ప్రభాస్‌ టార్గెట్‌ రూ. 5వేల కోట్లు.. పెళ్లి రూమర్స్‌పై ఏమన్నారు? | Prabhas Birthday Special Story | Sakshi
Sakshi News home page

Prabhas Birthday: బాహుబలికి ఇష్టమైన దేవాలయం.. ప్రభాస్‌ నటుడు కాకపోయుంటే..?

Published Mon, Oct 23 2023 7:55 AM | Last Updated on Mon, Oct 23 2023 11:12 AM

Prabhas Birthday Special Story - Sakshi

'ఈశ్వర్‌'లా వెండితెరపై అడుగుపెట్టి 'ఛత్రపతి'లా 'చక్రం' తిప్పాడు. 'పౌర్ణమి' వెలుగులో 'యోగి'లా నిలిచాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూ అభిమానుల చేత 'డార్లింగ్‌' అని పిలిపించుకున్నాడు. అతని సినిమా రిలీజ్‌ తేదీ ఖరారు అయితే ఎంతటి హీరో అయినా 'సాహో' అంటూ తగ్గాల్సిందే.. అలా  బాక్సాఫీస్‌ వద్దకు 'ఏక్‌ నిరంజన్‌'లా వచ్చి కలెక్షన్స్‌ రికార్డుల్లో 'బాహుబలి'గా మిగిలాడు.

'రాధేశ్యామ్‌' అంటూ ప్రేమను పంచడమే కాదు.. అవసరం అయితే 'రెబెల్‌'గా కూడా దుమ్ములేపుతాడు. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' లాంటి కుర్రోడు 'సలార్‌'గా మారితే ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోమవారం (అక్టోబర్‌ 23) ప్రభాస్‌ 44వ పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం...

ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్‌,డైనోసార్‌ అంటూ పిలుస్తూ ఉంటారు.  పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించిన ప్రభాస్‌.. భీమవరంలోని డీఎన్‌ఆర్‌ పాఠశాలలో చదువుకున్నారు. హైదరాబాద్‌ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసి ఆపై ఇంజినీరింగ్‌ చేశారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు.

కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' సినిమా ప్రభాస్‌ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు.

ఈ సినిమాల ద్వారా ప్రభాస్‌కు నటుడిగా పేరు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్- శ్రియా కాంబోలో 'ఛత్రపతి' వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఎక్కడలేని ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసింది. దీంతో తెలుగు పరిశ్రమలో టాప్‌ హీరోల లిస్ట్‌లో ప్రభాస్‌ చేరిపోయాడు.

ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్‌లో అనుష్క, రానా దగ్గుబాటిలతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పాన్‌ ఇండియా రేంజ్‌లో 2015 జూలై 10న భారీ అంచనాలతో  విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది.

రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. అక్కడి నుంచి ప్రభాస్‌ మార్కెట్‌ ఇండియా బార్డర్‌ దాటేసింది.

ప్రభాస్‌ మీద రూ. 5 వేల కోట్ల భారం
సలార్‌, కల్కి, మారుతి కాంబినేషన్‌లో ఒక సినిమాతో పాటు  పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో మరోక సినిమా ఇలా డార్లింగ్‌ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలకు అయ్యే ఖర్చు సుమారు రూ.2 వేల కోట్లు అని అంచనా ఉంది. రిటర్న్‌ అంచనా రూ. 5 వేల కోట్లకు పై మాటే.. ఈ లెక్కలు తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా.. అయినా ఇదే నిజం. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్‌ ఆరోగ్యం కొంచెం క్షీణించింది. ఇప్పుడిప్పుడే ఆయన సరైన రూట్‌లోకి వస్తున్నాడు. ఇక ప్రభాస్ ఏమేరకు కష్టపడతాడో చూడాలి..! కానీ ఇండియన్ సినిమా తన మీద పెట్టుకున్న నమ్మకం ఓ విశేషమే.

అనుష్క- ప్రభాస్‌పై రూమర్స్‌.. నిజమెంత
అనుష్క- ప్రభాస్… ఈ జంట పేరు గత కొన్నేళ్లుగా వార్తల్లో ఉంది… నిజంగానే ఇద్దరి జంట చూడటానికి బాగుంటుంది. అందుకే ఆయన ఫ్యాన్స్‌కు అనుష్క అంటే ఎనలేని గౌరవం. 2009లో బిల్లా సినిమా షూటింగ్ దగ్గర వీరిద్దరి ప్రేమాయణం మొదలైందని చాలామంది చెప్పేవారు. సోషల్‌మీడియాలో కొన్ని వెబ్‌సైట్లు అయితే చాలారోజులపాటు డేటింగులో కూడా ఉన్నారని పేర్కొన్నాయి. అలా మన సైట్లు, చానెళ్లు బోలెడుసార్లు వాళ్లకు పెళ్లి చేశాయి. టీవీ తెర మీద సుధీర్- రష్మి.. వెండితెరకు  సంబంధించి ప్రభాస్- అనుష్క… మంచి రొమాంటిక్ జంటలు అని టాక్‌. ఇవన్నీ రూమర్స్‌గా మిగిలాయి.

పెళ్లి రూమర్స్‌పై ప్రభాస్‌ రియాక్షన్‌
‘బాహుబలి’ తర్వాత దాదాపు వందల పెళ్లి ప్రపోజల్స్‌ ప్రభాస్‌కు వచ్చాయట. దీంతో ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబుతున్నాడు అంటూ వార్తలు కూడా ప్రచారమయ్యాయి. దీనిపై ప్రభాస్‌ గతంలో ఇలా స్పందించాడు. 'విజయాల్లో ఉన్నప్పుడు మంచో చెడో.. ఏదో రకమైన వదంతులు వస్తూనే ఉంటాయి. ‘బాహుబలి’ జరుగుతున్నన్నాళ్లూ నాపై కూడా వచ్చాయి. కొన్ని మాటల్లో చెప్పలేనివీ ఉన్నాయి. నా పెళ్లి గురించి కూడా ఆన్‌లైన్‌లో వదంతులు సృష్టించారు. పెళ్లి కూతురంటూ ఒక మోడల్‌ ఫొటోలు పోస్ట్‌ చేశారు. అలాంటివి ఆగడం కోసమైనా పెళ్లి చేసుకోవాలిక (నవ్వుతూ)’ అని అన్నారు. ఇలా పరోక్షంగా అనుష్కతో ఎలాంటి రిలేషన్‌ లేదని ఆయన చెప్పకనే చెప్పాడు.

ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం

► ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్‌ గుర్తింపు పొందారు.
► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం
► ప్రభాస్‌ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్‌ దేవగణ్‌, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్‌ జాక్సన్‌'లో అతిథిగా కనిపించారు.
► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.
► స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్‌ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.
 

 బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.
 మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్‌
► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.
► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
► ప్రభాస్‌ నటుడు కాకపోయుంటే..? హోటల్‌ రంగంలో స్థిరపడేవారు.
► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం
► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం'.
► నటులు: షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాబర్ట్‌ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిషలకు ప్రభాస్‌ అభిమాని.

- బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement