ప్రతీ వ్యక్తి జీవితంలో అమ్మ ఒక మధురమైన పదం. కానీ, అమ్మ అంటే పదం మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం అంటారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. మాతృవియోగం తర్వాత తన తల్లితో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. అద్భుతమైన శతాబ్ది(తల్లి హీరాబెన్ మోదీని ఉద్దేశించి..) భగవంతుని పాదాల చెంత ఉంది అని సోషల్ మీడియాలో మోదీ చేసిన వ్యాఖ్య చేశారు.
సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి జీవించడం.. ఈ త్రిమూర్తులను అమ్మ ద్వారా అనుభూతి చెందాను అని పేర్కొన్నారు. తెలివితో పని చేయండి.. స్వచ్ఛమైన జీవితాన్ని గడపండి అంటూ తన వందవ పుట్టినరోజున ఆమె తనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు ఆయన. తన అమ్మ సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె అసాధారణమైన మహిళ అని అంటారు నరేంద్ర మోదీ. చాలా చిన్న వయసులోనే తన తల్లి ఆమె మాతృమూర్తిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని, అయినప్పటికీ బలంగా నిలబడిందని పేర్కొన్నారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
1922, జూన్ 18న గుజరాత్ మెహ్‌సనా వద్నగర్‌లో జన్మించారు హీరాబెన్. చిన్నతనంలోనే ఆమె తల్లి స్పానిష్ ఫ్లూతో కన్నుమూసింది. ఫొటోలు కూడా లేకపోవడంతో.. ఆమె ముఖం కూడా హీరాబెన్‌కు గుర్తు లేదట. అలా తల్లి లేకుండానే హీరాబెన్ బాల్యం గడిచింది. తల్లి ఒడిలో సేద తీరని పరిస్థితి.. తన పిల్లలకు రాకూడదని ఆమె ఎంతో తాపత్రయపడింది. బడికి పోయి రాయడం, చదవడం నేర్వలేదు. పేదరికం, కష్టాలతోనే గడిచిపోయింది ఆమె జీవితం. అందుకేనేమో బాధ్యతగా తన ఐదుగురు పిల్లలను పెంచింది. అదే బాధ్యతను బిడ్డలకు ప్రబోధించింది.
బాధ్యతాయుతంగా ఉండాలని పిల్లలకు చెప్పడమే కాదు.. ఆరోగ్యం సహకరించకున్న ఆమె ఓటేసి తన బాధ్యతను నేరవేర్చారు కూడా.
టీ అమ్ముకునే దామోదరదాస్ ముల్చంద్ మోదీని వివాహాం చేసుకున్నారు హీరాబెన్. ఆ ఇంటికి పెద్ద కోడలిగా వెళ్లిన ఆమె.. అంతే బాధ్యతాయుతంగా ఇంటిని నడిపించే యత్నం చేశారు. సోమ భాయ్ మోదీ, అమృత్ భాయ్ మోదీ, నరేంద్ర మోదీ, ప్రహ్లాద్ మోదీ, వసంతి బెన్, పంకజ్ మోదీ.. ఇలా నలుగురు కొడుకులు, ఒక కూతురిని కనిపెంచారామె. గాంధీనగర్‌లో రేసన్ గ్రామంలో చిన్న కొడుకు పంకజ్ మోదీ దగ్గర చివరిరోజుల్లో గడిపారామె. తన పెరుగుదల కోసం , ఎదుగుదల కోసం తన తల్లి ఎన్నో త్యాగాలను చేసిందని మోదీ గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి, తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఎంతో ప్రేరణ ఇచ్చిందని తరచూ చెప్తుంటారు.
నా తల్లి కష్టాలను కళ్లారా చూశా. ఇంట్లో పనులన్నీ ఆమె ఒక్కతే చేసుకునేది. ఇంటి పోషణ కోసం కూడా తన వంతు ప్రయత్నించేది. ఇతరుల ఇళ్లల్లో వంటపాత్రలు కడిగి, చరఖా తిప్పి వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు సాయంగా నిలిచింది. చిన్న ఇల్లు.. బురద మట్టి గోడలు.. వర్షానికి ఇల్లంతా కురిసినా, వర్షం నీరు పడుతున్న చోట బకెట్లు, గిన్నెలు పెట్టేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తన తల్లి ఎంతో దృఢంగా నిలిచిందని మోదీ తన బ్లాగులో రాసుకొచ్చారు.
కష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొనే వారు. ఆమె పేరిట ఎలాంటి ఆస్తులు లేవు. ఒంటిపై ఆమె బంగారం ధరించింది ఏనాడూ చూడలేదు. అసలు ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదు. ఆ తర్వాత కూడా అతి సాధారణ జీవితాన్ని, ఒక చిన్న గదిలో కొనసాగించినట్లు గుర్తు చేసుకున్నారు.
అమ్మతో కలిసి ప్రజల సమక్షంలో ఆయన కనిపించింది అరుదు. ఏక్తా యాత్ర పూర్తి చేసుకుని శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసి.. తిరిగి అహ్మదాబాద్‌కు చేరుకున్నప్పుడు తికలం దిద్దింది ఆ తల్లి. మళ్లీ.. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఆమె కొడుకు వెంట ఉంది.
తల్లి చేసిన కర్తవ్య బోధ వల్లనేమో.. ఆమె అంత్యక్రియలు పూర్తి చేశాక బాధను దిగమింగుకుని తిరిగి విధుల్లోకి దిగి పోయారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ.
తన తల్లి నూరవ పుట్టిన రోజు సందర్భంగా తనకు జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ రాసిన ‘మదర్’ బ్లాగ్ నుంచి సంగ్రహణ
Comments
Please login to add a commentAdd a comment