లిస్తోంది. అయినప్పటికీ చాలా చోట్ల విద్యుత్ దీపాలు వెలగడం లేదని... కొన్ని చోట్ల గుడ్డిదీపాల్లా ఉన్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. రహదారులు సరిగా కనిపించనందున తరచూ జనం ప్రమాదాల బారిన పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ సమస్యల పరిష్కారంలో భాగంగాగ్రేటర్ నగరంలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. తద్వారా వెలుగులు పెంచడంతో పాటు విద్యుత్ చార్జీలు గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకుగాను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ)ల భాగస్వామ్యంతో ఈఈఎస్‌ఎల్ ఏర్పాటైంది.
రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో నగరాలు, పట్టణాల్లో విద్యుత్ ఆదా చర్యలు అమలులోకితేవడం ఈఈఎస్‌ఎల్ ఏర్పాటు లక్ష్యం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈఈఎస్‌ఎల్ అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టులను టర్న్‌కీ పద్ధతిలో అమలు చేస్తుంది. ఇప్పటికే 93 స్థానిక సంస్థల్లో ఈఈఎస్‌ఎల్ పని చేస్తోంది. వాటిలో కోల్‌కతా, నాసిక్, పుదుచ్చేరి, చండీగఢ్ తదితర నగరాలు ఉన్నాయి. వాటి తరహాలో హైదరాబాద్‌లోనూ విద్యుత్ ఆదాకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం.
తొమ్మిదేళ్లలో గ్రేటర్ అంతటా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఏటా రూ.103 కోట్లు వంతున జీహెచ్‌ఎంసీ ఈఈఎస్‌ఎల్‌కు చెల్లించాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 927 కోట్లు. ఇందులో భాగంగా పెలైట్ ప్రాజెక్టుగా 500-1000 ఎల్‌ఈడీ లైట్లను ఈఈఎస్‌ఎల్ ఉచితంగానే ఏర్పాటు చేస్తుంది. వాటి పనితీరును పరిశీలించాక జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ మేరకు ఇటీవల స్టాండింగ్ కమిటీలో తీర్మానించారు.
ఈఈఎస్‌ఎల్‌దే బాధ్యత
ప్రాజెక్టులో భాగంగా పనులన్నీ పూర్తయ్యేంత వరకు నిర్వహణ బాధ్యతలను కూడా ఈఈఎస్‌ఎల్ నిర్వహిస్తుంది. సాంకేతిక లోపాలు తలెత్తితే లైట్లను మారుస్తుంది. సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేస్తుంది. విద్యుత్ వెలుగుల స్థాయి జాతీయ ప్రమాణాల (బీఐఎస్ ప్రమాణాలు, నేషనల్ లైటింగ్ కోడ్) మేరకు ఉండాలి.
పెలైట్ ప్రాజెక్టుతో...
పెలైట్ ప్రాజెక్టులో భాగంగా ఈఈఎస్‌ఎల్ వెస్ట్‌జోన్, సౌత్‌జోన్‌లలోని ఆరు మార్గాల్లో 703 స్తంభాలకు 835 ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయనుంది. మెట్రో పోలిస్ సదస్సు జరుగనున్న అక్టోబర్‌లోగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి పనితీరును బట్టి గ్రేటర్ అంతటా విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు.