
న్యూఢిల్లీ: రాజ్యాంగం ఆర్టికల్ 361 ద్వారా రాష్ట్రపతి, గవర్నర్లకు రక్షణ కల్పించింది. తమ అధికారాలు, విధుల నిర్వహణలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు, చర్యలను ప్రశ్నించే అధికారం ఏ న్యాయస్థానానికీ లేదని ఆర్టికల్ 361(1) చెబుతోంది. అయితే, ఆర్టికల్ 361 నిబంధనల మేరకు రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలకు మినహాయింపులున్నప్పటికీ.. వారి చర్యలు దురుద్దేశపూరితంగా, ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని భావించిన పక్షంలో జోక్యం చేసుకోవచ్చని గతంలో పలు సంద ర్భాల్లో కోర్టులు తీర్పులు చెప్పాయి. 2006లో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది.
ఎస్‌ఆర్ బొమ్మై కేసు
ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మైకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండా 1989లో అప్పటి కర్ణాటక గవర్నర్ పి.వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అధికార పార్టీలోని పలువురు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో బొమ్మై మెజారిటీ కోల్పోయారని భావించినట్లు గవర్నర్ కారణంగా చూపారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం చెల్లదంటూ 1994లో కీలక తీర్పు వెలువరిం చింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు రాష్ట్రపతికి తిరుగులేని అధికారాలు మాత్రం లేవని స్పష్టం చేసింది. అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఆయన అసెంబ్లీని రద్దు చేయాలని తెలిపింది.
2018నాటి కర్ణాటక పరిణామాలు
2018 ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీలోని 225 సీట్లకు గాను బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో గవర్నర్ వజూభాయ్ ఆహ్వానం మేరకు యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌ల కూటమి తమకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని చెప్పినా గవర్నర్ పట్టించుకోలేదు. దీంతో ఈ రెండు పార్టీలు అర్ధరాత్రి సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తక్షణమే విచారణ జరిపిన కోర్టు.. గవర్నర్‌కు యడియూరప్ప సమర్పించిన లేఖను తమకు అందజేయాల్సిందిగా ఆదేశించింది. కానీ, యడ్యూరప్పకు కేవలం మెజారిటీ సభ్యుల మద్దతుందని మాత్రమే ఆ లేఖలో ఉంది. మద్దతు పలికే ఎమ్మెల్యేల పేర్లు లేవు. దీంతో అత్యున్నత న్యాయస్థానం.. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువుకు బదులుగా మరుసటి రోజే శాసనసభలో బల పరీక్ష జరపాలని యడియూరప్పను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.