అందాల ఐశ్వర్యమా, కింగ్‌ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి? | Do you the technology of the designer babies | Sakshi
Sakshi News home page

అందాల ఐశ్వర్యమా, కింగ్‌ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?

Published Mon, Dec 5 2022 1:22 PM | Last Updated on Mon, Dec 5 2022 4:37 PM

Do you the technology of the designer babies - Sakshi

భూమి మీద నివసించే ప్రాణుల్లో మనిషి మాత్రమే బుద్ధి జీవి. అపారమైన తెలివితేటలు సొంతం చేసుకున్న మనిషి.. తన సుఖం కోసం నిరంతరం అన్వేషిస్తున్నాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. భావి తరాలు కష్టపడకుండా..సుఖించడానికి శ్రమిస్తున్నాడు. భూమి మీద మనిషి పుట్టుకకు బీజం వేసిన ప్రకృతితో కూడా చెలగాటమాడుతున్నాడు. మానవ ప్రత్యుత్పత్తికి కొత్త దారులు వెతుకు తున్నాడు.  భూమి మీద మానవ మనుగడ, పురోగతి ఒక క్రమపద్ధతిలో సాగుతోంది. టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషి ఆలోచనలు మారి పోతున్నాయి. ఒకప్పుడు పిల్లలు పుట్టని మహిళలకు ఇంటా బయటా ఛీత్కారాలు ఎదురయ్యేవి. అంతా అవమానకరంగా ప్రవర్తించేవారు. బయో టెక్నాలజీలో వచ్చిన పురోగతి బిడ్డలు కలగడానికి రకరకాల ప్రత్యామ్నాయాలు చూపిస్తోంది. ఇప్పుడు అన్నిటికీ మించి..మానవ సమాజ గతినే మార్చేలా  డిజైనర్ బేబీస్ ప్రయోగాలు జరుగుతున్నాయి. 

50 ఏళ్ళ క్రితం మానవ ప్రత్యుత్పత్తికి సంబంధించి వైద్య రంగంలోను, టెక్నాలజీపరంగానూ  పెద్దగా డవలప్‌మెంట్‌ లేదు. పుట్టేది అబ్బాయో.. అమ్మాయో తెలీదు. తర్వాతి కాలంలో సైన్స్ సాధించిన పురోగతి వల్ల పుట్టేది ఆడా..మగా అనేది తెలిసిపోతోంది..ఆ తర్వాత కృత్రిమ గర్భధారణతో పిల్లలు లేనివారికి బిడ్డల్ని అందిస్తున్నారు. కాని ఇప్పుడు పిల్లలు పుట్టకుకు సంబంధించి రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. బయోటెక్నాలజీ రంగం ఊహించనంత స్థాయికి చేరుతోంది. 


అందమైన అమ్మాయి కావాలా? తెలివైన అబ్బాయి కావాలా?
♦ నీలికళ్ళ అమ్మాయి కావాలా? ఆరడుగుల అబ్బాయి కావాలా?
ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్త కావాలా? సచిన్ లాంటి క్రికెటర్ కావాలా?
హాలీవుడ్ సినిమాల్లోని సూపర్ హీరో వంటి కొడుకు కావాలా?
జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా?

షోరూంకు వెళ్ళి కారు కొనుక్కున్నట్టుగా.. నగల షాపులో డిజైనర్ నగలు ఆర్డర్ ఇచ్చినట్లుగా తాము కోరుకున్న బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా చంటి బిడ్డల్ని తయారు చేసే లేబరేటరీలకు వెళ్ళి ఆర్డర్ ఇచ్చే రోజులు రాబోతున్నాయి. మరో పది లేదా పదిహేనేళ్ళలో ఇది సాధ్యం అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆల్రెడీ నాలుగేళ్ళ క్రితమే డిజైనర్ బేబీస్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసిందని చైనా శాస్త్రవేత్త హి జియాన్‌కుయ్ చెప్పేశాడు. తాను ఇద్దరు డిజైనర్ బేబీస్‌ను సృష్టించినట్లు ఆయన ప్రకటించారు. ఈ టెక్నాలజీని ప్రపంచం ఆమోదించిందా? అది నిజంగానే సాధ్యమైందా అనేదానిపై రకరకాల చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే చట్ట విరుద్ధమైన ప్రయోగాలు చేసినందుకు డిజైనర్ బేబీస్‌ను తయారు చేసినట్లు చెప్పుకున్న జియాన్‌కుయ్‌పై విచారణ జరిపిన చైనా ప్రభుత్వం ఆయనకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అతనితో కలిసి పరిశోధనల్లో పాలుపంచుకున్న మరో ఇద్దరికి కూడా శిక్ష పడింది. ఆ శిక్ష కూడా రెండు నెలల్లో పూర్తి కాబోతోంది.

సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో విప్లవాత్మక అభివృద్ధి సాధిస్తోంది. జన్యుమార్పిడి ద్వారా దిగుబడి పెంచే, చీడ పీడలు సోకని సరికొత్త వంగడాలు సృష్టించింది. అలాగే ఇప్పుడు మనిషి పుట్టుకకు సంబంధించిన విషయంలో కూడా శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. జన్యుమార్పిడి ద్వారా కోరుకున్న విధంగా బిడ్డలను తయారుచేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం బిడ్డలు కలగని దంపతులు గుడుల చుట్టూ తిరిగేవారు. పిల్లలు పుట్టకపోతే తమ గత జన్మ పాప ఫలితం అని సరిపెట్టుకునేవారు. సైన్స్‌పై నమ్మకం లేని, పెరుగుతున్న విజ్ఞానం గురించి తెలియని ఎంతో మంది ఇప్పటికీ దేవుళ్ళను, బాబాలనే నమ్ముతున్నారు. అయితే చదువుకున్నవాళ్ళు, సెలబ్రిటీలు, వైద్య విజ్ఞానం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు డాక్టర్లను సంప్రదించి తమలో ఉన్న శారీరక లోపాలు సవరించుకుని బిడ్డల్ని కంటున్నారు. అప్పటికి కూడా సాధ్యం కాకపోతే కొత్తగా ఆచరణలోకి వచ్చిన IVF ద్వారానో అదీ సాధ్యం కాకపోతే సరోగసి ద్వారానో బిడ్డల్ని కంటున్నారు. ఇటీవల సరోగసి విధానంలో పిల్లల్ని కనడానికి సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సరోగసి బిడ్డల విషయమై ఈ మధ్య ఒక సినీ సెలబ్రిటీ విషయంలో వివాదం రేగిన విషయం కూడా తెలిసిందే.

బిడ్డలు లేని దంపతులకు వివిధ రకాల సైంటిఫిక్‌ పద్దతుల్లో బిడ్డలు కలిగేలా చేయడం... వైద్య రంగం మూడు నాలుగు దశాబ్దాల నుంచి సాధిస్తున్న అద్భుత విజయాల్లో అత్యంత కీలకమైన ముందడుగు. ఇదంతా ఒక ఎత్తయితే..వ్యవసాయంలో జన్యుమార్పిడి వంగడాల ద్వారా చీడ, పీడలు బాధ లేని, దిగుబడి పెంచే కొత్తరకం వంగడాలను సృష్టించినట్లు..జన్యుమార్పిడి బిడ్డలను తయారు చేసే టెక్నాలజీ రూపొందించారు. చైనా సహా చాలా దేశాల్లో మనుషుల విషయంలో ఇటువంటి ప్రయోగాలు చేయడాన్ని నిషేధించారు. ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధులు, అంటు వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక జబ్బులు ఉన్నదంపతులకు పుట్టే బిడ్డల్లో రకరకాల వైకల్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దంపతుల్లో ఒకరికి సమస్య ఉన్నా పుట్టే బిడ్డల్లో లోపాలుండవచ్చు. ఈ లోపాలన్నీ సరిచేసేందుకే జెనిటికల్లీ మోడిఫైడ్ పిల్లల్ని తయారు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు.


చైనా శాస్త్రవేత్త జియాన్‌కుయ్‌ పురుషుల్లో ఎయిడ్స్‌ ఉన్న దంపతులకు కలిగిన పిండాల్లోని జన్యువులను సవరించడం ద్వారా డిజైనర్ బేబీలను సృష్టించారు. ఇలా పురుషుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్న ఏడుగురు దంపతులను ఎంపిక చేసుకుని వారికి కలిగిన పిండాల్లోని జన్యువులను ఎడిట్‌ చేశారు. వీరిలో ఒక జంటకు మాత్రమే ప్రయోగం సక్సెసై కవలలు జన్మించారు. వారికి లులు, నానా అని పేర్లు పెట్టారు. 2018 నవంబర్‌లో ఈ ప్రయోగం సఫలమైంది. తన ప్రయోగం విజయవంతమైందని జియాన్‌కుయ్ స్వయంగా ప్రకటించారు. అయితే చైనాలోని వైద్య సంస్థలు ఏవీ కూడా ఈ ప్రయోగాన్ని ధృవీకరించలేదు. వైద్యరంగానికి చెందిన ప్రముఖ మ్యాగజైన్‌లేవీ దీని గురించి ప్రచురించలేదు. ఈ ప్రయోగంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన చైనా ప్రభుత్వం..చట్ట విరుద్ధ వైద్య ప్రయోగాలు చేసినందుకు గాను.. జియాన్‌కుయ్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించింది. ఏడాది పాటు సాగిన విచారణ అనంతరం 2019 డిసెంబర్‌లో ఆ శాస్త్రవేత్తతో పాటు ఆయన ఇద్దరి సహచరులకు కూడా మూడేళ్ళ శిక్ష పడింది.


క్లస్టర్డ్‌ రెగ్యులర్‌లీ ఇంటర్‌స్ప్రెడ్‌ షార్ట్‌ పాలిండ్రోమిక్ రిపీట్స్‌ అనే ఒక వినూత్న వైద్య ప్రక్రియను 2012లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని షార్ట్‌ కట్‌లో క్రిస్పర్ కాస్‌ 9 విధానం అని పిలుస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా ప్రాణాంతకమైన కేన్సర్ వంటి జబ్బులను నయం చేయవచ్చని నిరూపించారు. కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కణంలో CCR 5 అనే జన్యువులోని ప్రొటీన్ ద్వారా HIV వైరస్‌ జన్యువులోకి ప్రవేశిస్తుంది. క్రిస్పర్ కాస్ 9 జీన్ ఎడిటింగ్‌ టూల్ ద్వారా HIV వైరస్‌ను కణంలోకి అనుమతిస్తున్న ప్రొటీన్‌ను తొలగించగలిగారు. పెరుగుతున్న పిండంలో ఈ జన్యు ఎడిటింగ్‌ చేయడంలో చైనా శాస్త్రవేత్తల బృందం విజయవంతమైంది. ఈ ప్రొటీన్‌ను తొలగించడం ద్వారా సంబంధిత బిడ్డలకు ఎయిడ్స్‌తో పాటు కలరా, స్మాల్‌పాక్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించవచ్చు. పెరుగుతున్న పిండంలో జన్యువు ఎడిటింగ్‌ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. పిండ దశలోనే జన్యువులను ఎడిటింగ్‌ చేయడం ద్వారా లోపాలున్న జన్యవులను తొలగించి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వగలుగుతారు. 


కేన్సర్ వంటి జబ్బులను నయం చేయడానికి క్రిస్పర్ కాస్‌ 9 విధానాన్ని అమలు చేస్తున్నారు. కేన్సర్ కణాలను ఈ టెక్నాలజీ ద్వారా చంపేస్తే.. ఆ మనిషిని కాపాడవచ్చు. కాని దీని ద్వారా జన్యువులను ఎడిట్‌ చేస్తే తర తరాలుగా ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఒక వ్యక్తి వంశవృక్షం మొత్తానికి ఈ ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుంది. కణంలోని ఒక జన్యువును తొలగించడం ద్వారా ఒక జబ్బును అతని వంశ వృక్షం నుంచి పూర్తిగా తొలగించవచ్చు.  (ఇంకా ఉంది) 
ఈ. వీ. బాలాజీ, కన్సల్టింగ్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement