
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్‌లు, అతని ఎండార్స్‌మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది.
తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్‌లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు.
ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment