భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడకు అంతగా ప్రాధాన్యం లేదు. ఫుట్‌బాల్ కంటే క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉన్న దేశంలో గోవా, బెంగాల్, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌కే విపరీతమైన ఆదరణ ఉంటుంది. భారత ఫుట్‌బాల్ జట్టులో ఆడే ఆటగాళ్లలో కూడా ఈ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. కానీ మనకు తెలియకుండానే మన దేశంలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న ప్రాంతం మరొకటి ఉంది. అదే మహారాష్ట్రలోని కొల్హాపూర్ సిటీ.
నవంబర్ 20 నుంచి ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉంది అని ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి. గత 30 ఏళ్లుగా కొల్హాపూర్ సిటీలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్.. అక్కడి ప్రజలు ఆ ఆటపై పెట్టుకున్న ప్రేమ ఎంతనేది బయటకొచ్చింది.
కొల్హాపూర్ సిటీలో నివసించే ప్రజలు క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌నే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకు సాక్ష్యం ఆ సిటీలో ఉన్న గోడలపై స్టార్ ఫుట్‌బాలర్స్ పెయింటింగ్స్. ప్రతీ వీధిలోనూ ఒక్కో ఫుట్‌బాలర్ మనకు కనిపిస్తాడు. మెస్సీ నుంచి రొనాల్డో వరకు.. మారడోనా నుంచి పీలే దాకా.. ఇలా మనకు కావాల్సిన ఆటగాళ్ల చిత్రాలన్ని పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి. అయితే అర్జెంటీనా, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఇక్కడ కాస్త ఎక్కువగా ఆదరిస్తారు.
ఇటీవలే కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ను అర్జెంటీనా చిత్తు చేసి విజేతగా నిలిచినప్పుడు కొల్హాపూర్‌లో పెద్ద జాతర జరిగింది. ఖాన్‌బోడా తలీమ్ అనే గ్రూప్ ఈ వేడుకల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. బ్లూ, వైట్ ఫ్లాగ్స్‌గా విడిపోయి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సాహూ అనే ఫుట్‌బాల్ మైదానం ఉంటుంది. 30వేల సామర్థ్యంతో సీటింగ్ కెపాసిటీ ఉండడం విశేషం.
ఇక గణేష్ నవరాత్రుల సందర్భంగా కొల్హాపూర్ ఫుట్‌బాల్ ఫెస్టివ్ సీజన్ మొదలై.. దాదాపు రెండు నెలలు అంటే దీపావళి వరకు ఈ టోర్నీ సాగుతుంది. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టును గౌరవంగా చూస్తారు. ఆ సిటీలో తిరిగే ప్రతీ వ్యక్తి తమ వాహనాలపై పీటీఎమ్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతారు. ఇలా ఫుట్‌బాల్‌పై తమకున్న పిచ్చి ప్రేమను చూపిస్తుంటారు.
ఇదంతా పక్కనబెడితే.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా దగ్గర్లోని శివాజీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌కు పట్టుమని వంద మంది కూడా రాలేదు. కానీ అదే రోజు పక్కనే ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రాక్టీస్ క్లబ్, శివాజీ మండల్ మధ్య నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం విశేషం. అందుకే ఇకపై భారత్‌లో ఫుట్‌బాల్ అనగానే కేరళ, బెంగాల్, గోవా లాంటి రాష్ట్రాలే కాదు కొల్హాపూర్ సిటీ కూడా గుర్తుకురావాల్సిందే.
చదవండి: '2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్‌గా మారాయి'
Comments
Please login to add a commentAdd a comment