Lionel Messi Birthday Special: Interesting Unknown Facts About His Life And Career - Sakshi
Sakshi News home page

Lionel Messi Unknown Facts: చిన్న వయసులోనే వింత రోగం.. ఫుట్‌బాల్ ఆడొద్దన్నారు; కట్‌చేస్తే

Published Fri, Jun 24 2022 3:48 PM | Last Updated on Sat, Jun 25 2022 6:10 AM

Happy Birthday Lionel Messi: Intresting Facts - Sakshi

ప్రస్తుత ఫుట్‌బాల్‌ అనగానే గుర్తుకువచ్చేది ఇద్దరు. ఒకరు అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ.. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో. సమకాలీనంలో ఈ ఇద్దరు ఎవరికి వారే గొప్ప ఆటగాళ్లు. ఇద్దరిలో ఎవరు గ్రేటెస్ట్‌ ఆల్‌ ఆఫ్‌ టైమ్‌(GOAT) అని అడిగితే మాత్రం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే మెస్సీకి ఎంత అభిమాన గణం ఉంటుందో.. అంతే అభిమానం రొనాల్డోకు ఉంటుంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం పక్కనబెడితే.. ఇవాళ అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మెస్సీ సాధించిన రికార్డులు.. ట్రోపీలు.. రివార్డులు లెక్కలేనన్ని. వాటి గురించి ఇది వరకు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మరి మెస్సీ గురించి మనకు తెలియని ఒక ఐదు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

మెస్సీ ఆడిన తొలి ఫుట్‌బాల్‌ క్లబ్‌..
మెస్సీని ఆరాధించే ఏ అభిమాని అయినా సరే అతను ఆడిన తొలి ఫుట్‌బాల్‌ క్లబ్‌ న్యూవెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌(ఎన్‌వోబీ) క్లబ్‌ అని ఇట్టే చెబుతారు. కానీ మెస్సీ ఆడిన తొలి ఫుట్‌బాల్‌ క్లబ్‌ అది కాదు. ఎందుకంటే ఏ ఆటగాడైనా సరే.. అందరూ ఆరాధించే స్థాయికి చేరుకున్నాడంటే మొదటి భీజం గట్టిగా ఉండాలి. ఆ విషయంలో మెస్సీ సరైన అడుగు వేశాడు. ఐదేళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌పై మమకారం పెంచుకున్న మెస్సీ ఆడిన తొలి ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఏంటో తెలుసా.. గ్రండోలీ క్లబ్‌. అర్జెంటీనాలో ఉన్న ఈ చిన్న ఫుట్‌బాల్‌ క్లబ్‌ను నడిపింది స్వయంగా మెస్సీ తండ్రినే కావడం విశేషం. అలా చిన్న వయసులోనే మెస్సీ ఇంట్లో నుంచే మంచి ప్రోత్సాహం లభించింది. 1992-95 వరకు తండ్రి క్లబ్‌కే ఆడిన మెస్సీ ఆ తర్వాత న్యువెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌(ఎన్‌వోబీ) క్లబ్‌కు మారి పూర్తి స్థాయి ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు.

అంతుపట్టని రోగం.. బార్సిలోనా అండగా
మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

పేపర్‌ నాప్కిన్‌పై తొలి ఒప్పంద సంతకం 
2000 సంవత్సరంలో గ్రోత్‌ హార్మోన్‌ లోపం(GHD) చికిత్స కోసం మెస్సీని బార్సిలోనా  క్లబ్‌ తమ వెంట తీసుకెళ్లింది. అంతేగాక మెస్సీని క్లబ్‌లోకి తీసుకుంటున్నట్లు చెప్పినప్పటికి ఎలాంటి అధికారిక కాంట్రాక్టును అందజేయలేదు. అయితే అప్పటికే బార్సిలోనా స్కౌట్ కార్లెస్ రెక్సాచ్ ఆటగాళ్ల శిక్షణ కోసం అర్జెంటీనాలో రొసారియోలో ఉన్నారు. అక్కడే తొలిసారి మెస్సీని చూసిన కార్లెస్‌ అతని నైపుణ్యానికి ఫిదా అయ్యాడు. బార్సిలోనాతో ఎలాంటి కాంట్రాక్ట్‌ లేదని తెలియడంతో వెంటనే ఒక కాగితంపై ఒప్పంద పత్రాన్ని రాసి అందించాడు. దీనిని సంతోషంగా అంగీకరించిన మెస్సీ అతని కుటుంబంతో స్పెయిన్‌కు వెళ్లే ముందు ఒప్పంద పత్రంపై సంతకం చేశాడు. ఇది అప్పట్లో వివాదానికి దారి తీసినప్పటికి కొన్నిరోజుల్లోనే బార్సిలోనా మెస్సీతో అధికారిక ఒప్పందం చేసుకుంది.

మెస్సీ కొట్టిన తొలి హ్యాట్రిక్‌
మెస్సీ ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నోసార్లు హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేశాడు. మరి మెస్సీ మొదటిసారి హ్యాట్రిక్‌ గోల్‌ నమోదు చేసింది ఎప్పుడో తెలుసా.? 19 ఏళ్ల వయసులో ఎల్‌ క్లాసియో తరపున రియల్‌ మాడ్రిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ మూడు గోల్స్‌తో మెరిశాడు. మెస్సీ కొట్టిన హ్యాట్రిక్‌ గోల్స్‌తో మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగియడం విశేషం. 


విచిత్రమైన డెబ్యూ..
ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో  రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్‌ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్‌లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement