మహిళల దినోత్సవం నాడు కనిపించే ఆర్భాటాలు, ప్రసంగోపన్యాసాల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పురుషుల విషయంలో అలాంటివేం ఎందుకు కనిపించవు. ఎందుకంటే.. వాళ్ల త్యాగాలను, సాధిస్తున్న విజయాలను గప్‌చుప్‌గా స్మరించుకోవడం కోసమే ఒకరోజు ఉంది కాబట్టి. ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే(అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..). అలాగని ఆమె కష్టానికి ప్రతీకగా మార్చి 8వ తేదీన జరిపే ఇంటర్నేషనల్ ఉమెన్స్‌డేకి పోటీగా మెన్స్‌డేను తెరపైకి తేలేదు. ‘మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటి?’.. అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇది.
ఇంటర్నేషనల్ మెన్స్‌డే.. ఇవాళ ‘‘మగవాళ్లే గొప్ప.. వాళ్ల వల్లే ఈ సమాజం నడుస్తోంది అనే ప్రచారాలు ఎక్కడా వినపడదు. కేవలం మగవాళ్ల ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. అన్నింటికీ మించి ‘ఈ సమాజంలో మగాళ్లంతా దుర్మార్గులు..’ అని కొందరిలో పేరుకుపోయిన భావనను తుడిచిపెట్టే ఓ చిరు ప్రయత్నం ఇది. మెన్స్‌డే.. ఇవాళ మగవాళ్ల కోసం కొన్ని లక్ష్యాలంటూ నిర్దేశించుకుంటారు. సామాజిక ఆర్థిక పరిస్థితులను సమీక్షిస్తారు. లక్ష్య సాధన కోసం ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటారు. సొసైటీలో ఉన్న పాజిటివ్ రోల్ మోడల్స్‌ని ప్రచారం చేయడం, వాళ్ల సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుకున్న మరో ప్రత్యేకత కూడా. మరి మెన్స్ డేకి గుర్తింపు ఎలా దక్కింది?..
‘‘మగాళ్లు కూడా మనుషులే. అలాంటప్పుడు వాళ్లకు ఒక గౌరవప్రదమైన రోజు అవసరం. కానీ, ఈ ఆధునిక యుగంలో అది ఇంకా అట్టడుగునే ఉండిపోవడం బాధాకరం’’:: ప్రొఫెసర్ థామస్
► ప్రపంచ దేశాల ఐక్య వేదిక ఐక్యరాజ్య సమితి ఆమోద్ర ముద్ర ఉంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లోని ఎన్జీవోలు, మరికొన్ని దేశాల్లో ఏకంగా ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డేను నిర్వహిస్తున్నాయి.
► మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉండటం మూలానా ‘మనుషులంతా సమానమే’ అనే సిద్ధాంతాన్ని దెబ్బ తీసింది. దీంతో మగవాళ్లకూ ఒక రోజు నిర్వహించడం ద్వారా సమతుల్యత తేవాలని భావించారు కొందరు మేధావులు.
► అమెరికా కన్సాస్‌లోని మిస్సోరి యూనివర్శిటీ ప్రొఫెసర్ థామస్, సమాజానికి మగవాళ్లు చేస్తున్న సేవల్ని అభినందించేందుకు ఒక రోజు అవసరం అని భావించారు. చివరికి ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా 1992, ఫిబ్రవరి 7న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరిగింది. దక్షిణ యూరప్‌కి చెందిన మాల్టా దీవి మాత్రం ఈ ఉత్సవాల్ని 1994 నుంచి ప్రతీ ఏటా నిర్వహిస్తూ వచ్చింది.
తిలక్‌సింగ్ వల్లే..
నవంబర్ 19కి మెన్స్ డే ఎలా మారింది అనే అనుమానం తలెత్తవచ్చు. ఇందుకు కారణం.. కరేబియన్ ద్వీప దేశం ట్రినిడాడ్–టొబాగోకు చెందిన డాక్టర్ జెరోమో తిలక్‌సింగ్. అక్రమంగా జైలు పాలైన మగవాళ్ల కోసం ఆయన అక్కడ ఉద్యమించాడు.
► మగవాళ్ల సమస్యలతోపాటు హక్కుల గురించి కూడా అవగాహన ర్యాలీలు నిర్వహించాడు. తిలక్‌సింగ్ తండ్రి పుట్టినరోజు నవంబర్ 19. అదేరోజు ట్రినిడాడ్ టొబాగో టీమ్ వరల్డ్ కప్ సాకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని నవంబర్ 19ని మగవాళ్ల రోజుగా నిర్వహించారు.
► 1999లో ఐక్య రాజ్య సమితి అదే రోజున ‘మెన్స్ డే’ నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది. దాదాపు 80కి పైగా దేశాలు ఇప్పుడు మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మన దేశం కూడా ఉంది. కానీ, మన దేశంలో ఈ దినోత్సవానికి ప్రచారం మొదలుపెట్టింది ఒక మహిళ కావడం గమనార్హం.
► ఉద్యమవేత్త, పురుషుల తరపు వాదించే న్యాయవాది ఉమా చల్లా.. మన దేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించే యత్నం మొదలుపెట్టారు. 2007 నుంచి ఆమె ఈ ప్రయత్నంలో ఉన్నారు.
► మహిళా పక్షపాత ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో మగవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపులు, హింసను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఆమె. పురుష వ్యతిరేక న్యాయ వ్యవస్థ అనే చట్రంలో చిక్కుకున్న మగవాళ్లకు.. న్యాయం చేసే అనితర బాధ్యతను మోస్తున్నారు ఆమె.
Happy Men's Day to all the men out there!❤️#SunPictures pic.twitter.com/kY0vOqeqAA
— Sun Pictures (@sunpictures) November 19, 2022
ఆడామగా.. తల్లీతండ్రి, అన్నాచెల్లి, అక్కాతమ్ముడు, భార్యాభర్త.. ఇలా ఏ పాత్రలో ఉన్నా వారివారి జీవితాల్లో ప్రధాన పాత్రే పోషిస్తుంటారు. ఉమెన్స్‌డేలో లేనిది.. మెన్స్‌డేలో ప్రముఖంగా ఉన్నది లింగ బేధాల్లేకుండా సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే థీమ్. మెన్స్ డే అంటే.. కొందరి విషయంలో ఎందుకనో ఓ చిన్నవిషయం. కొందరు జెంటిల్మెన్సే దీన్నొక జోక్‌గా ఫీలవుతుంటారు. మహిళలు తమ రోజుని ఎంత ప్రత్యేకంగా నిర్వహించుకుంటారో.. సమస్యల గురించి ఎంత బాగా చర్చించుకుంటారో.. అలాగే మగవాళ్లు కూడా అదే స్థాయిలో చర్చించకపోవడమే.. మెన్స్‌డేకు ఉన్న ప్రధాన లోపం!!
2001 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఒక్కో ఏడాదికి.. ఒక్కో నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్.. థీమ్‌ను ఈ ఏడాదికి ప్రకటించారు. సంఘాలకు, కుటుంబాలకు, యావత్ ప్రపంచానికి.. మగవాళ్లు అందిస్తున్న సానుకూల సహకారానికి వేడుక చేయడం, మగవాళ్ల శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ ఏడాది థీమ్ లక్ష్యం.
::: ఆరాధ్య
Comments
Please login to add a commentAdd a comment