సాక్షి, మంచిర్యాల : భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. చెరువులు, కుంటలు, కాలువలు సైతం వదలడం లేదు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం పరిపాటిగా మారింది. చెరువుల సర్వేలోనూ పరిగణనలోకి తీసుకోకపోవడంతో చెరువుల పునరుద్ధరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. పట్టణంలో ఉన్న మురుగు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జోరుగా సాగుతోన్న ఆక్రమణల పర్వంపై స్పందించాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
ఈ నెల ఒకటిన హైదరాబాద్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల ఆక్రమణ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కలెక్టర్లను ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. అయినా అధికారులు కదలకుండా.. మెదలకుండా మొద్దునిద్రపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉంది. అయినా క్షేత్రస్థాయిలో కబ్జా కు గురైన చెరువుల వివరాలు సేకరించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మంచిర్యాలలో రాముని చెరువు మాత్రమే కబ్జాకు గురైనట్టు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తహశీల్దార్ కె.సురేశ్ వివరించారు. మిగతా చెరువుల సర్వే ఇరిగేషన్ అధికారులు చేపట్టారని అన్నారు. ఇటు ఇరిగేషన్ అధికారులూ స్థానికంగా ఉన్న చెరువుల సమగ్ర సర్వే చేపట్టలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్రమిత చెరువుల స్వాధీనం.. పునరుద్ధరణ ఎలా చేపడతారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాలువపై అక్రమ నిర్మాణాలు..
రాముని చెరువు పార్కు సమీపంలోని మత్తడి నుంచి నీరు రాళ్లవాగులో కలిసేలా సుమారు 2కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మించారు. కాలువ ద్వారా నీళ్లు పట్టణంలోని ప్రధాన వీధులైన జన్మభూమినగర్, ఇస్లాంపుర, రెడ్డికాలనీల మీదుగా రాళ్లవాగులో కలుస్తాయి. కాలువ పట్టణంలోని ప్రధాన రహదారి, కాలనీలోని నివాస గృహాలకు ఆనుకుని ఉండడంతో వ్యాపారులు, ప్రజలు కాలువ ను అక్రమించుకున్నారు. ఇంకొందరైతే ఏకంగా కాలువపై స్లాబు వేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఆ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం.. కాలువ నుంచి రెండు మీటర్ల స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ కాలువకు ఆనుకునే భవంతుల నిర్మాణం చేపట్టారు. కాలువ ఉధృతి పెరిగితే.. నీళ్లు భవంతుల పునాదులకు చే రి భవనాలు కూలిపోయే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
రాముని చెరువు కనుమరుగు..
మంచిర్యాల పట్టణంలోని 406 సర్వే నెంబర్లో 46.10 ఎకరాల్లో రాముని చెరువు విస్తరించి ఉంది. చెరువు పరిసర ప్రాంతాలన్నీ ఇప్పటికే అభివృద్ధి చెందాయి. ఓ పక్క హైటెక్ సిటీ, మరోపక్క జన్మభూమి నగర్, ఇటు ప్రధాన రహదారి ఉన్న ఈ ప్రాంతంలో గజం భూమి కొనాలంటే రూ.12వేలపైనే ధర ఉంది. దీన్ని అదునుగా చేసుకుని భూ కబ్జాదారులు సుమారు 30ఎకరాల శిఖం భూమిని ఆక్రమించుకున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ సైతం శిఖం భూమిని ఆక్రమించి నివాసగృహం నిర్మించుకోవడం గమనార్హం.
తిలక్‌నగర్ చెరువు మిగిలింది ఐదెకరాలే..!
మంచిర్యాల శివారు ప్రాంతంలోని తిలక్‌నగర్‌లో 50 ఎకరాలు, నస్పూర్‌లో 70 ఎకరాల్లో మొత్తం 120 ఎకరాల్లో తిలక్‌నగర్ చెరువు ఉంది. 1976లో భూ సేకర ణ నిర్వహించిన అధికారులు ఈ భూమిని శిఖం భూ మిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్న పట్టాదారు లకు అప్పటి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరి హా రం కూడా చెల్లించారు. కానీ ఆ చెరువు శిఖం అని రె వెన్యూ అధికారులు తమ రికార్డుల్లో నమోదు చేయక పోవడంతో రియల్టర్లు ఆ భూమిని ఆక్రమించేశారు. ప్రస్తుతం ఐదెకరాల భూమి మాత్రమే మిగిలింది.
పట్టణంలోని 449 సర్వేనంబర్‌లో ఉన్న పోచమ్మ చెరువు విస్తీర్ణం 5.10 ఎకరాలు. హమాలీవాడలో ఉన్న ఈ చెరువు ఏళ్ల నుంచి క్రమంగా కబ్జాకు గురవుతూ వచ్చింది. ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే చెరువు ఆనవాళ్లు ఉన్నాయి.
మున్సిపల్ పరిధిలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతం 339 సర్వే నెంబర్‌లో ఉన్న చీకటివెలుగు కుంట విస్తీర్ణం ఏడు ఎకరాలు. ఈ కుంటలో నీళ్లు లేకపోవడంతో దానిపై భూ కబ్జాదారుల కన్ను పడింది. దశల వారీగా కుంటను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం కుంట భూమి 2.30 ఎకరాల్లో మాత్రమే మిగిలింది.
కబ్జా మామూలే..!
Published Sat, Dec 6 2014 3:41 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement