Roundup 2022
-
పొలిటికల్ రివ్యూ: 2022లో ఫ్యాన్ స్పీడ్ ఎంత?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2022 సంవత్సరం తీపి గుర్తులను మిగిల్చింది. ఈ ఏడాదిని సామాజిక న్యాయ నామ సంవత్సరంగా మార్చారు పార్టీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యం లభించింది. కేబినెట్ నుండి రాజ్యసభ సభ్యుల వరకు సంచలన నిర్ణయాలకు వేదికైంది ఈ ఏడాది. రాష్ట్రాభివృద్ధిలోను, సంక్షేమంలోనూ అత్యున్నత శిఖరాలకు చేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదో సరికొత్త చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2022 సంవత్సరంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్థానంలోనే మైలురాళ్లుగా నిలిచాయి. శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలి కేబినెట్లోనే చెప్పినట్టు.. సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్నిర్మించారు. కేబినెట్లోని 25 మంది మంత్రులతోను ముఖ్యమంత్రి రాజీనామా చేయించారు. మళ్లీ ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తొలి కేబినెట్లోని 25 మంది మంత్రుల్లో..11 మందికి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ కేబినెట్లో అవకాశం దక్కింది. కొత్తగా మరో 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు వైఎస్ జగన్. బీసీలకు పట్టం ఈ కొత్త కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విభిన్న కూర్పుతో ఏర్పడింది. సీఎం జగన్ తన మంత్రివర్గంలో 70 శాతంకి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చారు. అందులో నలుగురు మహిళలకు మంత్రి పదవులు దక్కాయి. 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీకి మంత్రి పదవులు లభించాయి. అగ్రవర్ణాల్లో కేవలం 8 మందికే కొత్త కేబినెట్లో అవకాశం లభించింది. చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేసినా ఇవ్వని అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ మూడేళ్లలోనే కల్పించారు. సామాజిక న్యాయం ఎలా ఉంటుందో, రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తానిచ్చే ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉంటుందో వైఎస్ జగన్ నిరూపించారు. గడప గడపకు విజయనాదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా ఈ ఏడాది మే నెలలో మరో చారిత్రక కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అధికారంలోకి రాకముందు గడప గడపకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకున్న జగన్ వాటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మూడేళ్ల పాలన పూర్తయ్యాక.. మే 11న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆచరణలో పెట్టారు. ప్రతీ ఇంటికీ ఎమ్మెల్యే లేదా సమన్వయకర్త సచివాలయ సిబ్బందితో పాటే వెళ్లి వారికి ఇప్పటి వరకు చేసిన లబ్ధిని వివరించాలని, ఇంకా వారి సమస్యలుంటే పరిష్కరించాలని ఆదేశించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను ఇలా ప్రజల దగ్గరకు పంపిన చరిత్ర లేదు. ఆ రికార్డు, ఆ ధైర్యం కూడా ఒక్క వైఎస్ జగనేకే సాధ్యమైంది. ప్రతీ నెలా పది సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా ఆదేశించడమే కాకుండా ప్రతి సచివాలయం పరిధిలోనూ అభివృద్ధి పనుల కోసం 20 లక్షలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమం మొత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపింది. గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లేలా చేయడమే కాదు, వివక్షలేని పరిపాలన అందించడం వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతీ గ్రామంలోను, వార్డులోను ఎంత బలంగా ఉందో నిరూపించింది. అందుకే సీఎం జగన్ ప్రతీ రెండు నెలలకు దీనిపై సమీక్ష నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను మోటివేట్ చేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం ఎంత సక్సెస్ అయ్యిందంటే...ఇది చూసి ప్రతిపక్ష టీడీపీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ అంటూ తమ పార్టీ నేతలను ప్రజల్లోకి పంపేందుకు కార్యాచరణ రూపొందంచుకోవాల్సి వచ్చింది. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్ రాజ్యసభ ఎన్నికల సమయంలోను వైఎస్ జగన్ తనదైన ముద్ర వేశారు. అది కూడా ఈ ఏడాది ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. రాజ్యసభ స్థానాల్లో సైతం బీసీలకు 50 శాతం ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయనిది వైఎస్ జగన్ చేసి చూపించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో..ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రెండోసారి కొనసాగించారు సీఎం జగన్. అలాగే ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. రెండు స్థానాల్ని అగ్రవర్ణాలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మిగిలిన రెండు స్థానాలను బీసీలకే ఇచ్చారు. బీసీ వర్గాల నుండి ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభకు అవకాశం కల్పించారు. దీంతో రాజ్యసభలో పార్టీకి ఉన్న మొత్తం ఎనిమిది మంది సభ్యుల్లో.. బీసీలకు నాలుగు స్థానాలు దక్కడంతో సగం వాటా ఇచ్చినట్టయ్యంది. చంద్రబాబు తన హయాంలో ఒక్కరంటే ఒక్క బీసీకి కూడా రాజ్యసభకు అవకాశం ఇవ్వలేదు. కానీ సీఎం జగన్ సగం స్థానాలను బీసీలకు ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ అన్నట్టుగా ప్రశంసలు పొందారు. మే నెలాఖరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నిర్వహించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ బస్సు యాత్రను నిర్వహించారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు సాగిన బస్సు యాత్రకి అనూహ్యమైన స్పందన లభించింది. ముఖ్యమంత్రి లేకపోయినా ఈ కార్యక్రమానికి భారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ హాజరుకావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. టార్గెట్ 175/175 జులై 8, 9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ ప్లీనరీని నిర్వహించింది. ఈ ప్లీనరీ నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోవిడ్ పరిస్థితుల వలన ప్లీనరీ జరగలేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి ప్లీనరీ కావడంతో కార్యకర్తల నుండి స్పందన అనూహ్యంగా వచ్చింది. మొదటి రోజు లక్షన్నర మంది కార్యకర్తలు హాజరు కాగా, రెండో రోజు ముగింపు సభకు జనసందోహం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఏ జాతీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ కానీ గత ఐదు దశాబ్ధాల్లో ఎన్నడూ నిర్వహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల గెలుపే టార్గెట్ గా అనుసరించాల్సిన కార్యాచరణపై వైఎస్ జగన్ ఈ ప్లీనరీలో క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. సరికొత్తగా పార్టీ స్వరూపం ఈ ప్లీనరీ ఎంత సక్సెస్ అయ్యిందంటే.. ప్లీనరీపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందించడానికి కూడా ప్రజల ముందుకు రాలేకపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం, కార్యకర్తల బలం ఏ స్థాయిలో ఉందో ప్లీనరీ రుజువు చేసింది. రెండో రోజు ముగింపు సభకి నాలుగు లక్షల మంది రావడం.. రెండు రోజుల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని ఓ పండగలా నిర్వహించడం.. ఈ ఏడాది చారిత్రక మైలు రాయిగా మిగిలింది. ప్లీనరీతో పాటు ఈ ఏడాది పార్టీకి చెందిన రీజనల్ కో ఆర్డినేటర్లను, 26 జిల్లాల అధ్యక్షులను నియమించారు. అంతేకాదు పార్టీ అనుబంధ విభాగాలన్నింటికీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం కల్పించి మొత్తం పార్టీ స్వరూపాన్నే మార్చి కొత్త పుంతలు తొక్కించారు వైఎస్ జగన్. సభలు సూపర్‌హిట్ వరుస కార్యక్రమాలతో మంచి స్పీడ్ మీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ మహాసభ నిర్వహించింది. బీసీ మహాసభ సూపర్ సక్సెస్ అయ్యింది. కేవలం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ వార్డ్ మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడి వరకు సర్పంచ్ ల నుండి మంత్రుల వరకు అవకాశం దక్కిన బీసీలతో ఈ సభ నిర్వహించారు. ఇలా మూడేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వంలో అవకాశం దక్కిన 84 వేల మంది బీసీ నాయకులు, కార్యకర్తలతో ఈ జయహో బీసీ మహాసభను నిర్వహించారు. ఇది మరో రాజకీయ రికార్డ్ గా మిగిలింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా పదవులు ఇచ్చిన బీసీలతో ఇంత పెద్ద ఎత్తున సభను నిర్వహించలేకపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలా 84 వేల మంది బీసీలకు పదవులు ఇచ్చిన రాజకీయ పార్టీ ఈ రాష్ట్ర చరిత్రలో లేనే లేదు. హైస్పీడ్ మోడ్‌లో ఫ్యాన్ బీసీ సభ సక్సెస్ తర్వాత సీఎం జగన్ ఇప్పుడు క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ వేశారు. గ్రామ కన్వీనర్లు, గ్రామ సారథులు, గృహ సారథులను నియమించాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు పరిశీలించేందుకు పక్క జిల్లాలకు చెందిన పరిశీలకులను నియమించారు. డిసెంబర్ చివరి వారంలో ప్రతీ 50 ఇళ్లకి ఇద్దరు గృహసారథులు, ప్రతీ సచివాలయానికి ముగ్గురు గ్రామ సారథులను నియమించబోతున్నారు. ఈ వ్యవస్థ రాష్ట్ర రాజకీయాల్లోనే వినూత్నమైంది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించేందుకు సీఎం జగన్ సిద్ధం చేస్తున్న సైన్యంగా పార్టీ భావిస్తోంది. ఇలా 50 ఇళ్లతో కూడి క్లస్టర్ నుండి రాష్ట్ర స్థాయి వరకు 2022 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖచిత్రం, స్వరూపమే మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను హై స్పీడ్ మోడ్ లోకి తెచ్చింది 2022. అన్నిటా విజయాలే తప్ప ఒక్క అపజయం కూడా నమోదు కాకకపోవడం ఈ ఏడాదికున్న ప్రత్యేకతగా చెప్పవచ్చు .-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ రివ్యూ : ఏపీ బీజేపీని కోవర్టులే దెబ్బతీస్తున్నారా?
ఏపీలో ఉనికి కోసం బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం దక్కడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరు అంటూ వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు. మరో వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కోవర్టుల కలకలం మరింత ఇబ్బంది పెడుతోంది. జనసేన పొత్తు విషయంలోనూ అయోమయం వెంటాడుతోంది. ఏతా వాతా మొత్తం మీద 2022 ఏపీ బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. కొంతలో కొంత ప్రధాని ఏపీలో రెండు సార్లు పర్యటించడం బీజేపీ కేడర్‌కు ఊరట. ప్రకటనలు ఘనం - ఆచరణ శూన్యం కమలం పార్టీని ఏపీలో పైకి లేపుదామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడంలేదు. ప్రజలకు దగ్గరయ్యేందుకు కాషాయ సేన చేపడుతున్న కార్యక్రమాలు సక్సెస్ కావడంలేదు. పార్టీలో టీడీపీ కోవర్టుల వ్యవహారం ఏడాదంతా చర్చనీయాంశంగానే ఉంటోంది. కలిసిరాని నేతలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటరి పోరు చేస్తున్నారు. ఏ పేరుతో కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు బీజేపీని పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నేతలను నిరాశకు గురి చేస్తోంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల సభలు నిర్వహించామని బీజేపీ నాయకులు ప్రకటించుకున్నా ఎక్కడా ప్రజాస్పందన లేదు. వచ్చే ఏడాది జనవరి ఆఖరు నుంచి ప్రజాపోరు-2 కూడా ఉంటుందని ప్రకటించినా ముఖ్య నేతల హాజరుపై అనేక అనుమానాలున్నాయి. కన్నా.. ఎటు వైపన్నా? పార్టీలో పెరిగిన అంతర్గత కలహాలపై అధిష్టానం వరకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. సోము వీర్రాజు వైఖరి వల్లే జనసేన బీజేపీకి దూరం అవుతోందంటూ కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీనిపై సోము వీర్రాజు బహిరంగంగా స్పందించకున్నా కన్నాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం...అధిష్టానం నుంచి కూడా కన్నాకి ముక్కుతాడు వేసే ప్రయత్నాలు జరగడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత కన్నా లక్ష్మీ నారాయణపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఇద్దరు కాపు సీనియర్ లీడర్లైన సోము వీర్రాజు, కన్నా మధ్య దూరం పెరగడమే కాదు ఇటీవలే కన్నా జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ కావడంతో...ఆయన జనసేనలో చేరతారనే ఊహాగానాలు పెరిగాయి. అంతా కోవర్టులదే రాజ్యం ఇక టిడిపి నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజె వెంకటేష్ తదితరుల వ్యవహార శైలి పార్టీకి తలనొప్పిగా మారింది. వీరంతా టిడిపి కోవర్టులుగా పనిచేస్తున్నారనే అనుమానం బీజేపీ లోనూ లేకపోలేదు. ప్రదాని మోదీ నవంబర్ లో విశాఖ వచ్చినపుడు పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశ వివరాలు బయటకి పొక్కడం వెనుక ఈ కోవర్టుల హస్తం ఉందనే అనుమానాలున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో..ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ బీజేపీని వీడి టిడిపిలో తిరిగి చేరతారని ఉహాగానాలు ఊపందుకున్నాయి. పొత్తు పరిస్థితి గందరగోళం గడిచిన మూడున్నర ఏళ్లగా జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్నా ఎక్కడా కలిసి కార్యక్రమాలు చేయలేదు. 2022 సంవత్సరం ఆరంభంలోనే రెండు పార్టీలు కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్, బీజేపీకి దూరంగా...టిడిపికి దగ్గరగా వెళ్తున్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నానంటూనే ఎప్పటికపుడు జనసేనాని బీజేపీకి ఝలక్ ఇస్తున్నారు. బీజేపీ సైతం తమ కార్యక్రమాలన్నింటినీ ఒంటరిగానే రూపొందించుకుని ముందుకు సాగింది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రైతు భరోసా యాత్రంటూ బీజేపీని దూరంగా ఉంచి ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో అటు బీజేపీ కార్యకర్తలకి...ఇటు జనసేన కార్యకర్తలకి పొత్తుపై అయోమయం కొనసాగుతూనే ఉంది. జనసేనతోనే కలిసి ఉన్నామని...వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేనలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా నిలకడలేని పవన్ వైఖరి ఎటు మళ్లుతుందో తెలియక తికమకపడుతున్నారు. తలంటినా లాభం లేదా? ఈ నేపధ్యంలోనే గత నెలలో ప్రదాని మోదీ విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జనసేనతో పొత్తుపై బీజేపీ ఆశలు చిగురించినా ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీతో పొత్తు అనుమానంగానే కన్పిస్తోందంటున్నారు. దీనికి తోడు ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపైనా విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి, జనసేనకి మధ్య దూరం పెరగడానికి సోము వీర్రాజే కారణమంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి కార్యచరణ రూపొందించడంలో విఫలమయ్యారని, పార్టీ శ్రేణులని కలుపుకు పోవడంలో సోము ఫెయిల్ అయ్యారనేది ఆయన వ్యతిరేకుల మాట. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసే బీజేపీ నేతలు..ఏపీకి విభజన హామీలు అమలు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. రైల్వే జోన్, పోలవరం సవరించిన అంచనాల ప్రకారం నిదులు మంజూరు చేయించడంలో చతికిలపడ్డారు బీజేపీ నేతలు. వారికి ఏమీ చేతకాక ప్రతిదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించడం అలవాటుగా చేసుకున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ రివ్యూ - 2022లో చీపురుకున్న క్రేజ్ ఎంత?
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రస్థానం ప్రారంభించిన ఆప్ ఇప్పుడు ఉత్తర భారతంలో మెల్లిగా తన ఊడలు దించుతోంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ గెలిచిన ఆప్... హిమాచల్, గుజరాత్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. దేశంలో అటు కమలానికి ఇటు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ 2022లో సాధించిన ఫలితాలు తక్కువేమీ కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దేశంలోని అవినీతిని ఊడ్చేస్తామంటూ ఆప్ నాయకులు చీపురును తమ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారు. పార్టీ ప్రారంభించిన ఏడాదిలోపే.. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఆప్ దేశవ్యాప్తంగా మేధావుల దృష్టిని ఆకర్షించింది. మెజారిటీ మార్క్ దాటకపోయినా మైనారిటీ సర్కారును ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏడాది కాలం పాలించింది. కూల్చివేత భయంతో మళ్లీ ఎన్నికలకు వెళ్లి 70సీట్లకు గాను 67స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించారు. మొహల్లా క్లినిక్స్ పేరుతో కాలనీ క్లినిక్కులు ఏర్పాటు చేయడం... ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగు పరచడంతో ఆ పార్టీ దిగువ, మధ్య తరగతి వర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకుంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 62 స్థానాలు గెలిచి ఆప్ తనకు తిరుగులేదని చాటింది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు సాధిస్తున్నా... లోక్‌సభ ఎలక్షన్లలో మాత్రం ఆప్ ఢిల్లీలో ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. ఢిల్లీ తరువాత ఆప్ 2015 నుంచే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది. పంజాబ్‌లో చీపురు పంజా గత ఐదారేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఆప్ చేస్తున్న ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చాయి. 2022 ప్రారంభంలో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సర్దార్జీల మనసు గెల్చుకున్న ఆప్ 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 92 సీట్లు గెలుచుకుంది. ఆప్ దెబ్బకు పంజాబ్‌లో దశాబ్దాలుగా అధికారం అనుభవించిన కాంగ్రెస్, అకాలీలు కుదేలైపోయారు. మహామహులు సామాన్యుల చేతిలో చిత్తైపోయారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీకి మింగుడు పడలేదు. ముఖ్యంగా దశాబ్ద కాలం పాటు కేవలం ఢిల్లీకే పరిమితమైన ఆప్ మొదటిసారి ఢిల్లీ బయట అధికారం రుచి చూసింది. దీంతో ఇక కేజ్రీవాల్‌ను సీరియస్ కంటెండర్‌గా ప్రధాన పార్టీలు చూడటం ప్రారంభించాయి. అయితే పంజాబ్ కన్నా ముందు ఉత్తరాఖండ్‌లోనూ ఆప్ సీరియస్‌గానే ప్రయత్నించింది. అయితే అక్కడ ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతైపోయాయి. గుజరాత్లో భారీగా పెరిగిన ఓట్లు పంజాబ్ గెలుపుతో ఫుల్ జోష్ మీదున్న కేజ్రీవాల్ అటు హిమాచల్ ఇటు గుజరాత్లో గెలవడానికి వ్యూహాలు పన్నారు. అన్ని విధాలుగా వనరులు సమకూర్చుకున్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపేయిన్ చూసిన వాళ్లు ఆ పార్టీ గెలుస్తుందనే ఊహించారు. అయితే ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్న స్థాయిలో ప్రజల అభిమానాన్ని సంపాదించలేకపోయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 స్థానాలు మాత్రమే గెలిచిన ఆప్ గణనీయంగా ఓటు బ్యాంకును సాధించుకుంది. గుజారాత్‌లో ఓటుబ్యాంకు పెంచుకోవడం ద్వారా ఇప్పుడు ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. గుజారాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను చాలా స్థానాల్లో ఆప్ దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఆప్ గుజరాత్ గెలవకపోయినా...మోదీ గడ్డపైన ఇకపై కేజ్రీవాల్ కూడా బలమైన ప్రత్యర్ధే అని ఈ ఎన్నికలు తేల్చేశాయి. ఇక గుజరాత్ ఎన్నికలతో పాటు హిమాచల్‌లోనూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ తుస్సుమంది. ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. హిమాచల్‌లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చాలా కాలంగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ కార్పోరేషన్‌ను ఈసారి ఆప్ కైవసం చేసుకుంది. దీంతో ఇక ఢిల్లీలో కేజ్రీవాల్‌కు ఎదురులేదని మరోసారి స్పష్టమైంది. మద్యం స్కాం మరకలు దేశవ్యాప్తంగా విస్తరించాలనే దూకుడుతో ఉన్న ఆప్‌కు ఈ ఏడాది ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. దీంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామంటూ దేశవ్యాప్తంగా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న ఆప్ సర్కార్‌లోని మంత్రులు అవినీతిపరులనే విమర్శలు చెలరేగాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నెంబర్-2 అయిన సిసోడియాపైనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన అనుయాయులను ఇప్పిటేకే సీబీఐ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ సైతం ఈ కేసులో ఇరుకున్నారనే వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అటు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆప్ ఉవ్విళ్ళూరుతోంది. దక్షిణాదిలో కేసీఆర్ లాంటి నాయకులతో దోస్తీ చేయడం ద్వారా 2024 ఎన్నికల నాటికి బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆప్ ప్రణాళికలు రచిస్తోంది. ఓవైపు విస్తరణ వ్యూహం మరోవైపు ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రారంభించిన ఆప్ ఇటీవలి కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కరెన్సీ నోట్లపై దేవతల గుర్తులు వేయాలని కేజ్రీవాల్ చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్, బీజేపీలు తప్పుబట్టాయి. ఇక లిక్కర్ స్కాంలో ముఖ్యనేతలు ఇరుక్కోవడం ఆప్ ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. అయినా తాము వచ్చే ఏడాది మరిన్ని రాష్ట్రాలు గెలిచి లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన పార్టీగా ఎదుగుతామని ఆప్ చెబుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com