ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు.
కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.
మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపు
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.
అరంగేట్రంలోనే అర్ధ శతకం
ఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.
కోహ్లి, బుమ్రాలతో గొడవ
ఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్‌స్టార్లు విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.
డిఫెన్సివ్ టెక్నిక్ లేదు
ఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.
కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.
మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్‌స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో కొన్‌స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment