వీఐపీలున్నారని వెనుకాడుతున్నారా?
* అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే ఏం చేస్తున్నారు?
* 111 జీవోపై పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏలను ప్రశ్నించిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జీవో 111 అమల్లో ఉన్నప్పటికీ, అక్కడ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోని హెచ్‌ఎండీఏపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జంట నగరాలకు తాగునీరు అందిస్తూ జీవాధారంగా ఉన్న ఈ జంట జలాశయాల పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి..
వాటి తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారు.. అరికట్టలేకపోవడానికి కారణాలు ఏమిటి తది తర వివరాలను అఫిడవిట్ల రూపంలో తమ ముందుంచాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌లను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మం డలం హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 47, 48ల్లో జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా హెచ్‌ఎండీఏ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ పొట్లూరు కమలాదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో మున్నీ మి యా, ఇబ్రహీం, ఎం.శ్రీహరి, బాలకృష్ణలు జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.ఎం.ఆర్.వేలు కోర్టు ను కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ‘జంట జలాశయాల పరీవాహక ప్రాంత పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిలో వీఐపీ, వీవీఐపీలు ఉన్నారని చర్యలకు వెనుకడుగు వేస్తున్నారా’ అంటూ హెచ్‌ఎండీఏను నిలదీశారు.
ఇప్పటి వరకు ఈ జీవోకు విరుద్ధంగా ఎన్ని నిర్మాణాలు వెలిశాయో, తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ‘ఈ వ్యాజ్యంలో విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడిఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్న దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు.
జంటనగరాలకు ఈ జంట జలాశయాలు తాగునీరు అందిస్తూ జీవాధారంగా ఉన్నాయి. ఇటువంటి వాటి చుట్టూ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుల్లా వెలుస్తుండటం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వం, అధికారులు ఎంతోకొంత చేస్తున్నట్లు కనిపిస్తున్నా, క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు.