Superstar Krishna Died At Age Of 79 Due To Heart Attack, Celebrities Pay Tributes - Sakshi
Sakshi News home page

Superstar Krishna Death: విషాదం.. సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూత

Published Tue, Nov 15 2022 6:18 AM | Last Updated on Tue, Nov 15 2022 10:06 AM

Superstar Krishna Died At Age Of 79, Celebrities Pay Tributes - Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు, స్టార్‌ హీరో మహేశ్‌ బాబు తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్‌ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతితో టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇటీవల లెజెండరి నటులు కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణాన్ని మరవకముందే కృష్ణ మృతి చెందడంతో ఇటూ సినీ పరిశ్రమ, అటూ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1942 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో జన్మించాడు. 1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు, భార్య ఇందిర ఇటీవల మరణించారు. మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకూడా ఈ మధ్యనే మృతి చెందారు. 

తేనె మనసులతో మొదలుపెట్టి..
డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్‌ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది.

గూఢచారి 116 సక్సెస్‌తో.. 20 సినిమాల్లో ఛాన్స్‌
రెండో సినిమా ‘కన్నె మనసుల్లో’ నటిస్తుండగానే ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అంతేనా.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంద్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢచారి 116తో ఆయన ఇమేజ్‌ అమాంతం పెరగడమే గాక.. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్‌బాండ్‌ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజిని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటిచిత్రం కూడా ఇదే.

ఏడాదిలో 18 సినిమాలు..
70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు.

కొత్త సాంకేతికతను పరిచయం చేసి..
నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్‌లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరిండ్‌ అండ్‌ డాషింగ్‌’ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్‌లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే.


1965లో కృష్ణ తొలిచిత్రం తేనె మనసులు విడుదల 
తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ 
హీరోగా 350 పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ
సింహాసనం సినిమాతో మెగాఫోన్ 
తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దిన కృష్ణ
అల్లూరి సీతారామరాజుతో నటుడిగా ఎనలేని ఖ్యాతి
హీరోగా,నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు 
పద్మాలయ స్టూడియో పతాకంపై ఉత్తమ చిత్రాల నిర్మాణం
విజయనిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాల్లో స్క్రీన్ షేర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement