ఏపీలో ఉనికి కోసం బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం దక్కడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరు అంటూ వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు. మరో వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కోవర్టుల కలకలం మరింత ఇబ్బంది పెడుతోంది. జనసేన పొత్తు విషయంలోనూ అయోమయం వెంటాడుతోంది. ఏతా వాతా మొత్తం మీద 2022 ఏపీ బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. కొంతలో కొంత ప్రధాని ఏపీలో రెండు సార్లు పర్యటించడం బీజేపీ కేడర్కు ఊరట.
ప్రకటనలు ఘనం - ఆచరణ శూన్యం
కమలం పార్టీని ఏపీలో పైకి లేపుదామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడంలేదు. ప్రజలకు దగ్గరయ్యేందుకు కాషాయ సేన చేపడుతున్న కార్యక్రమాలు సక్సెస్ కావడంలేదు. పార్టీలో టీడీపీ కోవర్టుల వ్యవహారం ఏడాదంతా చర్చనీయాంశంగానే ఉంటోంది. కలిసిరాని నేతలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటరి పోరు చేస్తున్నారు. ఏ పేరుతో కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు బీజేపీని పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నేతలను నిరాశకు గురి చేస్తోంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల సభలు నిర్వహించామని బీజేపీ నాయకులు ప్రకటించుకున్నా ఎక్కడా ప్రజాస్పందన లేదు. వచ్చే ఏడాది జనవరి ఆఖరు నుంచి ప్రజాపోరు-2 కూడా ఉంటుందని ప్రకటించినా ముఖ్య నేతల హాజరుపై అనేక అనుమానాలున్నాయి.
కన్నా.. ఎటు వైపన్నా?
పార్టీలో పెరిగిన అంతర్గత కలహాలపై అధిష్టానం వరకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. సోము వీర్రాజు వైఖరి వల్లే జనసేన బీజేపీకి దూరం అవుతోందంటూ కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీనిపై సోము వీర్రాజు బహిరంగంగా స్పందించకున్నా కన్నాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం...అధిష్టానం నుంచి కూడా కన్నాకి ముక్కుతాడు వేసే ప్రయత్నాలు జరగడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత కన్నా లక్ష్మీ నారాయణపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఇద్దరు కాపు సీనియర్ లీడర్లైన సోము వీర్రాజు, కన్నా మధ్య దూరం పెరగడమే కాదు ఇటీవలే కన్నా జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ కావడంతో...ఆయన జనసేనలో చేరతారనే ఊహాగానాలు పెరిగాయి.
అంతా కోవర్టులదే రాజ్యం
ఇక టిడిపి నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజె వెంకటేష్ తదితరుల వ్యవహార శైలి పార్టీకి తలనొప్పిగా మారింది. వీరంతా టిడిపి కోవర్టులుగా పనిచేస్తున్నారనే అనుమానం బీజేపీ లోనూ లేకపోలేదు. ప్రదాని మోదీ నవంబర్ లో విశాఖ వచ్చినపుడు పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశ వివరాలు బయటకి పొక్కడం వెనుక ఈ కోవర్టుల హస్తం ఉందనే అనుమానాలున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో..ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ బీజేపీని వీడి టిడిపిలో తిరిగి చేరతారని ఉహాగానాలు ఊపందుకున్నాయి.
పొత్తు పరిస్థితి గందరగోళం
గడిచిన మూడున్నర ఏళ్లగా జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్నా ఎక్కడా కలిసి కార్యక్రమాలు చేయలేదు. 2022 సంవత్సరం ఆరంభంలోనే రెండు పార్టీలు కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్, బీజేపీకి దూరంగా...టిడిపికి దగ్గరగా వెళ్తున్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నానంటూనే ఎప్పటికపుడు జనసేనాని బీజేపీకి ఝలక్ ఇస్తున్నారు. బీజేపీ సైతం తమ కార్యక్రమాలన్నింటినీ ఒంటరిగానే రూపొందించుకుని ముందుకు సాగింది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రైతు భరోసా యాత్రంటూ బీజేపీని దూరంగా ఉంచి ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో అటు బీజేపీ కార్యకర్తలకి...ఇటు జనసేన కార్యకర్తలకి పొత్తుపై అయోమయం కొనసాగుతూనే ఉంది. జనసేనతోనే కలిసి ఉన్నామని...వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేనలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా నిలకడలేని పవన్ వైఖరి ఎటు మళ్లుతుందో తెలియక తికమకపడుతున్నారు.
తలంటినా లాభం లేదా?
ఈ నేపధ్యంలోనే గత నెలలో ప్రదాని మోదీ విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జనసేనతో పొత్తుపై బీజేపీ ఆశలు చిగురించినా ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీతో పొత్తు అనుమానంగానే కన్పిస్తోందంటున్నారు. దీనికి తోడు ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపైనా విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి, జనసేనకి మధ్య దూరం పెరగడానికి సోము వీర్రాజే కారణమంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి కార్యచరణ రూపొందించడంలో విఫలమయ్యారని, పార్టీ శ్రేణులని కలుపుకు పోవడంలో సోము ఫెయిల్ అయ్యారనేది ఆయన వ్యతిరేకుల మాట. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసే బీజేపీ నేతలు..ఏపీకి విభజన హామీలు అమలు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. రైల్వే జోన్, పోలవరం సవరించిన అంచనాల ప్రకారం నిదులు మంజూరు చేయించడంలో చతికిలపడ్డారు బీజేపీ నేతలు. వారికి ఏమీ చేతకాక ప్రతిదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించడం అలవాటుగా చేసుకున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment