గూఢచారి, కౌబాయ్.. ఇలా వైవిధ్యభరితమైన పాత్రలతో పాటు సామాజిక-పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు రంజింప చేశారు పద్మభూషణ, నటశేఖర కృష్ణ. సినీ సాహసాలకు ఆయన కేరాఫ్. నటనలో మాత్రమే కాదు ఫిల్మ్ మేకింగ్‌లోనూ ఆయనొక ప్రయోగశాల. నిర్మాతగా, దర్శకుడిగా తనకుంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును దక్కించుకున్న వ్యక్తి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త తరహా సాంకేతికతల హంగులను అందించిన వ్యక్తి. తక్కువ టైంలోనే ఆనాటి అగ్రహీరోల సరసన నిలిచారాయన. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడికి సాక్షి అందిస్తున్న నివాళి..
పాత తరంలో మాస్ హీరో ట్యాగ్‌ను, అత్యంత వేగంగా అందుకున్న నటశేఖరుడు.. ఆపై వరుస హిట్లతో సూపర్ స్టార్‌గానూ ఎదిగారు. ఒకానొక టైంలో ఏడాది కాలంలో 17 సినిమాలు తీసుకుంటూ.. దర్శకనిర్మాతల పాలిట కల్పతరువుగా మారారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ. వాళ్ల అగ్రసంతానం కృష్ణ. చదువుకొనే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తితో అటువైపు మళ్లారు. ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు.
డిగ్రీలో చేరాక.. పూర్తిగా సినిమాలవైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరంభంలో.. ‘‘పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు- ప్రతిష్ఠ’’ వంటి చిత్రాలలో చిన్న రోల్స్‌లో కనిపించారు. ఆపై ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్‌లో కొత్తవాళ్లతో తెరకెక్కించిన తేనెమనసులులో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించారు. ఆ సమయంలోనే హ్యాండ్‌సమ్ హీరోగా ఆయనకు ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆపై ‘కన్నెమనసులు, గూఢచారి 116’ వంటి సినిమాల్లో నటించి మరింత పేరు సంపాదించారు.
‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు హీరోయిజం బేస్డ్ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయినా ఫ్యామిలీ&లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఉండమ్మ బొట్టు పెడతా, మంచి కుటుంబం, విచిత్ర కుటుంబం, అక్కాచెల్లెళ్లు, పండంటి కాపురం లాంటివెన్నో.
తెలుగు సినిమాకు కొత్త నీరు
► కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం అయ్యింది.
► గూడుపుఠాణి.. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా.
► తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం.. భలే దొంగలు.
► తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా.. సింహాసనం.
► సింహాసనం.. స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా.
► అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఫ్రెండ్లీ స్టార్‌గా ఉంటూనే..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. ముక్కుసూటితనం ఉన్న వ్యక్తిగా పేరొందారు కృష్ణ. అదే సమయంలో స్టార్ హీరో ట్యాగ్‌కు చేరువవుతున్న సమయంలోనూ ఆయన ఇతర స్టార్‌ల చిత్రాల్లో నటించుకుంటూ పోయారు. తన తోటి హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితరుల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
► అగ్రహీరోలతో పోటీ పడుతూనే ఆయన కొన్ని సాహసోపేతమైన చిత్రాలు తీశారు. కురుక్షేత్రం, దేవదాసు.. అందుకు ఉదాహరణలు.
► స్టార్ ద్వయం ఎన్టీఆర్-ఏన్నార్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఏమాత్రం తీసిపోని స్టార్‌డమ్ తొలినాళ్లలోనే సొంతం. లేడీఫాలోయింగ్ మాత్రమే కాదు.. మేల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఆయనకు. ఆయన్ని చూసేందుకు చెన్నైకి రైళ్లలో, బస్సుల్లో అభిమానులు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదు. ఏకంగా రికార్డు స్థాయిలో 2,500 అభిమాన సంఘాలు కృష్ణ పేరిట ఉండేవి.
► సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన నటించిన 30 చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదల అయ్యాయి. 1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశాడు. సంక్రాంతి విడుదలల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు) తర్వాత మూడవ స్థానంలో నిలిచినా.. వరుసగా ప్రతీ ఏటా సంక్రాంతులకు సినిమాలు విడుదల కావడం (21 సంవత్సరాలు) విషయంలో కృష్ణదే రికార్డు.
► ఆ తర్వాతి తరంలోనూ ఆయన కీలక పాత్రలు పోషించిన చిత్రాలు వచ్చాయి. నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, కోలీవుడ్ నటుడు విక్రమ్‌లతో పాటు తన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు చిత్రాల్లోనూ ఆయన నటించి, మెప్పించారు.
► కొమియో పాత్రల్లో పలు చిత్రాల పాటల్లోనూ ఆయన కనిపించారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో ఆయన గెస్ట్ సాంగ్‌లో కనిపించారు. యమలీలలోని జుంబారే సాంగ్.. ఓ ఊపు ఊపింది కూడా.
► ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ దారిలోనే తనకూ ఓ సొంత నిర్మాణ సంస్థ అవసరమని ‘పద్మాలయా’ స్టూడియోను నెలకొల్పారు. ఈ బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అగ్నిపరీక్ష’. ఆ తరువాత తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు. కేఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఆ చిత్రం ఓ కల్ట్‌క్లాసిక్‌గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది.
► పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు లాంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించారు.
► 1964-95 మధ్య ఏడాదికి పదేసి చిత్రాల్లో కనిపించారు ఆయన. ఒకానొక టైంలో రోజుల్లో గంటల తరబడి విరామం లేకుండా షూటింగ్‌లలో పాల్గొన్నారు.
► అల్లూరి సీతారామరాజు.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్‌గా తెరకెక్కింది. అయితే ఆ చిత్ర భారీ విజయం తర్వాత వరుసగా ఆయనకు 14 ఫ్లాపులు వచ్చిపడ్డాయి. ఆపై పాడి పంటలు చిత్రంలో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
► ముందగుడు, కిరాయి కోటిగాడు, అగ్నిపర్వతం, అడవి సింహాలు, ప్రజారాజ్యం, ఖైదీ రుద్రయ్య ఆయన్ని టాప్ పొటిషన్‌ను తీసుకెళ్లాయి. సింహాసనం ఆయన్ని మరో మెట్టు ఎక్కించింది. మాయదారి మల్లిగాడు, ఇంద్రధనుస్సు, అన్నదమ్ముల సవాల్, ఊరికి మొనగాడు లాంటి మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.
► 1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు.
► 1990 నుంచి మూడేళ్లపాటు ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. 1994లో వచ్చిన పచ్చని సంసారం, వారసుడు చిత్రాలు ఆయన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించాయి. ఆపై నెంబర్ వన్, అమ్మ దొంగా చిత్రాలు ఆయనకు సూపర్‌సక్సెస్ అందించాయి.
► ఆయన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా తెరకెక్కిన ‘ఈనాడు’ మంచి విజయాలు సాధించాయి. 300వ సినిమాగా ‘తెలుగువీర లేవరా’ తీశారు.
► మద్రాస్ నగరంలో వందరోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చిత్రంగా చీకటి వెలుగులు, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి.
► కృష్ణ సతీమణి విజయనిర్మల ఆయన సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా నిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’ చిత్రంలోనూ కృష్ణనే నాయకుడు. ఆపై ఆమె డైరెక్షన్‌లోనూ 40 దాకా సినిమాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు.
► కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని తొలి 70 ఎంఎం సినిమాగా అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. “నాగాస్త్రం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి హిట్స్ నూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలీవుడ్‌లో డినో మోరియా, బిపాసా బసు లీడ్‌రోల్‌లో ఇష్క్ హై తుమ్‌సే(2004) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. తెలుగు సంపంగి చిత్రానికి రీమేక్ ఇది.
రాజకీయాల్లోనూ..
► రాజకీయాల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం.. ఒక హాట్ టాపిక్‌గా మారింది. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా.. తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు.
► ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న కృష్ణ.. చిత్రపరిశ్రమలో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం నుంచి 2009లో పద్మభూషణ్ గౌరవాన్ని సైతం అందుకున్నారు. అల్లూరి సీతారామ రాజు చిత్రానికి గానూ నంది అవార్డు(1974), ఎన్టీఆర్ నేషనల్ అవార్డు(2003), ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డు(1997)
సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌ను అంతే ఓపెన్‌గా అంగీకరించేవారు ఆయన. సాహసోపేతమైన వైఖరితో సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్లేవారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి, నిర్మాతలకు నష్టం కలగకుండా చిత్రాలు చేయాలని తపించేవారు. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్‌గా వెలుగొందారు.
Comments
Please login to add a commentAdd a comment