కర్డుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా తయారైంది ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి. ఆటపై దృష్టి పెట్టకుండా అనవసర విషయాల జోలికి వెళ్లి మూల్యం చెల్లించుకుంది. పిచ్‌పై లేనిపోని నిందలేసి మానసికంగా కుంగదీయాలని చూసి దెబ్బతింది. ఆడలేక మద్దలదెరువు అన్నట్లు.. తమ ఆటను కేవలం మాటలకే పరిమితం చేసింది.
టీమిండియాను ఈసారి ధీటుగా ఎదుర్కొంటాం.. స్పిన్‌ను చీల్చి చెండాడుతామంటూ బీరాలు పలికిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు అదే స్పిన్ ఉచ్చుకు బలైపోయింది. అంతా ముగిసిన తర్వాత ఇప్పుడు ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్న ఆస్ట్రేలియా మొదట జట్టు కూర్పు సరిగ్గా ఉందా లేదా అన్నది పరిశీలించుకోవడం ముఖ్యం.
ఇక ఆస్ట్రేలియా ఓటమికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. మొదటగా బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. 2021-22 యాషెస్ సిరీస్ హీరో ట్రెవిస్ హెడ్‌ను పక్కనబెట్టి ఆసీస్ పెద్ద మూల్యం చెల్లించుకుంది. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఆడించకుండా తప్పు చేసి ఓటమిని కొనితెచ్చుకుంది. డేవిడ్ వార్నర్ స్థానంలో ట్రెవిస్ హెడ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా మంది క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
భారత్‌తో సిరీస్‌కు ముందు గతేడాది డిసెంబర్ సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ట్రెవిస్ హెడ్ 92 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ప్రొటిస్‌ను ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ హెడ్ అదరగొట్టాడు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికి హెడ్ 70 పరుగులతో రాణించాడు.
వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ట్రెవిస్ హెడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే డేవిడ్ వార్నర్ కోసం హెడ్‌ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఇంతకముందు వార్నర్‌కు భారత్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంటే.. అది హెడ్‌కు లేదు. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు వార్నర్ పెద్దగా చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. అయితే సౌతాఫ్రికాతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తప్ప ముందు వెనుక వార్నర్ పెద్దగా ఆడింది ఏం లేదు.
ఎంత సీనియర్ క్రికెటర్ అయినా ఫామ్‌లో లేకపోతే నిర్ధాక్షిణ్యంగా పక్కనబెట్టడం క్రికెట్ ఆస్ట్రేలియా నైజం. కానీ వార్నర్ విషయంలో అలా చేయలేకపోయింది. ఫామ్ కన్నా అనుభవానికే విలువనిచ్చింది. ఇది మంచిదే కావొచ్చు.. కానీ జట్టుకు చేటు తెస్తేనే ప్రమాదం. ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టులో వార్నర్‌పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిచెల్ స్టార్క్, కామెరున్ గ్రీన్ దూరం కావడం కూడా ఆసీస్‌కు ఎదురుదెబ్బే. అయితే కామెరున్ గ్రీన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇక నాగ్‌పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ల ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్నప్పటికి భారత బ్యాటర్లు అదరగొట్టిన పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం అర్థశతకం మార్క్‌ను అందుకోలేకపోయారు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి జరగనుంది.
చదవండి: ముందే భయపడ్డారు; పిచ్‌పై ఉన్న శ్రద్ద ఆటపై పెడితే బాగుండు
Comments
Please login to add a commentAdd a comment