designer baby
-
జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమేనా?
మనిషి తన సుఖ, సంతోషాల కోసం చేస్తున్న ప్రయోగాలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో పట్టించుకోవడంలేదు. ఒక శతాబ్ద కాలంలోనే భూగోళంలో వేల సంవత్సరాలకు సరిపడా విధ్వంసం సృష్టించాడు. సహజసిద్ధమైన ప్రక్రియకు భిన్నంగా డిజైనర్ బేబీస్‌ను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఈ ప్రయోగాలు ప్రపంచానికి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజైనర్ బేబీస్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంట్లో వాడుకునే వాషింగ్ మెషిన్ లేదా ఫ్రిజ్ కొనాలంటే షోరూమ్‌కి వెళ్ళి రకరకాల కంపెనీలకు చెందినవాటిని పరిశీలించి దేనిలో ఉత్తమమైన ఫీచర్స్ ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం. రెండు మూడు దశాబ్దాలు తర్వాత చంటిబిడ్డల్ని తయారు చేసే కంపెనీలు పుట్టుకొస్తాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బిడ్డలు కావాలనుకున్న దంపతులు ఆ కంపెనీకి వెళ్ళి వారు తయారు చేస్తున్న బిడ్డలకు సంబంధించిన బ్రోచర్స్ చూసి తమకు కావాల్సిన లక్షణాలున్న బిడ్డల్ని లేదంటే రకరకాల కాంబినేషన్లతో కూడిన బిడ్డల్ని తయారు చేయాలని కంపెనీని కోరే పరిస్థితులు వస్తాయంటున్నారు. నవ మాసాలు మోసి బిడ్డల్ని కనాల్సిన అవసరం లేదు. ఇప్పటిలాగా సరోగసి వివాదాలు కూడా ఉండవు. మనకు కావాల్సిన బేబీని నచ్చినట్లు డిజైన్ చేసుకుని తయారు చేయించుకోవచ్చు. అయితే ఇటువంటి అభివృద్ధి సమాజానికి మంచిదేనా? అసలు ఇటువంటి ప్రయోగాలు నిజంగా సాధ్యమవుతాయా? మానవ శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. లేబొరేటరీలో వైరస్‌లను సృష్టించినంత తేలికగా...మనిషి జన్యువులను మనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకోవడం కుదిరే పనేనా? అంటూ అనేక ప్రశ్నలు మేధావులు, సామాజిక వేత్తలు, సైంటిస్టుల నుంచి వినిపిస్తున్నాయి. అసలిటువంటి ప్రయోగాలు నైతికమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొక్కలకు సంబంధించి జన్యుపరమైన మార్పులతో మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతున్నాం. అయితే మనుషుల విషయానికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జన్యువుల్లో మార్పులు చేయడం అంత తేలికైన విషయం కాదంటున్నారు అనేక మంది సైంటిస్టులు. ఒక వ్యక్తికి తల్లి దండ్రులనుంచి..తరతరాలుగా వస్తున్న మానసిక, ఆరోగ్య లక్షణాలు, అందమూ, తెలివితేటలు, రంగు, పొడుగు విషయాల్లో మార్పులు చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనిషికి సంబంధించిన ప్రతి లక్షణానికీ కొన్ని వందలు లేదా వేల జన్యువులు కారణమవుతాయి. మనిషి ఎత్తుని ప్రభావితం చేసే జన్యు వైవిధ్యాలు 93 వేల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల్లో 93 వేలలో 697 జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు. జన్యు పరివర్తన ఎంత సంక్లిష్టమైన వ్యవహారమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డిజైనర్ బేబీస్ అన్న మాట ప్రస్తుతానికి సైన్స్ ఫిక్షన్‌కే పరిమితం అని తేల్చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ మనం జీన్ ఎడిటింగ్ ద్వారా జన్యువుని సవరించగలుగుతున్నామే కానీ..దాన్ని మెరుగుపరచడం గురించి మనకేమీ తెలియదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎంతో కసరత్తు చేస్తారు. డజన్ల మంది ఎన్నో వందల గంటలు శ్రమిస్తారు. ఎన్నో అధ్యయనాలు, వాటికి ఫుట్ నోట్స్‌లు తయారు చేసుకుంటారు. ఇవన్నీ చేస్తేనే గాని ఒక ప్రోగ్రాం తయారు కాదు. అదేవిధంగా ఒక జన్యువును ఎడిట్ చేయాలంటే ఇంతకంటే ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అవసరం అవుతుంది. ఇక జన్యువును ఉన్నదానికంటే మెరుగుపర్చడం అంటే ఇప్పట్లో సాధ్యమయ్యేదే కాదంటున్నారు. మనిషిలోని లక్షణాలు మార్చి మనకిష్టం వచ్చినట్లుగా బేబీస్‌ను తయారు చేసుకోవడం అనేది అత్యాశే అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. చైనా శాస్త్రవేత్త కేవలం ఒక జన్యువును తొలగించే ప్రక్రియ మాత్రమే చేయగలిగారు. తద్వారా పుట్టిన బిడ్డలకు ఎయిడ్స్ రాకుండా నివారించగలిగారు. అలా కాకుండా మనం కోరుకున్న లక్షణాలు గల బిడ్డలు పుట్టాలంటే జన్యువులను మెరుగుపరచాలి. ఆయా లక్షణాలకు సంబంధించిన మార్పులు జన్యువుల్లో చేయగలగాలి. ఇప్పటికీ అనేక జబ్బులను నయం చేయడమే మనిషికి సాధ్యం కావడంలేదు. అవన్నీ వదిలేసి కోరుకున్న లక్షణాలున్న బిడ్డలను తయారు చేసుకోవడం అనేది అసాధ్యమంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మేధావులైన వైద్య పరిశోధకులు నిజంగా డిజైనర్ బేబీస్‌ను తయారు చేస్తే అప్పుడు సమాజంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఇటువంటి వైద్య విధానాలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. సమాజంలో 90 శాతంగా ఉన్న ఇతర వర్గాలకు ఇటువంటి టెక్నాలజీలు ఎంతో దూరంలో ఉంటాయి. అంటే డబ్బున్నవారు మాత్రమే తమకు కావాల్సినవిధంగా బిడ్డలను లేబరేటరీల్లో తయారు చేయించుకుంటారు. అందమైన, తెలివైన, దీర్ఘాయువు గలిగిన, వ్యాధులు దరిచేరని హై ప్రొఫైల్ బిడ్డలను తయారు చేయించుకుని పెంచుకుంటారు. సమాజంలోని మిగిలిన వర్గాల ప్రజలు వీరితో ఏ విషయంలోనూ పోటీ పడలేరు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఇప్పటికే మన సమాజంలో ఆడబిడ్డలంటే పుట్టకముందే చంపేసే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా తమకు పుడుతున్న బిడ్డల్లో లోపాలు తెలుసుకుని మరో రకమైన భ్రూణహత్యలు సమాజంలో పెరిగిపోతాయి. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒక వైకల్యం నిరోధించడానికి ఒక జన్యువును సవరించగలుగుతాం. కాని దాని వల్ల మరో కొత్త వైకల్యం వస్తే..ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? పైగా మనుషులు.. ప్రోగ్రామింగ్ చేసిన రోబోల్లా...ప్రోగ్రామింగ్ బిడ్డలు భూమి మీదకు వస్తే వారికి సొంత తెలివితేటలు, ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులు ఎలా కోరుకుంటే వారు అలాగే తయారవుతారు. ఇటువంటి పరిణామాలు, పరిశోధనలు భవిష్యత్ సమాజాన్ని గందరగోళంగాను, అంతరాలు మరింతగా పెంచేదిగాను, అస్తవ్యస్థంగాను, సమాజాన్ని వినాశనం దిశగానూ నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సమాజం మేలు కోరే వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో కొత్త కొత్త జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుందని చెబుతున్నారు. సైన్స్‌కు సంబంధించిన ఏ ఆవిష్కరణ జరిగినా అది సమాజంలో ప్రజలందరికీ ఉపయోగపడాలి. అంతేగాని కొన్ని వర్గాలకు, సమాజంలోని కులీన వర్గాలకు మాత్రమే ఉపయోగపడే ఆవిష్కరణలు ఏమాత్రం మంచిది కాదని సామాజికవేత్తలు గట్టిగా వాదిస్తున్నారు. బిడ్డలు కలగని దంపతులకు పిల్లలు కలిగేవిధంగా అనేక ప్రయోగాలు చేశారు. నలభై సంవత్సరాల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టినపుడు ప్రపంచం ఆశ్యర్యపోయింది. క్లోనింగ్‌తో గొర్రె పిల్లల్ని పుట్టించినపుడు మరింత సంభ్రమాశ్చర్యాలకు సమాజం గురైంది. ఇంటా.. బయటా గొడ్రాలు అని నిందిస్తుంటే అవమానంతో కుమిలిపోయే మహిళలకు వరంలా నేడు ఐవీఎఫ్ విధానం, సరోగసి విధానం అందుబాటులోకి వచ్చాయి. రోజు రోజుకూ సాంకేతికంగా ఎంతో వృద్ధి చెందుతున్నాం. సైంటిస్టులు ప్రజలకు సర్వ సౌకర్యాలు, సౌఖ్యాలు అందిస్తున్నారు. అదే సమయంలో డిజైనర్ బేబీస్ గురించి జరుగుతున్న పరిశోధనలు సమాజంలోని ఒక వర్గానికి సంతోషం కలిగించవచ్చు. కాని 90 శాతం మంది ప్రజలకు ఇటువంటి ప్రయోగాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమాదకర వ్యాధులు రాకుండా, కావాల్సిన విధంగా పిల్లల్ని తయారుచేయించుకుంటే...బోనస్‌గా మరిన్ని కొత్త జబ్బులు, కొత్త సమస్యలు పుట్టుకురావచ్చు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కకావికలం చేసిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు వందేళ్ళ క్రితం ఇద్దరు బయాలజిస్టులు మానవ పునరుత్పత్తి ప్రక్రియలో అద్భుతమైన సాంకేతిక పురోగోతి వస్తుందని ప్రకటించారు. వీటి గురించే ఆల్డస్ హక్స్లీ అనే రచయిత బ్రేవ్ న్యూ వరల్డ్ అనే పుస్తకం రాసాడు. ఫ్యాక్టరీలో వస్తువులను తయారు చేసుకుంటున్నట్లుగా...2540 నాటికి మనకు కావాల్సిన బిడ్డలను ప్రయోగశాలల్లో తయారు చేసుకుంటామని అందులో రాసాడు. అప్పటి కాలంలో మహిళలు పిల్లల్ని స్వయంగా కనే పరిస్థితులు ఉండవని, కేవలం లేబరేటరీల్లోనే తయారవుతారని తెలిపాడు. డిజైనర్ బేబీస్ గురించి జరుగుతున్న పరిశోధనలు కూడా చివరికి మానవ సమాజాన్ని ఆ దిశగా తీసుకువెళ్తాయనే చర్చ సాగుతోంది. సమాజంలో సంభవించే కొన్ని పరిణామాలు, కొన్ని శాస్త్ర ప్రయోగాలు ఎవరు అడ్డుకున్నా ఆగవు. అలా కొందరు ఆపగానే ఆగిపోతే మానవ సమాజం ఇంత పురోగతి సాధించేది కాదు. అలాగే హక్స్లీ తన పుస్తకంలో రాసినట్లుగా కొన్నేళ్ళలో మన తర్వాతి తరం వారు.. పిల్లల్ని తమకు కావాల్సిన విధంగా ప్రయోగశాలల్లో తయారు చేయించుకుని కొనుక్కునే రోజులు వస్తాయేమో. (అయిపోయింది) ఈ. వీ. బాలాజీ, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
అందాల ఐశ్వర్యమా, కింగ్ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?
భూమి మీద నివసించే ప్రాణుల్లో మనిషి మాత్రమే బుద్ధి జీవి. అపారమైన తెలివితేటలు సొంతం చేసుకున్న మనిషి.. తన సుఖం కోసం నిరంతరం అన్వేషిస్తున్నాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. భావి తరాలు కష్టపడకుండా..సుఖించడానికి శ్రమిస్తున్నాడు. భూమి మీద మనిషి పుట్టుకకు బీజం వేసిన ప్రకృతితో కూడా చెలగాటమాడుతున్నాడు. మానవ ప్రత్యుత్పత్తికి కొత్త దారులు వెతుకు తున్నాడు. భూమి మీద మానవ మనుగడ, పురోగతి ఒక క్రమపద్ధతిలో సాగుతోంది. టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషి ఆలోచనలు మారి పోతున్నాయి. ఒకప్పుడు పిల్లలు పుట్టని మహిళలకు ఇంటా బయటా ఛీత్కారాలు ఎదురయ్యేవి. అంతా అవమానకరంగా ప్రవర్తించేవారు. బయో టెక్నాలజీలో వచ్చిన పురోగతి బిడ్డలు కలగడానికి రకరకాల ప్రత్యామ్నాయాలు చూపిస్తోంది. ఇప్పుడు అన్నిటికీ మించి..మానవ సమాజ గతినే మార్చేలా డిజైనర్ బేబీస్ ప్రయోగాలు జరుగుతున్నాయి. 50 ఏళ్ళ క్రితం మానవ ప్రత్యుత్పత్తికి సంబంధించి వైద్య రంగంలోను, టెక్నాలజీపరంగానూ పెద్దగా డవలప్మెంట్ లేదు. పుట్టేది అబ్బాయో.. అమ్మాయో తెలీదు. తర్వాతి కాలంలో సైన్స్ సాధించిన పురోగతి వల్ల పుట్టేది ఆడా..మగా అనేది తెలిసిపోతోంది..ఆ తర్వాత కృత్రిమ గర్భధారణతో పిల్లలు లేనివారికి బిడ్డల్ని అందిస్తున్నారు. కాని ఇప్పుడు పిల్లలు పుట్టకుకు సంబంధించి రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. బయోటెక్నాలజీ రంగం ఊహించనంత స్థాయికి చేరుతోంది. ♦ అందమైన అమ్మాయి కావాలా? తెలివైన అబ్బాయి కావాలా? ♦ నీలికళ్ళ అమ్మాయి కావాలా? ఆరడుగుల అబ్బాయి కావాలా? ♦ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్త కావాలా? సచిన్ లాంటి క్రికెటర్ కావాలా? ♦ హాలీవుడ్ సినిమాల్లోని సూపర్ హీరో వంటి కొడుకు కావాలా? ♦ జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? షోరూంకు వెళ్ళి కారు కొనుక్కున్నట్టుగా.. నగల షాపులో డిజైనర్ నగలు ఆర్డర్ ఇచ్చినట్లుగా తాము కోరుకున్న బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా చంటి బిడ్డల్ని తయారు చేసే లేబరేటరీలకు వెళ్ళి ఆర్డర్ ఇచ్చే రోజులు రాబోతున్నాయి. మరో పది లేదా పదిహేనేళ్ళలో ఇది సాధ్యం అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆల్రెడీ నాలుగేళ్ళ క్రితమే డిజైనర్ బేబీస్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసిందని చైనా శాస్త్రవేత్త హి జియాన్కుయ్ చెప్పేశాడు. తాను ఇద్దరు డిజైనర్ బేబీస్‌ను సృష్టించినట్లు ఆయన ప్రకటించారు. ఈ టెక్నాలజీని ప్రపంచం ఆమోదించిందా? అది నిజంగానే సాధ్యమైందా అనేదానిపై రకరకాల చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే చట్ట విరుద్ధమైన ప్రయోగాలు చేసినందుకు డిజైనర్ బేబీస్‌ను తయారు చేసినట్లు చెప్పుకున్న జియాన్‌కుయ్‌పై విచారణ జరిపిన చైనా ప్రభుత్వం ఆయనకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అతనితో కలిసి పరిశోధనల్లో పాలుపంచుకున్న మరో ఇద్దరికి కూడా శిక్ష పడింది. ఆ శిక్ష కూడా రెండు నెలల్లో పూర్తి కాబోతోంది. సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో విప్లవాత్మక అభివృద్ధి సాధిస్తోంది. జన్యుమార్పిడి ద్వారా దిగుబడి పెంచే, చీడ పీడలు సోకని సరికొత్త వంగడాలు సృష్టించింది. అలాగే ఇప్పుడు మనిషి పుట్టుకకు సంబంధించిన విషయంలో కూడా శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. జన్యుమార్పిడి ద్వారా కోరుకున్న విధంగా బిడ్డలను తయారుచేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం బిడ్డలు కలగని దంపతులు గుడుల చుట్టూ తిరిగేవారు. పిల్లలు పుట్టకపోతే తమ గత జన్మ పాప ఫలితం అని సరిపెట్టుకునేవారు. సైన్స్‌పై నమ్మకం లేని, పెరుగుతున్న విజ్ఞానం గురించి తెలియని ఎంతో మంది ఇప్పటికీ దేవుళ్ళను, బాబాలనే నమ్ముతున్నారు. అయితే చదువుకున్నవాళ్ళు, సెలబ్రిటీలు, వైద్య విజ్ఞానం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు డాక్టర్లను సంప్రదించి తమలో ఉన్న శారీరక లోపాలు సవరించుకుని బిడ్డల్ని కంటున్నారు. అప్పటికి కూడా సాధ్యం కాకపోతే కొత్తగా ఆచరణలోకి వచ్చిన IVF ద్వారానో అదీ సాధ్యం కాకపోతే సరోగసి ద్వారానో బిడ్డల్ని కంటున్నారు. ఇటీవల సరోగసి విధానంలో పిల్లల్ని కనడానికి సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సరోగసి బిడ్డల విషయమై ఈ మధ్య ఒక సినీ సెలబ్రిటీ విషయంలో వివాదం రేగిన విషయం కూడా తెలిసిందే. బిడ్డలు లేని దంపతులకు వివిధ రకాల సైంటిఫిక్ పద్దతుల్లో బిడ్డలు కలిగేలా చేయడం... వైద్య రంగం మూడు నాలుగు దశాబ్దాల నుంచి సాధిస్తున్న అద్భుత విజయాల్లో అత్యంత కీలకమైన ముందడుగు. ఇదంతా ఒక ఎత్తయితే..వ్యవసాయంలో జన్యుమార్పిడి వంగడాల ద్వారా చీడ, పీడలు బాధ లేని, దిగుబడి పెంచే కొత్తరకం వంగడాలను సృష్టించినట్లు..జన్యుమార్పిడి బిడ్డలను తయారు చేసే టెక్నాలజీ రూపొందించారు. చైనా సహా చాలా దేశాల్లో మనుషుల విషయంలో ఇటువంటి ప్రయోగాలు చేయడాన్ని నిషేధించారు. ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధులు, అంటు వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక జబ్బులు ఉన్నదంపతులకు పుట్టే బిడ్డల్లో రకరకాల వైకల్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దంపతుల్లో ఒకరికి సమస్య ఉన్నా పుట్టే బిడ్డల్లో లోపాలుండవచ్చు. ఈ లోపాలన్నీ సరిచేసేందుకే జెనిటికల్లీ మోడిఫైడ్ పిల్లల్ని తయారు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. చైనా శాస్త్రవేత్త జియాన్కుయ్ పురుషుల్లో ఎయిడ్స్ ఉన్న దంపతులకు కలిగిన పిండాల్లోని జన్యువులను సవరించడం ద్వారా డిజైనర్ బేబీలను సృష్టించారు. ఇలా పురుషుల్లో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న ఏడుగురు దంపతులను ఎంపిక చేసుకుని వారికి కలిగిన పిండాల్లోని జన్యువులను ఎడిట్ చేశారు. వీరిలో ఒక జంటకు మాత్రమే ప్రయోగం సక్సెసై కవలలు జన్మించారు. వారికి లులు, నానా అని పేర్లు పెట్టారు. 2018 నవంబర్‌లో ఈ ప్రయోగం సఫలమైంది. తన ప్రయోగం విజయవంతమైందని జియాన్కుయ్ స్వయంగా ప్రకటించారు. అయితే చైనాలోని వైద్య సంస్థలు ఏవీ కూడా ఈ ప్రయోగాన్ని ధృవీకరించలేదు. వైద్యరంగానికి చెందిన ప్రముఖ మ్యాగజైన్లేవీ దీని గురించి ప్రచురించలేదు. ఈ ప్రయోగంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన చైనా ప్రభుత్వం..చట్ట విరుద్ధ వైద్య ప్రయోగాలు చేసినందుకు గాను.. జియాన్కుయ్ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించింది. ఏడాది పాటు సాగిన విచారణ అనంతరం 2019 డిసెంబర్లో ఆ శాస్త్రవేత్తతో పాటు ఆయన ఇద్దరి సహచరులకు కూడా మూడేళ్ళ శిక్ష పడింది. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్ప్రెడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అనే ఒక వినూత్న వైద్య ప్రక్రియను 2012లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని షార్ట్ కట్లో క్రిస్పర్ కాస్ 9 విధానం అని పిలుస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా ప్రాణాంతకమైన కేన్సర్ వంటి జబ్బులను నయం చేయవచ్చని నిరూపించారు. కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కణంలో CCR 5 అనే జన్యువులోని ప్రొటీన్ ద్వారా HIV వైరస్ జన్యువులోకి ప్రవేశిస్తుంది. క్రిస్పర్ కాస్ 9 జీన్ ఎడిటింగ్ టూల్ ద్వారా HIV వైరస్‌ను కణంలోకి అనుమతిస్తున్న ప్రొటీన్‌ను తొలగించగలిగారు. పెరుగుతున్న పిండంలో ఈ జన్యు ఎడిటింగ్ చేయడంలో చైనా శాస్త్రవేత్తల బృందం విజయవంతమైంది. ఈ ప్రొటీన్‌ను తొలగించడం ద్వారా సంబంధిత బిడ్డలకు ఎయిడ్స్‌తో పాటు కలరా, స్మాల్‌పాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించవచ్చు. పెరుగుతున్న పిండంలో జన్యువు ఎడిటింగ్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. పిండ దశలోనే జన్యువులను ఎడిటింగ్ చేయడం ద్వారా లోపాలున్న జన్యవులను తొలగించి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వగలుగుతారు. కేన్సర్ వంటి జబ్బులను నయం చేయడానికి క్రిస్పర్ కాస్ 9 విధానాన్ని అమలు చేస్తున్నారు. కేన్సర్ కణాలను ఈ టెక్నాలజీ ద్వారా చంపేస్తే.. ఆ మనిషిని కాపాడవచ్చు. కాని దీని ద్వారా జన్యువులను ఎడిట్ చేస్తే తర తరాలుగా ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఒక వ్యక్తి వంశవృక్షం మొత్తానికి ఈ ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుంది. కణంలోని ఒక జన్యువును తొలగించడం ద్వారా ఒక జబ్బును అతని వంశ వృక్షం నుంచి పూర్తిగా తొలగించవచ్చు. (ఇంకా ఉంది) ఈ. వీ. బాలాజీ, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
నచ్చేలా.. మెచ్చేలా..డిజైనర్ బేబీలు!
జన్యు క్రమంలో మార్పులతో కావాల్సిన ఫలితాలు ఎకరా భూమిలో ఐదు టన్నుల బియ్యం పండితే.. రోగమన్నది లేని కాలం వస్తే.. పుట్టబోయే బిడ్డకు మనం కోరుకున్న లక్షణాలన్నీ వచ్చేలా చేసుకుంటే.. అవసరానికి కావాల్సినంత పెట్రోలు, డీజిల్ ఇంట్లోనే ఉత్పత్తి తయారైపోతోంటే.. భలే బాగుంటుంది కదా! త్వరలోనే ఇలాంటి అద్భుతాలన్నీ వాస్తవంగానే సాకారమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీతో ఇదంతా సాధ్యమేనని అంటున్నారు. ఏమిటీ టెక్నాలజీ? మానవులే కాదు జంతువులు, చెట్లు, సూక్ష్మజీవులు సహా ప్రతి జీవ కణంలోనూ డీఎన్ఏ ఉంటుందని మనకు తెలిసిన విషయమే. కణాల్లో ఉండే ఒక్కో క్రోమోజోమ్‌లో ఆరు అడుగుల పొడవైన డీఎన్ఏ పోగు ఉంటుం ది. ఈ డీఎన్ఏ పోగులోని భాగాలనే మనం జన్యువులుగా కూడా చెబుతుంటాం. ఈ జన్యు క్రమమే మొత్తంగా ఆ జీవికి సంబంధించిన అన్ని లక్షణాలను నిర్దేశిస్తుంటుంది. ఈ జన్యు క్రమంలో వచ్చే స్వల్ప మార్పులే ఆ జీవకణం లక్షణాలు మారిపోవడానికి, వ్యాధులు రావడానికి కారణమవుతుంటాయి. ఈ మార్పులను సరిచేస్తే ఆ లక్షణాల ను సరిదిద్దడానికి, వ్యాధులను దూరం చేయడానికి వీలవుతుంది. అలా నేరుగా జన్యు క్రమంలో మార్పులు చేయడానికి తోడ్పడే టెక్నాలజీయే ‘క్రిస్పర్ క్యాస్–9’గా పిలుస్తుంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో కత్తెర లాంటి వ్యవస్థ. డీఎన్ఏ పోగులో ఉండే క్రిస్పర్ అనే భాగాలు, క్యాస్–9 అనే ఎంజైమ్‌ల సహాయంతో కణాల్లోని క్రోమోజోమ్‌లలో ఉన్న జన్యు క్రమాన్ని కత్తిరించి, అవసరమైన జన్యు క్రమాన్ని చేర్చడానికి వీలవుతుంది. బ్యాక్టీరియాల్లో ఎప్పటినుంచో.. బ్యాక్టీరియాల వంటి కేంద్రకం లేని ఏక కణ జీవులన్నింటిలోనూ ఇప్పటికే క్రిస్పర్ క్యాస్–9 వ్యవస్థ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా బ్యాక్టీరియాలపైనా వైరస్ దాడి చేస్తుంది. అలాంటి సమయంలో ఆ బ్యాక్టీరియా తన డీఎన్ఏ పోగులో ఉండే క్రిస్పర్ భాగాలు, క్యాస్–9 అనే ఎంజైమ్ సాయంతో ఆ వైరస్ తాలూకు డీఎన్ఏను తొలగిస్తుంది. భవిష్యత్తులో అలాంటి వైరస్ దాడి చేసినప్పుడు గుర్తించేందుకు, ఎదుర్కొనేందుకు కూడా ఈ వ్యవస్థను సంసిద్ధం చేస్తుంది. ఈ ‘క్రిస్పర్ క్యాస్–9’పద్ధతిని ఏక కణ జీవుల్లోనే కాకుండా... మనుషులు సహా అన్ని జీవజాతుల్లోనూ ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జన్యు ఎడిటింగ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. ఏమేం చేయవచ్చు? జన్యువును తొలగించడం..: ఏవైనా లక్షణాలు వద్దనుకుంటే.. జన్యు క్రమంలోని సదరు లక్షణాలకు సంబంధించిన జన్యువులను ఈ టెక్నాలజీ ద్వారా తొలగించవచ్చు. అంతేకాదు జన్యువులను తొలగించి పరిశీలించడం ద్వారా.. ఏయే జన్యువులు ఏయే పని చేస్తున్నాయి, ఏయే లక్షణాలు కలిగిస్తున్నాయి, ఎలాంటి మార్పులు వస్తాయనేది గుర్తించవచ్చు. కొత్త జన్యువులు చేర్చడం: మనం కోరుకున్న లక్షణాలున్న జన్యువులను జన్యుక్రమంలోకి జొప్పించవచ్చు. ఉదాహరణకు మేథస్సుకు ఓ జన్యు వు కారణమనుకుంటే.. మంచి తెలివితేటలు గల బిడ్డలు పుట్టేలా ఈ టెక్నాలజీ ద్వారా ఆ జన్యువును పిండం జన్యుక్రమంలోకి చేర్చవచ్చు. జన్యువులను చైతన్యవంతం చేయడం: సాధారణంగా జీవుల్లో తరాలు మారే కొద్దీ కొన్ని రకాల జన్యువులు నిద్రాణ స్థితిలోకి వెళ్లడం, చైతన్యవంతంగా మారడం జరుగుతుంటుంది. అలాంటి జన్యువులను ఈ పద్ధతి ద్వారా చైతన్యవంతం చేయవచ్చు. జన్యువుల నియంత్రణ: ఈ పద్ధతిద్వారా జన్యువుల పనితీరును పూర్తిగా నియంత్రించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని జన్యువులు అధిక ప్రొటీన్ ఉత్పత్తి చేసేలా చేయడంతోపాటు మరికొన్నింటిని తక్కువగా పనిచేసేలా కూడా మార్పులు చేసుకోవచ్చు. మానవ ఆరోగ్యం..: కేన్సర్ మొదలుకుని ఎన్నో రకాల వ్యాధులకు ‘క్రిస్పర్ క్యాస్–9’ద్వారా మెరుగైన చికిత్స లభిస్తుంది. మధుమేహం, సిస్టిస్ ఫైబ్రోసిస్, సికిల్‌సెల్ ఎనీమియా వంటి మొండి వ్యాధులకూ చికిత్స అందుబాటులోకి వస్తుంది. అసలు కొన్ని రకాల వ్యాధులు రాకుండానే ఉండేలా కూడా చేయవచ్చు. కావాల్సినట్లుగా పిల్లలు!: మనం కోరుకున్నట్లుగా పిల్లలను కనేందుకు ‘క్రిస్పర్ క్యాస్–9’విధానం తోడ్పడుతుంది. కోరుకున్నట్లుగా చర్మం, జుత్తు, కళ్ల రంగు, ఎత్తు, తెలివితేటలు ఉండేలా జన్యుక్రమంలో మార్పులు చేయవచ్చు. ఎన్నో లాభాలున్నాయ్.. కొత్త, వినూత్న లక్షణాల పదార్థాలు..: సూక్ష్మజీవుల్లోని జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా అవి వినూత్న లక్షణాలున్న పదార్థాలను తయారు చేసేలా మార్చవచ్చు. ఉదాహరణకు గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని చమురులాంటి ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగేవి.. ఉక్కుకంటే దృఢమైన పోగులను తయారు చేయగల సాలీళ్లు వంటివాటిని అభివృద్ధి చేయొచ్చు. మందుల తయారీ: వివిధ రకాల బ్యాక్టీరియాల జన్యు క్రమంలో మార్పులు చేసి.. అవి మనకు అవసరమైన రసాయనాలు, ఔషధాలు ఉత్పత్తి చేసేలా మార్చవచ్చు. తద్వారా అతి చౌకగా అద్భుతమైన ఔషధాలు ఉత్పత్తి చేయవచ్చు. వ్యవసాయం: పంటల దిగుబడులను భారీగా పెంచేందుకు, చీడపీడలను సమర్థంగా తట్టుకునేందుకు వీలయ్యేలా మార్పులు చేయవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, వరదల వంటి అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక దిగుబడులు ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేసేందుకూ ఈ పద్ధతి తోడ్పడుతుంది. ఇప్పటికే సక్సెస్ అమెరికాలోని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి చెందిన షౌఖారత్ మిటాలిపోవ్ అనే శాస్త్రవేత్త క్రిస్పర్ క్యాస్–9 పద్ధతి ద్వారా తొలిసారి మానవ పిండంలోని డీఎన్ఏలో మార్పులు చేశారు. బిడ్డగా మారగల అవకాశమున్న పిండాల్లోని వ్యాధికారక జన్యువులను సరిచేయడంలో ఆయన విజయం సాధించారని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ‘టెక్నాలజీ రివ్యూ’వెబ్సైట్ వెల్లడించింది. అయితే ఎన్ని పిండాల్లో మార్పులు చేశారు, ఏయే జన్యువుల్లో మార్పులు/చేర్పులు చేశారన్న వివరాలు బయటపెట్టలేదు. కానీ విజయవంతంగా జన్యుపరమైన మార్పులు చేసిన ఒకట్రెండు రోజులకే ఆ పిండాలను నాశనం చేసేసినట్లు సమాచారం. ఈ ప్రయోగం నేపథ్యంలో... చికిత్సలేని వ్యాధులను, వైకల్యాలను క్రిస్పర్ క్యాస్–9తో సరిచేయవచ్చన్న అంచనాలు మరింత బలపడ్డాయి. నైతికతకు సవాలు! క్రిస్పర్ క్యాస్–9 పరిశోధనలకు మానవ పిండాలను ఉపయోగించడంపై ఇప్పటికే పలు నైతికపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేగాకుండా ఈ పద్ధతివల్ల ఊహించని దుష్పరిణామాలు కూడా ఉంటాయని.. మానవాళికి కీడు కలిగించే పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. క్రిస్పర్ క్యాస్–9 తెరపైకి వచ్చిందిలా.. 1987 క్రిస్పర్పై తొలి పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. 2000 కేంద్రకాలు లేని ఏకకణ జీవులన్నింటిలోనూ క్రిస్పర్ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారు. 2002 దీనికి ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్డ్ పాలిన్డ్రోమ్ రిపీట్స్’లేదా క్రిస్పర్గా పేరు పెట్టారు. (డీఎన్ఏలోని కొన్ని భాగాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంటాయి. జన్యుక్రమాన్ని ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే ఈ భాగాలనే క్రిస్పర్ అంటారు) 2008 క్రిస్పర్ డీఎన్ఏలోని కొన్ని భాగాలపై పనిచేయగలదని తెలిసింది. 2013 క్రిస్పర్, క్యాస్–9 ఎంజైమ్లతో జన్యువుల్లో మార్పులు చేయవచ్చని నిరూపితమైంది. 2014 క్యాస్–9తో జన్యుక్రమం మొత్తాన్ని స్క్రీన్ చేయగలిగారు. 2015 క్రిస్పర్ క్యాస్–9 ద్వారా కేన్సర్ కణాలను సాధారణ కణాలుగా మార్చగలిగారు. -
బ్రహ్మతో పనిలేదు!
పుట్టే పిల్లలందరూ ఐన్‌స్టీన్ అంతటి మేథావులైతే ఎలా ఉంటుంది? ఇకపై జన్మించబోయే శిశువులకు భవిష్యత్‌లో ఏ వ్యాధులూ రాకుండా ఉంటే ఎంత బావుంటుంది? ఆకర్షించే రూపం.. అందమైన రంగు.. సహృదయం.. దయ, కరుణ కలిగి ఉంటూ.. అందరినీ గౌరవించే స్వభావం.. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన పిల్లలు ఉంటే ఇంకెంత బావుంటుందో కదూ! అందరూ ఈ తరహా పిల్లలే అయితే రాబోయే తరాలన్నీ ఉత్తమమైనవే. ఇలాంటి పిల్లలుంటే తల్లిదండ్రులెవరికీ ఏ చింతా ఉండదు. కానీ పిల్లలంతా అలా ఉండడం సాధ్యమేనా అనిపిస్తోంది కదూ..? ‘డిజైనర్ బేబీ’లతో భవిష్యత్‌లో సాధ్యమే అంటోంది సాంకేతికత. ఇంతకీ డిజైనర్ బేబీలంటే ఎవరు? వారికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం.. -సాక్షి, స్కూల్ ఎడిషన్ డిజైనర్ బేబీలు అంటే.. జన్యు మార్పిడి పిల్లలనే డిజైనర్ బేబీలు అనవచ్చు. జన్యు మార్పిడి పంటల గురించి మనకు తెలిసిందే. వివిధ జన్యువులను ఆయా పంటల్లో ప్రవేశపెట్టడం ద్వారా అవి ఎక్కువ కాలం మన్నగలగడం, పరిమాణంలో పెద్దవిగా ఉండడం వంటి, మెరుగైన రంగు, రుచి, వ్యాధులను తట్టుకునే శక్తి.. తదితర లక్షణాలను సంతరించుకుంటాయి. కుందేళ్లు, కోళ్లు, చేపలు వంటివి కూడా జన్యుమార్పిడి విధానంలో జన్మిస్తున్నాయి. పంటలు, ఇతర జంతువులకే పరిమితమైన ఈ జన్యుమార్పిడి విధానాన్ని ఇప్పుడు శిశువులకు కూడా అన్వయిస్తున్నారు పరిశోధకులు. అంటే గర్భస్థ పిండంలో ఎంపిక చేసిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా జన్మించే శిశువులు సరి కొత్త లక్షణాలను కలిగి ఉంటారు. ఇలా జన్యుమార్పిడి తర్వాత జన్మించే శిశువులను ‘డిజైనర్ బేబీలు’ అంటారు. 2004 నుంచి ఈ డిజైనర్ బేబీ పదం వాడుకలోకి వచ్చింది. పిండాల్లో ప్రవేశపెట్టే ప్రత్యేక జన్యువులను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న డిజైనర్ బేబీలు రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం మరి కొద్ది సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు.. డిజైనర్ బేబీల వల్ల ప్రయోజనాలున్నట్లుగానే అనేక ఇబ్బందులు ఉన్నాయి. డిజైనర్ బేబి సాంకేతికత ఉన్నతవర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకున్న వారు మరింత ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఫలితంగా సమాజంలో మరిన్ని అసమానతలు ఏర్పడతాయి. జన్యువులతో వారి భవిష్యత్‌ను ముందే ఎంపిక చేస్తాం కాబట్టి, ఆ పిల్లలకు ఇతర లక్షణాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. సొంత వ్యక్తిత్వం అంటూ ఉండదు. ఒక కుటుంబంలో ఒక్కరే డిజైనర్ బేబీలుంటే, అది ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. నైతిక సమస్యలు.. ఈ తరహా ప్రయోగాలను కొందరు పరిశోధకులు, ప్రపంచ మానవ హక్కుల నేతలు వ్యతిరేకిస్తున్నారు. డిజైనర్ బేబీలను వారు పోస్ట్ హ్యూమన్స్ (మానవుల తర్వాతి జీవులు)గా అభివర్ణిస్తున్నారు. డిజైనర్ బేబీలను సృష్టించే ప్రక్రియ అసహజమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారి వాదన. ఈ పరిశోధనలకు చట్టబద్ధత కల్పించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రయోగాలకు అనుమతిస్తే భవిష్యత్‌లో ఈ సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ‘డిజైనర్ బేబీ’ సాంకేతిక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో బ్రహ్మతో పనిలేదేమో! డిజైనర్ బేబీలను సృష్టించే సాంకేతికత కొత్తదేం కాదు. 1989-90 లలోనే తొలిసారిగా డిజైనర్ బేబీ జన్మించింది. జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వైద్యరంగాల కలయికతో డిజైనర్ బేబీలను సృష్టిస్తారు. శుక్రకణం, అండంలు ఫలదీకరణ చెందే దశలో లేదా పిండం ఏర్పడే దశలో ఎంపిక చేసిన జన్యువులను ప్రవేశపెడతారు. అంటే శిశువులు జన్మించకముందే వారిలో మనకు కావాల్సిన లక్షణాలు జన్యురూపంలో చేరిపోతాయి.