శత్రుదుర్బేధ్యంగా తయారైంది భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్. ఒకరి తర్వాత ఒకరు. ప్రతీ ఒక్కరూ క్రికెట్ కు కొత్త నిర్వచనం చెబుతున్నారు. పాత షాట్లు పక్కన పెట్టి కొత్త షాట్లతో అలరిస్తున్నారు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచులు గెలిచేస్తున్నారు. ఇక బౌలర్లు అయితే ప్రత్యర్ధి బ్యాటర్లను కుదురుకోనివ్వడం లేదు. నిర్దాక్షిణ్యంగా అవుట్ చేసి పెవిలియన్ పంపేస్తున్నారు. ఇక ఫీల్డర్లు అయితే జిమ్నాస్టిక్ విన్యాసాలతో కళ్లు చెదిరే క్యాచులు పట్టుకుని మ్యాచులు సొంతం చేసుకుంటున్నారు. నవ భారత యువ ఆటగాళ్లు మామూలోళ్లు కారని ప్రపంచ దేశాలు కంగారు పడుతున్నాయి.
భారత క్రికెట్ జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. కొత్త కుర్రాళ్లు కదం తొక్కుతున్నారు. అసాధ్యమన్నదే తమ డిక్షనరీలే లేదన్నట్లు దూసుకుపోతున్నారు. వచ్చిన ప్రతీ కుర్రాడు ప్రత్యర్ధులను భయపెట్టేస్తున్నారు. ఇలాంటి ఆటగాడు మా దగ్గర ఒక్కడుంటే చాలునని ప్రత్యర్ధి జట్ల సారధులు అసూయపడేంతగా మనోళ్లు సత్తా చాటుతున్నారు.
ఈ ఏడాది కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్ జోడీగా బరిలో దిగిన శుభమన్ గిల్ , ఇషాన్ కిషన్ లు ఇద్దరూ తమకి ఎవరూ సాటి రారని బ్యాట్ తో చాటి చెబుతున్నారు. ఈ ఇద్దరూ కొద్ది రోజుల వ్యవధిలోనే వన్డేల్లో చెరో డబులు సెంచరీ చేసి ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం భారత్ లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గిల్ చరిత్ర సృష్టించాడు.
సరిగ్గా నెల రోజుల క్రితం బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం మీద ఆ మ్యాచ్ లో కిషన్ 210 పరుగులు చేశాడు. మరి కొద్ది సేపు ఆడి ఉంటే ట్రిపుల్ సెంచరీ చేసేవాడినని మ్యాచ్ అనంతరం కిషన్ అన్నాడు. ఈ ఇన్నింగ్స్ లో కిషన్ విశ్వరూపం చూసి అంతర్జాతీయ క్రికెటర్లు శెభాష్ అని మెచ్చుకున్నారు.
ఇక భారత మిడిల్ ఆర్డర్ లో ఎంట్రీ ఇచ్చి యావత్ ప్రపంచాన్నీ వణికిస్తోన్న ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోన్న సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తోంటే ఎలాంటి బౌలర్ కి అయినా ముచ్చెమటలు పట్టడం ఖాయం. ఎలాంటి బాల్ వేసినా దాన్ని స్కూప్ షాట్ తో సిక్సర్ కొట్టడం సూర్యకుమార్ కు మంచినీళ్లు తాగినంత తేలిక.
గ్రౌండ్లో అన్ని వైపులా షాట్లు ఆడగల అరుదైన క్రికెటర్ కాబట్టే సూర్య కుమార్ను మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలుస్తున్నారు. సూర్య కుమార్ కు ముందు దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డివిలియర్స్ కు ఆ పేరు ఉండేది. ఇప్పుడు దాన్ని సూర్య సొంతం చేసుకున్నారు. సూర్య ఆడే షాట్లు అలా ఉంటాయి మరి. కొన్నాళ్లు పోతే ప్రత్యర్ది జట్ల బౌలర్లు అంతా కలిసి సూర్య అలాంటి షాట్లు ఆడితే మేం బౌలింగ్ చేయం అని మొరాయించినా ఆశ్చర్యపోనవసరం లేదని చమత్కరిస్తున్నారు సీనియర్లు.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్‌కు ఉన్న టాలెంట్ ఎవ్వరిలోనూ చూడలేదని ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ రికీ పాంటింగ్ కితాబు నిచ్చాడు. ట్వంటీల్లో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టీ ట్వంటీ బ్యాటర్స్ ర్యాంకింగ్ లో నంబర్ వన్ గా ఉన్నాడు. సూర్య కుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత సేపు భారత విజయావకాశాలు సజీవంగా ఉన్నట్లే ధీమాగా ఉండచ్చు. అంత పవర్ ఫుల్ క్రికెట్ తో చెలరేగుతున్నారు సూర్య. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. టి 20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న హార్దిక్ పాండ్యాను వెటరన్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తో పోలుస్తున్నారు.
బ్యాటింగ్ లో తిరుగులేని ఫినిషర్ గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు పాండ్యా. ఇటు బౌలర్ గానూ సత్తా చాటి కీలక దశలో వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్రపోషిస్తున్నాడు పాండ్యా. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు అద్భుతమైన ఫీల్డర్ కూడా. వీటిని మించి చక్కటి వ్యూహాలు అమలుచేసే సారధిగానూ పాండ్యా రాణిస్తున్నాడు. మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అయితే బ్యాట్ తోనూ బాల్ తోనూ వండర్స్ చేస్తున్నాడు.తిరుగులేని ఫీల్డర్ గా రెచ్చిపోతున్నాడు. దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, అక్షర్ పటేల్ వంటి యువ కెరటాలు భవిష్యత్ మాదేనని చాటుకుంటున్నారు.
బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, మావి, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్ , చాహల్ , కుల్ దీప్ యాదవ్ లు ఎప్పుడు అవకాశం ఇచ్చినా వికెట్లు తీసి మెరుస్తున్నారు. మొత్తానికి కొత్త మొహాలన్నీ కూడా స్టార్ క్రికెటర్లను తలపిస్తూ భారత జట్టును విజయాల బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్నోవేటివ్ షాట్స్ తో బ్యాటర్లు యాగ్రెసివ్ బౌలింగ్ తో బౌలర్లు క్రికెట్ ఆటను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొత్త ఆటగాళ్లకు భారత జట్టులో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కొత్త రక్తంతో కుర్రాళ్లు కదం తొక్కుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment