సీజేఐ దీపక్ మిశ్రా (ఫైల్) , సీజేఐతో సమావేశం తరువాత తిరిగివెళ్తున్న వికాస్ సింగ్, మన్ కుమార్ మిశ్రా
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. వివాదం నేపథ్యంలో తనను కలిసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఏడుగురు సభ్యుల కమిటీకి సీజేఐ ఈవిధమైన భరోసా ఇచ్చారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం వివాదం 2–3 రోజుల్లో సమసిపోతుందనే భరోసా కలిగిందని బీసీఐ కమిటీ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మీడియాకు వెల్లడించారు.
అంతకుముందు ఈ కమిటీ... తిరుగుబాటు చేసిన న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతోనూ సమావేశమైంది. వారు కూడా వివాదం తొందరగానే పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా సీజేఐని కలిశారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేలు కూడా సీజేఐ, జస్టిస్ చలమేశ్వర్‌లతో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టులో కేసుల పంపకం రోస్టర్ విధానంలో జరగటం లేదంటూ సీజేఐ తీరుకు నిరసనగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే.
రెండు మూడు రోజుల్లో: బీసీఐ
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ చలమేశ్వర్, ఇతర న్యాయమూర్తులతో బీసీఐ కమిటీ ఆదివారం వేర్వేరుగా భేటీ అయింది. ఈ సమావేశాల అనంతరం బీసీఐ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎలాంటి సంక్షోభం లేదు. ఇది కేవలం అంతర్గత విషయమే. ఈ సమావేశాల అనంతరం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందనే నమ్మకం కుదిరింది. సీజేఐతో 50 నిమిషాల సేపు సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ఇది తీవ్రమైన సమస్యేమీ కాదు. అంతా సర్దుకుంటుంది. ఈ వివాద పరిష్కారంలో బీసీఐ పాత్ర పరిమితమే.
న్యాయమూర్తులు కూడా సమస్యేమీ లేదని పేర్కొన్నారు. 2–3 రోజుల్లో అంతా సర్దుకుంటుంది’ అని పేర్కొన్నారు. కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఢిల్లీకి దూరంగా ఉన్నందున రెండ్రోజుల్లో వీరందరితోనూ భేటీ అవుతామన్నారు. అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రాతో సమావేశమైన బీసీఐ కమిటీ.. ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై దాఖలైన పిల్‌పై విచారణ జరపాలని కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రాకు లోయా కేసును బదిలీ చేయటాన్నీ తిరుగుబాటు జడ్జీలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
వారి ప్రెస్‌మీట్ దురదృష్టకరం
న్యాయమూర్తులు, సీజేఐ మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని ఢిల్లీ బార్ అసోసియేషన్స్ (ఢిల్లీలోని ఆరు జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘాలు) సమన్వయ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపిన కమిటీ.. ఈ వివాదం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కాస్త తగ్గిందని అభిప్రాయపడింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయపరమైన క్రమశిక్షణను కొనసాగించాలని పేర్కొంది.
10 రోజుల్లో అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోలేని పక్షంలో మిగిలిన నగరాల్లో ఉన్న బార్ అసోసియేషన్లతో చర్చించి.. దేశవ్యాప్తంగా వీధుల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని హెచ్చరించింది. ‘అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. ఇలాంటి వివాదాలను నిరోధించేందుకు జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లును తీసుకురావాలి. సీజేఐ సభను ఆర్డర్‌లో పెట్టుకోవాలి. సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలను తక్షణమే పరిష్కరించాలి’ అని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
సీజేఐతో ఎస్‌సీబీఏ అధ్యక్షుడి భేటీ
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆదివారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో సమావేశమయ్యారు. సంక్షోభ పరిష్కారం కోసం ఎస్‌సీబీఏ రూపొందించిన తీర్మానాన్ని సీజేఐకి అందజేశారు. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులు ఈ తీర్మానానికి సమ్మతించారని.. వికాస్ సింగ్ పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్), పెండింగ్ పిల్‌లను సీజేఐ నేరుగా విచారించాలని, లేదంటే కొలీజియం వ్యవస్థలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని ఎస్‌సీబీఏ శనివారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ సానుకూలంగా స్పందించారని వికాస్ వెల్లడించారు.
సమంజసమే: మాజీ జడ్జీల లేఖ
ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఐదుగురు రిటైర్డ్ న్యాయమూర్తులు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. నలుగురు తిరుగుబాటు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు సమంజసమేనని.. వీటిని త్వరలోనే పరిష్కరించుకోవాలని ఆ లేఖలో కోరారు. మాజీ సుప్రీం న్యాయమూర్తి పీబీ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె. చంద్రు, బాంబే హైకోర్టు మాజీ జడ్జి హెచ్ సురేశ్ ఈ లేఖను రాశారు. ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకు ముఖ్యమైన కేసులను ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు. ‘రోస్టర్, కేసుల పంపకంలో సీజేఐ నిర్ణయమే అంతిమం. కానీ.. సున్నితమైన, ముఖ్యమైన కేసులను జూనియర్ న్యాయమూర్తులున్న ధర్మాసనాలకు ఇవ్వటం సరికాదు. వివాదాన్ని వెంటనే పరిష్కరించుకుని.. కేసుల పంపకానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది’ అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.
గెలవలేమని తెలిసే...
‘ఈ నలుగురు న్యాయమూర్తులు తాము లేవనెత్తిన అంశాలను నెగ్గించుకోవాలంటే.. ఫుల్‌కోర్టు (అందరు న్యాయమూర్తులతో సమావేశం)లో విషయాలను లేవనెత్తి ఓటింగ్ నిర్వహించవచ్చు. కానీ సీజేఐకే మెజారిటీ న్యాయమూర్తుల మద్దతుందని ముందే గుర్తించినందుకే ఫుల్‌కోర్టుకు పోకుండా.. తమ ఆవేదనను పంచుకునేందుకే మీడియాతో సమావేశమయ్యారు’ అని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో సీజేఐ కావాలనుకుంటున్న ఓ న్యాయమూర్తి ఈ నలుగురితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment