ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్‌ సెంచరీ! | 100 Crores Club Movies: 2024 Significant Milestone for Malayalam Film industry | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్‌ సెంచరీ!

Published Thu, Dec 12 2024 5:02 PM | Last Updated on Thu, Dec 12 2024 6:57 PM

100 Crores Club Movies: 2024 Significant Milestone for Malayalam Film industry

ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్‌ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్‌ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్‌ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్‌ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. 

వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్‌ బడ్జెట్‌, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. 

మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్‌..).. హాఫ్‌ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్‌’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్‌ సెంచరీ బాది ట్రేడ్‌ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.

ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మ‌ల్ బాయ్స్‌. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్‌ హాసన్‌ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్‌ బాయ్స్‌ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్‌. టోటల్‌ రన్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

ది గోట్‌ లైఫ్‌ (ఆడుజీవితం)
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రాణం పెట్టి నటించిన సినిమా.  విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్‌ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్‌ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్‌ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.

ఆవేశం 
ఫహద్‌ ఫాజిల్‌ వన్‌ మేన్‌ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్‌ గ్యాంగ్‌స్టర్‌ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో రీల్స్‌ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్‌ అయ్యింది.

ఏఆర్‌ఎం(అజయంతే రంధం మోషణం)
మిన్నల్‌ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్‌ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్‌ ఈ యాక్షన్‌ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్‌ రన్‌లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.

ప్రేమలు
మలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా గిరిష్‌ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రాలు బోనస్‌..
మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్‌ దాస్‌ డైరెక్షన్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌-బసిల్‌ జోసెఫ్‌-నిఖిలా విమల్‌ నటించిన గురువాయూర్‌ అంబలనాదయిల్‌, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్‌ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్‌ శ్రీనివాసన్‌ డైరెక్షన్‌లో ప్రణవ్‌ మోహన్‌లాల్‌ లీడ్‌ో నటించిన ‘‘వర్షన్‌గలక్కు శేషం’’, దింజిత్‌ అయ్యతాన్‌ డైరెక్ట్‌ చేసిన లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement