1980 మే 1.. ఆరోజు జనాలు మహాలక్ష్మి మీనన్ అలియాస్ శోభ మరణవార్తతో నిద్రలేచారు. నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఆమె పట్టుమని 18 ఏళ్లకే తనువు చాలించడం అందరినీ కలిచివేసింది. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గదిలో శవమై తేలింది. విషాదంగా ముగిసిన తన జీవిత గాథపై నేటి ప్రత్యేక కథనం..
తల్లి అడుగుజాడల్లో
1962 సెప్టెంబర్ 23న నటి ప్రేమ కడుపున మహాలక్ష్మి పుట్టింది. నాలుగేళ్లకే కెమెరా ముందు నటించి అందరినీ తన బుట్టలో వేసుకుంది. ఈ చిన్నారి నటకౌశల్యాన్ని చూసి మంత్రముగ్ధులైన జనాలు ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నారు. తమిళ థ్రిల్లర్ 'తట్టుంగల్ తిరక్కప్పడమ్' సినిమాతో వెండితెరపై బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఇందులో ఆమె బేబీ మహాలక్ష్మిగా నటించింది. ఈ మూవీలో సావిత్రి, విజయ వంటి మహామహులు నటించారు. ఆ తర్వాత ఏడాది మలయాళంలో 'ఉద్యోగస్త' చిత్రంలో బేబీ శోభగా యాక్ట్ చేసింది. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతోపాటు శోభకు ఊహించని స్థాయిలో పేరు తీసుకువచ్చింది.
హీరోయిన్‌గా అవార్డులు, తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమ
15 ఏళ్లకే 'ఉత్రద రాత్రి' చిత్రంతో హీరోయిన్‌గా మారింది. 1978లో 'బంధనం', 'ఏంటె నీలాకాశం' సినిమాలకుగానూ ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంది. 'అపరిచిత' అనే కన్నడ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు సైతం వరించింది. ఈ క్రమంలో ఆమె తండ్రి వయసున్న వ్యక్తి దర్శకుడు బాలూ మహేంద్రతో ప్రేమలో పడింది. అతడికి పెళ్లై పిల్లలున్నా అతడినే కావాలనుకుంది. తన కోసం వారిందరినీ వదిలేస్తాడనుకుంది. కన్నవాళ్లను సైతం కాదని 1978లో గుడిలో దర్శకుడిని పెళ్లాడింది.
మొదటి భార్యను వదిలేయని భర్త
అతడిని గుడ్డిగా ప్రేమించిన శోభకు ఊహించని షాక్ తగిలింది. అతడు భార్యాపిల్లలను వదిలేయలేనన్నాడు. తరచూ వారి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇది శోభకు నచ్చలేదు. ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సెట్‌లో మాత్రం అన్నీ కడుపులోనే దాచుకుని నిష్కల్మషంగా నవ్వుతూ కనిపించేది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేసింది. 1979లో వచ్చిన పసి మూవీకి ఉత్తమ నటిగా రాష్ట్ర, జాతీయ అవార్డులు అందుకుంది. తెలుగులో తరం మారింది, మనవూరి పాండవులు చిత్రాల్లోనూ నటించింది.
ఒకరోజు ఆలస్యంగా సూసైడ్ లెటర్
రానున్న రోజుల్లో ఇండస్ట్రీని ఏలడం ఖాయం అనుకుంటున్న సమయంలో 1980 మే 1న ఆమె తన గదిలో మంచం పక్కన మృతదేహమై కనిపించింది. తన మెడమీద ఉరి వేసుకున్న గుర్తులు కనిపించాయి. సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటే కళ్లు వాపు వచ్చి, నాలుక బయటకు వస్తుంది. కానీ శోభ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు సూసైడ్ లెటర్ కూడా ఒక రోజు ఆలస్యంగా దొరికింది. తను నిజంగానే ఉరి వేసుకుంటే కిందరు ఎవరు దించారన్నది ప్రశ్న! శోభ చనిపోయిన ముందు రోజు రాత్రి మహేంద్ర తన మొదటి భార్య దగ్గరే ఉన్నాడు.. అంటే వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయా? అసలు శోభది హత్యా? ఆత్మహత్యా? ఇవన్నీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
43 ఏళ్లవుతున్నా ఇప్పటికీ మిస్టరీనే
శవపరీక్షలో ఆమె ఉరి వేసుకుందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమె తల్లి మాత్రం ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ హత్యేనని.. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు. శోభ భర్త బాలూ మహేంద్ర డబ్బుల కోసం వేధించాడని, ఆయనే హత్య చేశాడని సైతం ఆరోపించారు. ఇది జరిగి 43 ఏళ్లవుతున్నా ఇప్పటికీ నిజానిజాలు బయటకు నిర్ధారణ కాలేదు. తన మరణం మాత్రం మిస్టరీగానే చరిత్రలో ఉండిపోయింది. ఈమె జీవిత కథ ఆధారంగా మలయాళంలో లేఖయుడె మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్(1983) సినిమా కూడా వచ్చింది.
చదవండి: జైలర్ కలెక్షన్స్.. భోళాశంకర్‌ను డామినేట్ చేస్తున్న రజనీ సినిమా
Comments
Please login to add a commentAdd a comment