బ్రహ్మతో పనిలేదు!
బ్రహ్మతో పనిలేదు!
Published Sat, Feb 13 2016 1:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
పుట్టే పిల్లలందరూ ఐన్‌స్టీన్ అంతటి మేథావులైతే ఎలా ఉంటుంది? ఇకపై జన్మించబోయే శిశువులకు భవిష్యత్‌లో ఏ వ్యాధులూ రాకుండా ఉంటే ఎంత బావుంటుంది? ఆకర్షించే రూపం.. అందమైన రంగు.. సహృదయం.. దయ, కరుణ కలిగి ఉంటూ.. అందరినీ గౌరవించే స్వభావం.. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన పిల్లలు ఉంటే ఇంకెంత బావుంటుందో కదూ! అందరూ ఈ తరహా పిల్లలే అయితే రాబోయే తరాలన్నీ ఉత్తమమైనవే. ఇలాంటి పిల్లలుంటే తల్లిదండ్రులెవరికీ ఏ చింతా ఉండదు. కానీ పిల్లలంతా అలా ఉండడం సాధ్యమేనా అనిపిస్తోంది కదూ..? ‘డిజైనర్ బేబీ’లతో భవిష్యత్‌లో సాధ్యమే అంటోంది సాంకేతికత. ఇంతకీ డిజైనర్ బేబీలంటే ఎవరు? వారికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం..
-సాక్షి, స్కూల్ ఎడిషన్
డిజైనర్ బేబీలు అంటే..
జన్యు మార్పిడి పిల్లలనే డిజైనర్ బేబీలు అనవచ్చు. జన్యు మార్పిడి పంటల గురించి మనకు తెలిసిందే. వివిధ జన్యువులను ఆయా పంటల్లో ప్రవేశపెట్టడం ద్వారా అవి ఎక్కువ కాలం మన్నగలగడం, పరిమాణంలో పెద్దవిగా ఉండడం వంటి, మెరుగైన రంగు, రుచి, వ్యాధులను తట్టుకునే శక్తి.. తదితర లక్షణాలను సంతరించుకుంటాయి. కుందేళ్లు, కోళ్లు, చేపలు వంటివి కూడా జన్యుమార్పిడి విధానంలో జన్మిస్తున్నాయి. పంటలు, ఇతర జంతువులకే పరిమితమైన ఈ జన్యుమార్పిడి విధానాన్ని ఇప్పుడు శిశువులకు కూడా అన్వయిస్తున్నారు పరిశోధకులు. అంటే గర్భస్థ పిండంలో ఎంపిక చేసిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా జన్మించే శిశువులు సరి కొత్త లక్షణాలను కలిగి ఉంటారు. ఇలా జన్యుమార్పిడి తర్వాత జన్మించే శిశువులను ‘డిజైనర్ బేబీలు’ అంటారు. 2004 నుంచి ఈ డిజైనర్ బేబీ పదం వాడుకలోకి వచ్చింది. పిండాల్లో ప్రవేశపెట్టే ప్రత్యేక జన్యువులను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న డిజైనర్ బేబీలు రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం మరి కొద్ది సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇబ్బందులు..
డిజైనర్ బేబీల వల్ల ప్రయోజనాలున్నట్లుగానే అనేక ఇబ్బందులు ఉన్నాయి. డిజైనర్ బేబి సాంకేతికత ఉన్నతవర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకున్న వారు మరింత ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఫలితంగా సమాజంలో మరిన్ని అసమానతలు ఏర్పడతాయి. జన్యువులతో వారి భవిష్యత్‌ను ముందే ఎంపిక చేస్తాం కాబట్టి, ఆ పిల్లలకు ఇతర లక్షణాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. సొంత వ్యక్తిత్వం అంటూ ఉండదు. ఒక కుటుంబంలో ఒక్కరే డిజైనర్ బేబీలుంటే, అది ఇతరులపై ప్రభావం చూపిస్తుంది.
నైతిక సమస్యలు..
ఈ తరహా ప్రయోగాలను కొందరు పరిశోధకులు, ప్రపంచ మానవ హక్కుల నేతలు వ్యతిరేకిస్తున్నారు. డిజైనర్ బేబీలను వారు పోస్ట్ హ్యూమన్స్ (మానవుల తర్వాతి జీవులు)గా అభివర్ణిస్తున్నారు. డిజైనర్ బేబీలను సృష్టించే ప్రక్రియ అసహజమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారి వాదన. ఈ పరిశోధనలకు చట్టబద్ధత కల్పించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రయోగాలకు అనుమతిస్తే భవిష్యత్‌లో ఈ సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ‘డిజైనర్ బేబీ’ సాంకేతిక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో బ్రహ్మతో పనిలేదేమో!
డిజైనర్ బేబీలను సృష్టించే సాంకేతికత కొత్తదేం కాదు. 1989-90 లలోనే తొలిసారిగా డిజైనర్ బేబీ జన్మించింది. జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వైద్యరంగాల కలయికతో డిజైనర్ బేబీలను సృష్టిస్తారు. శుక్రకణం, అండంలు ఫలదీకరణ చెందే దశలో లేదా పిండం ఏర్పడే దశలో ఎంపిక చేసిన జన్యువులను ప్రవేశపెడతారు. అంటే శిశువులు జన్మించకముందే వారిలో మనకు కావాల్సిన లక్షణాలు జన్యురూపంలో చేరిపోతాయి.
Advertisement