Did You Know MS Dhoni Smashed A Double Ton In 50-Over Match At Eden Gardens As Opener - Sakshi
Sakshi News home page

#MSDhoni: బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్‌ సెంచరీ; ఎప్పుడో తెలుసా?

Published Fri, Jul 7 2023 5:12 PM | Last Updated on Fri, Jul 7 2023 7:43 PM

MS Dhoni Smashed-Double-Ton-50-Over Match At Eden Gardens As-Opener - Sakshi

వన్డేల్లో ఎంఎస్‌ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్‌ మాత్రం ధోని కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్‌ షాట్‌లు బాగా ఫేమస్‌ అయ్యాయి.

అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్‌లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్‌ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్‌ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో కాదు.. దేశవాలీ క్రికెట్‌లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం.

జూన్‌ 6, 2005లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ధోని షామ్‌ బజార్‌ క్లబ్‌ తరపున 50 ఓవర్ల మ్యాచ్‌ ఆడాడు. పి-సేన్‌ టోర్నమెంట్‌లో భాగంగా జార్జ్‌ టెలిగ్రాఫ్‌తో షామ్‌ బజార్‌ క్లబ్‌ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం.

ఈ విషయాన్ని టెలిగ్రాఫ్‌ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్‌ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేష్‌(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్‌లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు.

ఇక ధోనికి వన్డేల్లో డబుల్‌ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్‌ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్‌ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్‌ ధోని 2007లో టి20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్‌ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్‌ ఇసుమంతైనా తగ్గలేదు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ 16వ సీజన్‌ చాలు ధోని క్రేజ్‌ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‍గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్‌లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్‌లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు.

చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' 

ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement