
చదవేస్తే ఉన్న మతి పోయిందని సామెత. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను చాలా సీనియర్‌నని, పధ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిని అని, తనకు ఎమ్మెల్యే పదవితో పని లేదని అంటూనే , ఈసారి ప్రజలు తన మాట వినకపోతే రాష్ట్రానికి అదే చివరి అవకాశం అవుతుందని ఆయన చెబుతున్న తీరు అచ్చంగా ఆ సామెతలాగే ఉందనిపిస్తుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ అంటూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షో లో మాట్లాడుతూ ఇలా అన్నారట. ఇంతకు ముందు తనకు ఇవే చివరి ఎన్నికలు అని, తర్వాత ఎవరో ఒకరికి బాధ్యత అప్పగిస్తానని అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రానికి చివరి అవకాశం అని మొరపెట్టుకుంటున్నారు. అధికారలాలస లేకపోతే ఇలా మాట్లాడతారా? తాను వచ్చే ఎన్నికలలో గెలిస్తే ఏమి చేస్తానో చెప్పగలిగాలి కాని, ప్రజలలో సానుభూతి కోసమో, జాలి కోసమో ఇలా ప్రసంగాలు చేస్తే ఎవరైనా మద్దతు ఇస్తారా? ఆనాటి రోజులు పోయాయని చెప్పాలి.
గతంలో కూడా తాను లేకపోతే రాష్ట్రం అభివృద్ది చెందదని, అంతా తనతోనే ఉందని బిల్డప్ ఇచ్చుకునేవారు. అహో,ఓహో అంటూ భజన చేసి కొన్ని మీడియా సంస్థలు కూడా అమ్మో చంద్రబాబు లేకపోతే రాష్ట్రానికి నష్టం అని ప్రచారం చేస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాగే మోస్తున్నాయి. కాని సోషల్ మీడియా వచ్చాక, అందులోని వాస్తవాన్ని, పరమార్ధాన్ని ఇట్టే కనిపిట్టేస్తున్నారు. అందువల్లే వారి ఆటలు అంతగా సాగడం లేదు. అయినా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. రాష్ట్రానికి ఇది చివరి చాన్స్ అంటే ఏమిటి అర్దం.
అది అహంకారంతో కూడిన ఉపన్యాసంగా కనిపించదా? చంద్రబాబు ఓడిపోతే రాష్ట్రానికి ఏమి అవుతుంది? గతంలో ఎందరు ముఖ్యమంత్రులు మారలేదు?పోనీ ఈయనకు 2014లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఇలా బతిమలాడుకునే పరిస్థితి వచ్చేదా? ఇప్పటికీ ఆయనలో రియలైజేషన్ వచ్చినట్లు అనిపించదు. ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ తన స్కీములతో ప్రజలలో దూసుకువెళుతుంటే ఈయనేమో ఆత్మరక్షణలో పడి ఉన్నవి,లేనివి అబద్దాలో, సబద్దాలో కల్పించి మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కాని హేతుబద్దంగా ఆలోచిస్తే పధ్నాలుగు సంవత్సరాలు, అంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే చాన్స్ చంద్రబాబుకే వచ్చింది కదా? అప్పుడు అంతా అభివృద్ది చేసి ఉంటే, ఇప్పుడు అధికారం ఇస్తే తాను చేస్తానని చెప్పుకునే దుస్థితి వచ్చేదా?పైగా జగన్ 96శాతం హామీలు అమలు చేశారని చెబుతున్నారని, అది వాస్తవం అయితే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఉండేవా అని ఆయన అమాయకంగా అడుగుతున్నారు. అది నిజానికి తనను తాను ప్రశ్నించుకోవలసిన విషయం. 2014లో అధికారంలోకి రావడానికి ఏకంగా 400 వాగ్దానాలను చేసిన చరిత్ర టీడీపీది.
పవర్ సంపాదించాక తన మానిఫెస్టోనే టీడీపీ వెచ్ సైట్ నుంచి తీసివేయడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. దీనిని కాదనగలరా? జగన్ చెబుతున్నట్లుగా మానిఫెస్టోలోని అంశాలు అన్నీ అమలు అయ్యాయా?లేదా? అన్నది ప్రజలను అడిగి తెలుసుకుంటే పోయేది కదా? అమ్మ ఒడి వస్తోందా? చేయూత వస్తోందా? చేనేత నేస్తం కాపు నేస్తం , విద్యాదీవెన ..ఇలా ఆయా స్కీముల గురించి ప్రజలను వాకబ్ చేసి ఉంటే బాగుండేది కదా! పోనీ తాను అమలు చేసిన వాగ్దానాలను వివరించి ఉండవచ్చు కదా!అవేమీ చెప్పలేని స్థితి. జగన్ స్కీములను అంగీకరించలేని నిస్సహాయత. అలా అని వాటిని కాదనలేరు. అందుకే తాను అధికారంలోకి వస్తే ఇంకా సంక్షేమం అమలు చేస్తానని అంటారు. అవేమిటో చెప్పలేరు. చంద్రబాబు చేసేదేమిటి? జగన్ ఇప్పటికే అమలు చేస్తున్నారు కదా అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. దీంతో ఏమి చేయాలో తోచక ఆయన సతమతమవుతున్నారు. ఆ క్రమంలోనే తనను, లోకేష్ ను చంపుతామంటున్నారని కొత్త ఆరోపణ చేస్తున్నారు.
ఎవరో ఏమ్మెల్యే సోదరుడు ఏదో అన్నారంటూ ఆయన ఈ విషయాలు చెబితే ప్రజలు మద్దతిచ్చేస్తారా? గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నపపుడు ఎన్నికలకు రెండున్నర ఏళ్లకు ముందుగానే ఒక ఎజెండాను సిద్దం చేసుకుని పాదయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్లారు. ప్రజల మనసు చూరగొన్నారు. మరి చంద్రబాబు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయనను పాదయాత్ర చేయాలని చెప్పడం లేదు. కాని ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తన 2024 ఎన్నికల ఎజెండా ఏమిటో వివరించాలి కదా! ఎంతసేపు జగన్‌ను దూషించడం తప్ప పాజిటివ్‌గా తను ఏమి చేస్తారో చెప్పలేకపోతున్నారు.
అదే సమయంలో జగన్ దైర్యంగా తాను ఫలానావి చేశానని, తాను మేలు చేశానని నమ్మితే ఆదరించండని ప్రజలను కోరుతున్నారు.ఇలాంటి మాట చంద్రబాబు తన చరిత్రలో ఎప్పుడూ చెప్పినట్లు గుర్తులేదు. ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు చెబుతున్నట్లు ఆయన పార్టీ వచ్చే ఎన్నికలలో ఓడిపోయినా, రాష్ట్రానికి చివరి చాన్స్ ఉండదు. ఎందుకంటే రాష్ట్రం, ప్రజలు శాశ్వతం కనుక. ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వస్తాయి కనుక. నిజానికి తెలుగుదేశం పార్టీకే జీవన్మరణ సమస్య. తనను గెలిపిస్తేనే ప్రజలలో చైతన్యం ఉన్నట్లు , లేకపోతే చైతన్యం లేనట్లు అని ఆయన భావిస్తుంటే అది ఆయన మానసిక బలహీనత తప్ప మరొకటి కాదు.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com