Yellow Media Losing Credibility Over Fake Propaganda On CM YS Jagan Govt - Sakshi
Sakshi News home page

అన్నీ ఏడుపుగొట్టు వార్తలే.. పచ్చమీడియా ఆ విశ్లేషణ చేయదు.. ఎందుకంటే?

Published Mon, Nov 7 2022 6:29 PM | Last Updated on Mon, Nov 7 2022 7:41 PM

Yellow Media Losing Credibility Fake Propaganda YS Jagan Government - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుబడుతున్న పచ్చమీడియా.. ఆచరణలో అంత కంటే ఘోరంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో వారు అనుసరిస్తోన్న తీరును ప్రజలు తరచుగా గమనించినా.. పచ్చమీడియా ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన మానిఫెస్టోపై ఈ మీడియా ఎన్నడూ విశ్లేషణ చేయదు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేదా? అన్న జోలికి వెళ్లదు. ఎందుకంటే వాటి గురించి ప్రస్తావిస్తే వైఎస్‌ జగన్ హామీలు అమలు చేశారని చెప్పవలసి వస్తుంది కనుక. 

అంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 400 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినా, చంద్రబాబు ప్రభుత్వం అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవి. లక్షకోట్ల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే ఈ మీడియా అదెలా సాధ్యమైని ఏనాడు ప్రశ్నించలేదు. పైగా చంద్రబాబు అనుభవజ్ఞుడు కనుక రుణమాఫీ చేస్తారని ప్రచారం చేశాయి. 

బాబు ఓడగానే అసలు రూపం
ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే సంస్థలే అయినా గతంలో మరీ ఇంత నీచంగా ఉండేవికావు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ సంస్థలు ఓర్చుకోలేకపోతున్నాయి. ఆ మీడియా యాజమాన్యాలు చంద్రబాబు ఓడిపోతే తామే ఓడిపోయినట్లు భావించడం ఆరంభించాయి. అంతే.. ఇక జగన్‌పై ఉన్నవి, లేనివి రాయడం ఆరంభించారు. ఆ క్రమంలో  ఉచ్ఛనీచాలు వదలివేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవి బట్టలు ఊడదీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడడం లేదేమో అనిపిస్తుంది. ఈనాడు మీడియాకు కాని, మిగిలిన టిడిపి మద్దతుదారులైన మీడియా వారికి గాని, ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా కనిపించలేదు. వీళ్లు కళ్లున్న కబోదుల్లా మారిపోయారు. 
(చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?)

అన్నీ ఏడుపుగొట్టు వార్తలే
ఉదాహరణకు ఈనాడు మీడియా గత కొద్దిరోజులుగా రాస్తున్న ఏడుపుగొట్టు వార్తలను పరిశీలించండి. ఎవరికైనా విషయం ఇట్టే బోధపడుతుంది. ఏపిలో విద్యా వ్యవస్థ మెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అంతా భావిస్తారు. యుపి తదితర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి ప్రభుత్వ స్కూళ్లను చూసి వెళ్లాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు స్కూళ్లను  నాడు-నేడు కింద తీర్చిదిద్దుతున్నారు. 

వాటిని మెచ్చుకోకపోతే మాని, ఈనాడు ఏమని రాసిందో చూడండి. పిల్లలపై పిడుగు అన్న శీర్షికతో తరగతి బోధన, అభ్యసన గాలికి వదలివేశారంటూ ప్రచారం చేశారు. ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయని రాస్తున్నారు. ఇలాంటి వార్తనే ఒక ఇరవై రోజుల కిందట ఈ పత్రిక రాసింది. దానిపై అధికారులు వివరణ ఇచ్చారు. గతంలో కన్నా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగిన వైనాన్ని తెలిపారు. అయినా ఈ పత్రిక మళ్లీ పిల్లలపై పిడుగు అంటూ ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. 

ఎల్లో ఎజెండాలో నెగెటివ్ వార్తలే 
స్కూళ్లలో కనీస సంఖ్యలో విద్యార్ధులు లేకపోతే వాటిని వేరే స్కూల్ లో కలిపితే, అమ్మో ఇంకేముంది పిల్లలకు అన్యాయం జరిగిపోయిందని రాస్తున్నారు. ప్రభుత్వం ఈ చర్య తీసుకోకపోతే, పిల్లలు లేకపోయినా, టీచర్లకు జీతాలు ఇస్తున్నారని అప్పుడు రాస్తారు. ఈ పత్రిక ఎన్నడైనా స్కూళ్ల ఆధునీకరణపై ఒక్క పాజిటివ్ వార్త అయినా ఇచ్చిందా? ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను రెచ్చగొట్టేలా మాత్రం స్టోరీలు ఇస్తుంటారు. అందుకే విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  ఈ పత్రికలు  విద్యారంగంపై విషం కక్కుతున్నాయని విమర్శించారు. 

కళ్లు తెరిచి చూడండయ్యా, జరుగుతున్న మంచిని!
చిత్తశుద్దితో విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులలోని మంచిని, ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని చెప్పడం తప్పుకాదు. కాని నిత్యం విషపూరిత కథనాలు ఇవ్వడంతో ఈనాడు, ఇతర టిడిపి మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉత్తరాంద్రపై ప్రేమ ఉంటే భూముల తాకట్టా అంటూ మరో ఏడుపు వార్త ఇచ్చారు. భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పు తీసుకోవడాన్ని వీరు తప్పు పట్టారు. 

మరి గత ప్రభుత్వం  అమరావతి భూములను తాకట్టుపెట్టినప్పుడు, అధిక వడ్డీకి బాండ్లను జారీ చేసినప్పుడు ఎందుకు ఇలాంటి స్టోరీలు ఇవ్వలేదు? అప్పుడు చంద్రబాబు మొహం చూసి అప్పులు ఇచ్చారని ప్రచారం చేశారే. పోనీ భూముల తాకట్టుపెట్టకుండా రుణాలు వచ్చే అవకాశం ఉంటే దాని గురించి రాయవచ్చు. అలాకాకుండా విశాఖ కార్యనిర్వహాక రాజధాని అయితే ఉత్తరాంద్ర అంతటా జగన్ కు మంచి పేరు వస్తుందన్న కారణంగా ఈనాడు కుళ్లుబుద్దితో ఇలాంటి వార్త ఇచ్చింది. విశాఖ రాజధాని కాకుండా చేయాలని తన వంతు విషాన్ని ఈ మీడియా చిమ్ముతోంది. 
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement