Happy Birthday Lionel Messi: All-Time Great Argentina Football Star - Sakshi
Sakshi News home page

#LionelMessi: 'కేజీఎఫ్‌' బ్యాక్‌గ్రౌండ్‌.. రోమాలు నిక్కబొడిచేలా.. ఇది చూశారా?

Published Sat, Jun 24 2023 8:20 AM | Last Updated on Sat, Jun 24 2023 8:36 AM

Happy Birthday To All-Time Great Argentina Star-Lionel Messi - Sakshi

5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్‌ లియోనల్‌ మెస్సీ.

లియోనల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ కెరీర్‌లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్‌ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్‌కప్‌ సాధించిన తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు.

తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్‌ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా అభివర్ణిస్తున్న లియోనల్‌ మెస్సీ ఇవాళ(జూన్‌ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్‌లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi..

విచిత్రమైన డెబ్యూ..
ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో  రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్‌ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్‌లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది.

అంతుచిక్కని వ్యాధి..
మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా గుర్తింపు..
2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన లియోనల్‌ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్‌ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా.. ఫుట్‌బాల్‌ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్‌లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌.. పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌ క్లబ్‌ తరపున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్‌.. ఓవరాల్‌గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ కలిపి 1028 మ్యాచ్‌లాడి 807 గోల్స్‌తో అత్యధిక గోల్స్‌ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement