పొలిటికల్ రివ్యూ - 2022లో చీపురుకున్న క్రేజ్ ఎంత? | 2022 Year Review: Politics Of Aam Aadmi party | Sakshi
Sakshi News home page

పొలిటికల్ రివ్యూ - 2022లో చీపురుకున్న క్రేజ్ ఎంత?

Published Sun, Jan 1 2023 4:48 PM | Last Updated on Sun, Jan 1 2023 5:09 PM

2022 Year Review: Politics Of Aam Aadmi party - Sakshi

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రస్థానం ప్రారంభించిన ఆప్ ఇప్పుడు  ఉత్తర భారతంలో మెల్లిగా తన ఊడలు దించుతోంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ గెలిచిన ఆప్... హిమాచల్, గుజరాత్‌లో మాత్రం ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.  దేశంలో అటు కమలానికి ఇటు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ 2022లో సాధించిన ఫలితాలు తక్కువేమీ కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

దేశంలోని అవినీతిని ఊడ్చేస్తామంటూ ఆప్ నాయకులు చీపురును తమ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారు. పార్టీ ప్రారంభించిన ఏడాదిలోపే.. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఆప్ దేశవ్యాప్తంగా మేధావుల దృష్టిని ఆకర్షించింది. మెజారిటీ మార్క్ దాటకపోయినా మైనారిటీ సర్కారును ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏడాది కాలం పాలించింది. కూల్చివేత భయంతో మళ్లీ ఎన్నికలకు వెళ్లి 70సీట్లకు గాను 67స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించారు.

మొహల్లా క్లినిక్స్ పేరుతో కాలనీ క్లినిక్కులు ఏర్పాటు చేయడం... ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగు పరచడంతో ఆ పార్టీ దిగువ, మధ్య తరగతి వర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకుంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 62 స్థానాలు గెలిచి ఆప్ తనకు తిరుగులేదని చాటింది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు సాధిస్తున్నా... లోక్‌సభ ఎలక్షన్లలో మాత్రం ఆప్ ఢిల్లీలో ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. ఢిల్లీ తరువాత ఆప్ 2015 నుంచే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది.

పంజాబ్‌లో చీపురు పంజా
గత ఐదారేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఆప్ చేస్తున్న ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చాయి. 2022 ప్రారంభంలో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సర్దార్జీల మనసు గెల్చుకున్న ఆప్ 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 92 సీట్లు గెలుచుకుంది.

ఆప్ దెబ్బకు పంజాబ్లో దశాబ్దాలుగా అధికారం అనుభవించిన కాంగ్రెస్, అకాలీలు కుదేలైపోయారు. మహామహులు సామాన్యుల చేతిలో చిత్తైపోయారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీకి మింగుడు పడలేదు. ముఖ్యంగా దశాబ్ద కాలం పాటు కేవలం ఢిల్లీకే పరిమితమైన ఆప్ మొదటిసారి ఢిల్లీ బయట అధికారం రుచి చూసింది. దీంతో ఇక కేజ్రీవాల్‌ను సీరియస్ కంటెండర్‌గా ప్రధాన పార్టీలు చూడటం ప్రారంభించాయి. అయితే పంజాబ్ కన్నా ముందు ఉత్తరాఖండ్‌లోనూ ఆప్ సీరియస్‌గానే ప్రయత్నించింది. అయితే అక్కడ ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతైపోయాయి.

గుజరాత్‌లో భారీగా పెరిగిన ఓట్లు
పంజాబ్ గెలుపుతో ఫుల్ జోష్ మీదున్న కేజ్రీవాల్ అటు హిమాచల్ ఇటు గుజరాత్‌లో గెలవడానికి వ్యూహాలు పన్నారు. అన్ని విధాలుగా వనరులు సమకూర్చుకున్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపేయిన్ చూసిన వాళ్లు ఆ పార్టీ గెలుస్తుందనే ఊహించారు. అయితే  ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్న స్థాయిలో ప్రజల అభిమానాన్ని సంపాదించలేకపోయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 స్థానాలు మాత్రమే గెలిచిన ఆప్ గణనీయంగా ఓటు బ్యాంకును సాధించుకుంది.

గుజారాత్‌లో ఓటుబ్యాంకు పెంచుకోవడం ద్వారా ఇప్పుడు ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. గుజారాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను చాలా స్థానాల్లో ఆప్ దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఆప్ గుజరాత్ గెలవకపోయినా...మోదీ గడ్డపైన ఇకపై కేజ్రీవాల్ కూడా బలమైన ప్రత్యర్ధే అని ఈ ఎన్నికలు తేల్చేశాయి.

ఇక గుజరాత్ ఎన్నికలతో పాటు హిమాచల్లోనూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ తుస్సుమంది. ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. హిమాచల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చాలా కాలంగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ కార్పోరేషన్ను ఈసారి ఆప్ కైవసం చేసుకుంది. దీంతో ఇక ఢిల్లీలో కేజ్రీవాల్కు ఎదురులేదని మరోసారి స్పష్టమైంది. 

మద్యం స్కాం మరకలు
దేశవ్యాప్తంగా విస్తరించాలనే దూకుడుతో ఉన్న ఆప్‌కు ఈ ఏడాది ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. దీంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామంటూ దేశవ్యాప్తంగా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న ఆప్ సర్కార్‌లోని మంత్రులు అవినీతిపరులనే విమర్శలు చెలరేగాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్‌ నెంబర్-2 అయిన సిసోడియాపైనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

ఆయన అనుయాయులను ఇప్పిటేకే సీబీఐ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ సైతం ఈ కేసులో ఇరుకున్నారనే వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అటు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆప్ ఉవ్విళ్ళూరుతోంది. దక్షిణాదిలో కేసీఆర్ లాంటి నాయకులతో దోస్తీ చేయడం ద్వారా 2024 ఎన్నికల నాటికి బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆప్ ప్రణాళికలు రచిస్తోంది. ఓవైపు విస్తరణ వ్యూహం మరోవైపు ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రారంభించిన ఆప్ ఇటీవలి కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కరెన్సీ నోట్లపై దేవతల గుర్తులు వేయాలని కేజ్రీవాల్ చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్, బీజేపీలు తప్పుబట్టాయి. ఇక లిక్కర్ స్కాంలో ముఖ్యనేతలు ఇరుక్కోవడం ఆప్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. అయినా తాము వచ్చే ఏడాది మరిన్ని రాష్ట్రాలు గెలిచి లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన పార్టీగా ఎదుగుతామని ఆప్ చెబుతోంది. 
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement