వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2022 సంవత్సరం తీపి గుర్తులను మిగిల్చింది. ఈ ఏడాదిని సామాజిక న్యాయ నామ సంవత్సరంగా మార్చారు పార్టీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యం లభించింది. కేబినెట్ నుండి రాజ్యసభ సభ్యుల వరకు సంచలన నిర్ణయాలకు వేదికైంది ఈ ఏడాది. రాష్ట్రాభివృద్ధిలోను, సంక్షేమంలోనూ అత్యున్నత శిఖరాలకు చేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇదో సరికొత్త చరిత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2022 సంవత్సరంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్థానంలోనే మైలురాళ్లుగా నిలిచాయి. శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలి కేబినెట్‌లోనే చెప్పినట్టు.. సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్నిర్మించారు. కేబినెట్‌లోని 25 మంది మంత్రులతోను ముఖ్యమంత్రి రాజీనామా చేయించారు. మళ్లీ ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తొలి కేబినెట్‌లోని 25 మంది మంత్రుల్లో..11 మందికి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ కేబినెట్‌లో అవకాశం దక్కింది. కొత్తగా మరో 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు వైఎస్ జగన్.
బీసీలకు పట్టం
ఈ కొత్త కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విభిన్న కూర్పుతో ఏర్పడింది. సీఎం జగన్ తన మంత్రివర్గంలో 70 శాతంకి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చారు. అందులో నలుగురు మహిళలకు మంత్రి పదవులు దక్కాయి. 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీకి మంత్రి పదవులు లభించాయి. అగ్రవర్ణాల్లో కేవలం 8 మందికే కొత్త కేబినెట్‌లో అవకాశం లభించింది. చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేసినా ఇవ్వని అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ మూడేళ్లలోనే కల్పించారు. సామాజిక న్యాయం ఎలా ఉంటుందో, రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తానిచ్చే ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉంటుందో వైఎస్ జగన్ నిరూపించారు.
గడప గడపకు విజయనాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా ఈ ఏడాది మే నెలలో మరో చారిత్రక కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అధికారంలోకి రాకముందు గడప గడపకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకున్న జగన్ వాటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మూడేళ్ల పాలన పూర్తయ్యాక.. మే 11న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆచరణలో పెట్టారు.
ప్రతీ ఇంటికీ ఎమ్మెల్యే లేదా సమన్వయకర్త సచివాలయ సిబ్బందితో పాటే వెళ్లి వారికి ఇప్పటి వరకు చేసిన లబ్ధిని వివరించాలని, ఇంకా వారి సమస్యలుంటే పరిష్కరించాలని ఆదేశించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను ఇలా ప్రజల దగ్గరకు పంపిన చరిత్ర లేదు. ఆ రికార్డు, ఆ ధైర్యం కూడా ఒక్క వైఎస్ జగనేకే సాధ్యమైంది. ప్రతీ నెలా పది సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా ఆదేశించడమే కాకుండా ప్రతి సచివాలయం పరిధిలోనూ అభివృద్ధి పనుల కోసం 20 లక్షలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమం మొత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపింది. గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లేలా చేయడమే కాదు, వివక్షలేని పరిపాలన అందించడం వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతీ గ్రామంలోను, వార్డులోను ఎంత బలంగా ఉందో నిరూపించింది. అందుకే సీఎం జగన్ ప్రతీ రెండు నెలలకు దీనిపై సమీక్ష నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను మోటివేట్ చేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం ఎంత సక్సెస్ అయ్యిందంటే...ఇది చూసి ప్రతిపక్ష టీడీపీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ అంటూ తమ పార్టీ నేతలను ప్రజల్లోకి పంపేందుకు కార్యాచరణ రూపొందంచుకోవాల్సి వచ్చింది.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్
రాజ్యసభ ఎన్నికల సమయంలోను వైఎస్ జగన్ తనదైన ముద్ర వేశారు. అది కూడా ఈ ఏడాది ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. రాజ్యసభ స్థానాల్లో సైతం బీసీలకు 50 శాతం ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయనిది వైఎస్ జగన్ చేసి చూపించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో..ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రెండోసారి కొనసాగించారు సీఎం జగన్. అలాగే ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. రెండు స్థానాల్ని అగ్రవర్ణాలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మిగిలిన రెండు స్థానాలను బీసీలకే ఇచ్చారు. బీసీ వర్గాల నుండి ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభకు అవకాశం కల్పించారు.
దీంతో రాజ్యసభలో పార్టీకి ఉన్న మొత్తం ఎనిమిది మంది సభ్యుల్లో.. బీసీలకు నాలుగు స్థానాలు దక్కడంతో సగం వాటా ఇచ్చినట్టయ్యంది. చంద్రబాబు తన హయాంలో ఒక్కరంటే ఒక్క బీసీకి కూడా రాజ్యసభకు అవకాశం ఇవ్వలేదు. కానీ సీఎం జగన్ సగం స్థానాలను బీసీలకు ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ అన్నట్టుగా ప్రశంసలు పొందారు. మే నెలాఖరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నిర్వహించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ బస్సు యాత్రను నిర్వహించారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు సాగిన బస్సు యాత్రకి అనూహ్యమైన స్పందన లభించింది. ముఖ్యమంత్రి లేకపోయినా ఈ కార్యక్రమానికి భారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ హాజరుకావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది.
టార్గెట్ 175/175
జులై 8, 9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ ప్లీనరీని నిర్వహించింది. ఈ ప్లీనరీ నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోవిడ్ పరిస్థితుల వలన ప్లీనరీ జరగలేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి ప్లీనరీ కావడంతో కార్యకర్తల నుండి స్పందన అనూహ్యంగా వచ్చింది. మొదటి రోజు లక్షన్నర మంది కార్యకర్తలు హాజరు కాగా, రెండో రోజు ముగింపు సభకు జనసందోహం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఏ జాతీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ కానీ గత ఐదు దశాబ్ధాల్లో ఎన్నడూ నిర్వహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల గెలుపే టార్గెట్ గా అనుసరించాల్సిన కార్యాచరణపై వైఎస్ జగన్ ఈ ప్లీనరీలో క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
సరికొత్తగా పార్టీ స్వరూపం
ఈ ప్లీనరీ ఎంత సక్సెస్ అయ్యిందంటే.. ప్లీనరీపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందించడానికి కూడా ప్రజల ముందుకు రాలేకపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం, కార్యకర్తల బలం ఏ స్థాయిలో ఉందో ప్లీనరీ రుజువు చేసింది. రెండో రోజు ముగింపు సభకి నాలుగు లక్షల మంది రావడం.. రెండు రోజుల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని ఓ పండగలా నిర్వహించడం.. ఈ ఏడాది చారిత్రక మైలు రాయిగా మిగిలింది. ప్లీనరీతో పాటు ఈ ఏడాది పార్టీకి చెందిన రీజనల్ కో ఆర్డినేటర్లను, 26 జిల్లాల అధ్యక్షులను నియమించారు. అంతేకాదు పార్టీ అనుబంధ విభాగాలన్నింటికీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం కల్పించి మొత్తం పార్టీ స్వరూపాన్నే మార్చి కొత్త పుంతలు తొక్కించారు వైఎస్ జగన్.
సభలు సూపర్‌హిట్
వరుస కార్యక్రమాలతో మంచి స్పీడ్ మీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ మహాసభ నిర్వహించింది. బీసీ మహాసభ సూపర్ సక్సెస్ అయ్యింది. కేవలం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ వార్డ్ మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడి వరకు సర్పంచ్ ల నుండి మంత్రుల వరకు అవకాశం దక్కిన బీసీలతో ఈ సభ నిర్వహించారు. ఇలా మూడేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వంలో అవకాశం దక్కిన 84 వేల మంది బీసీ నాయకులు, కార్యకర్తలతో ఈ జయహో బీసీ మహాసభను నిర్వహించారు. ఇది మరో రాజకీయ రికార్డ్ గా మిగిలింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా పదవులు ఇచ్చిన బీసీలతో ఇంత పెద్ద ఎత్తున సభను నిర్వహించలేకపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలా 84 వేల మంది బీసీలకు పదవులు ఇచ్చిన రాజకీయ పార్టీ ఈ రాష్ట్ర చరిత్రలో లేనే లేదు.
హైస్పీడ్ మోడ్‌లో ఫ్యాన్
బీసీ సభ సక్సెస్ తర్వాత సీఎం జగన్ ఇప్పుడు క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ వేశారు. గ్రామ కన్వీనర్లు, గ్రామ సారథులు, గృహ సారథులను నియమించాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు పరిశీలించేందుకు పక్క జిల్లాలకు చెందిన పరిశీలకులను నియమించారు. డిసెంబర్ చివరి వారంలో ప్రతీ 50 ఇళ్లకి ఇద్దరు గృహసారథులు, ప్రతీ సచివాలయానికి ముగ్గురు గ్రామ సారథులను నియమించబోతున్నారు. ఈ వ్యవస్థ రాష్ట్ర రాజకీయాల్లోనే వినూత్నమైంది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించేందుకు సీఎం జగన్ సిద్ధం చేస్తున్న సైన్యంగా పార్టీ భావిస్తోంది. ఇలా 50 ఇళ్లతో కూడి క్లస్టర్ నుండి రాష్ట్ర స్థాయి వరకు 2022 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖచిత్రం, స్వరూపమే మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను హై స్పీడ్ మోడ్ లోకి తెచ్చింది 2022. అన్నిటా విజయాలే తప్ప ఒక్క అపజయం కూడా నమోదు కాకకపోవడం ఈ ఏడాదికున్న ప్రత్యేకతగా చెప్పవచ్చు
.-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment