న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించకపోవడంపై సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మదన్.బి.లోకూర్ స్పందించారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ రాజేంద్ర మీనన్‌ల నియామకంపై 2018, డిసెంబర్ 12న కొలీజియం చేసిన సిఫార్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10న సమావేశమైన కొత్త కొలీజియం జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను తొలగించి జస్టిస్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిల పేర్లను సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
కొలీజియం సిఫార్సుకు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ది లీఫెల్ట్ న్యూస్‌పోర్టల్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ జ్యుడీషియరీ అనే కార్యక్రమంలో జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. ‘2018, డిసెంబర్ 12న కొలీజియం సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. కానీ డిసెంబర్ 12 నుంచి 2019, జనవరి 10 మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పలేను. కానీ మేము ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం నన్ను నిరాశ పరిచింది. అయితే ఆ తీర్మానాన్ని వెబ్‌సైట్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయలేదో నాకు అనవసరం’ అని వ్యాఖ్యానించారు.
విశ్వాసఘాతకానికి పాల్పడలేను..
కొలీజియం నిర్ణయాలపై స్పందిస్తూ.. ‘కొలీజియంలో నిర్ణయాలను పరస్పరం నమ్మకంతో రహస్యంగా తీసుకుంటారు. కాబట్టి ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బయటపెట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడలేను. కానీ ఈ సమావేశంలో మేం కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. వీటిని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కొలీజియం భేటీలో ఆరోగ్యకరమైన చర్చ సాగింది. అందులో సమ్మతి, అసమ్మతి రెండూ ఉన్నాయి’ అని జస్టిస్ లోకూర్ తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల సుప్రీంకోర్టు ప్రాంగణాన్ని సందర్శించడంపై మాట్లాడుతూ.. ‘జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి.
అంతమాత్రాన రుషిలా, ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు. దూరం పాటించాలంటే అర్థం ఏంటి? ప్రధాని మోదీ ముఖాన్ని కూడా చూడకూడదంటున్నారా? సాధారణ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించడం తప్పుకాదు. ఇలాంటి కార్యక్రమాలకు సుప్రీంకోర్టు తలుపులు తెరవడం మంచిదే‘ అని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కొలీజియం వ్యవస్థ విఫలమైందని తాను భావించడం లేదని లోకూర్ అన్నారు.
విధివిధానాలు రూపొందించాలి
కొన్నిసార్లు న్యాయవ్యవస్థ కూడా తన పరిధి దాటి వ్యవహరించిందని జస్టిస్ లోకూర్ తెలిపారు. కొలీజియం తీసుకునే నిర్ణయాలను నిర్ణీత గడువులోగా అమలుచేసేలా ఓ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ గడువులోగా కేంద్రం నుంచి జవాబు రాకుంటే ఆమోదం లభించాలని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొలీజియంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ ఏఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పించే విషయంలో కేంద్రం ఫైలును కొన్నినెలల పాటు తనవద్దే అట్టిపెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ, కేంద్రానికి ఇలా ఫైళ్లను తొక్కిపెట్టే అధికారం లేదన్నారు. భవిష్యత్‌లో కేంద్రం ఇచ్చే ఎలాంటి బాధ్యతలను తాను స్వీకరించబోనని చెప్పారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను ప్రతిపాదించిన కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ లోకూర్.. గత డిసెంబర్ 30న పదవీవిరమణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment