గుజరాత్‌ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు? | Play-Off-Qualification Scenario 7-Teams-In-Race-3 Places After GT Enters | Sakshi
Sakshi News home page

#PlayOffs: గుజరాత్‌ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?

Published Tue, May 16 2023 5:22 PM | Last Updated on Tue, May 16 2023 5:47 PM

Play-Off-Qualification Scenario 7-Teams-In-Race-3 Places After GT Enters - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్ 2023 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. గతేడాది ఛాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌  సోమవారం ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయంతో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌లు అధికారికంగా ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో చివరి 8 లీగ్‌ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఛాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్


Photo: IPL Twitter

మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడి 7 గెలిచింది. ఐదు ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. 15 పాయింట్లు, 0.381 నెట్ రన్‌రేట్ తో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. డీసీతో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. అయితే టాప్ 2లో ఉంటుందా అన్నది మాత్రం మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.

ఇక చివరి మ్యాచ్ ఓడిపోతే సీఎస్కే ఇంటిదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. మరో ఐదు జట్లు 15 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే వీలు ఉండటమే దీనికి కారణం. అయినా అన్ని మ్యాచ్ ల ఫలితాలు సీఎస్కేకు అనుకూలంగా వస్తే.. ఆ టీమ్ చివరి మ్యాచ్ లో ఓడినా క్వాలిఫై అవుతుంది.

ముంబై ఇండియన్స్


Photo: IPL Twitter

12 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు గెలిచి, ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లు, -0.117 నెట్ రన్ రేట్‌తో ఆ టీమ్ మూడోస్థానంలో ఉంది. లక్నో, హైదరాబాద్ లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే టాప్ 2లో ముంబై క్వాలిఫై అవుతుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే 16 పాయింట్లతో మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడితే కష్టమే. అప్పటికీ అవకాశం ఉన్నా.. నాలుగోస్థానం కోసం మరో మూడు టీమ్స్ తో పోటీ ఉంటుంది.

లక్నో సూపర్ జెయింట్స్


Photo: IPL Twitter

లక్నో సూపర్ జెయింట్స్ 12 ఆడి 6 గెలిచి, ఐదు ఓడిపోయింది. ఒకటి ఫలితం తేలలేదు. 13 పాయింట్లు, 0.309 నెట్ రన్‌రేట్ తో నాలుగోస్థానంలో ఉంది. ముంబై, కేకేఆర్‌తో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే నెట్ రన్‌రేట్ తో సంబంధం లేకుండా మిగతా ఫలితాలు లక్నోకు అనుకూలంగా వస్తే అర్హత సాధిస్తుంది. రెండూ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు


Photo: IPL Twitter

ఆర్సీబీ 12 ఆడి, ఆరు గెలిచి, మరో ఆరు ఓడింది. 12 పాయింట్లు, 0.166 నెట్ ‌రన్‌రేట్ తో ఐదో స్థానంలో ఉంది. సన్ రైజర్స్, జీటీతో మ్యాచ్ లు ఉన్నాయి. ఆర్ఆర్ పై భారీ విజయం ఆర్సీబీ అవకాశాలను మెరుగుపరిచింది. నెట్ రన్‌రేట్ పాజిటివ్ గా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లతో ఆ టీమ్ అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. ఒకటి గెలిచి మరొకటి ఓడితే మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిందే.

రాజస్థాన్ రాయల్స్


Photo: IPL Twitter

గతేడాది రన్నరప్స్ రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లు, 0.140 నెట్ రన్‌రేట్ తో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఆర్సీబీ చేతుల్లో దారుణమైన ఓటమి ఆర్ఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. చివరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిందే. అప్పటికీ మిగతా మ్యాచ్ ల ఫలితాలను బట్టే ఆర్ఆర్ క్వాలిఫై అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆర్సీబీ, లక్నో తమ చివరి రెండు మ్యాచ్ లు ఓడటంతోపాటు సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్ లో ముంబై చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితేనే ఆర్ఆర్ చివరి మ్యాచ్ గెలిస్తే అర్హత సాధిస్తుంది. ఇక ఓడితే మాత్రం ఇంటికే.

పంజాబ్ కింగ్స్


Photo: IPL Twitter

పంజాబ్ కింగ్స్ 12 ఆడి ఆరు గెలిచి, ఆరు ఓడింది. 12 పాయింట్లు, -0.288 నెట రన్‌రేట్ తో ఏడో స్థానంలో ఉంది. డీసీ, ఆర్ఆర్ లతో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే నెట్ రన్‌రేట్ నెగటివ్ గా ఉండటంతో భారీ విజయాలు సాధించడంతోపాటు ఇతర జట్ల నుంచి కూడా సాయం అందాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి ఓడినా నాలుగోస్థానం కోసం మరో నాలుగు టీమ్స్ తో పోటీ పడాల్సి వస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్ లనూ పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో ఆడనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్


Photo: IPL Twitter

కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి, ఏడు ఓడింది. 12 పాయింట్లు, -0.256 నెట్ రన్‌రేట్ తో 8వ స్థానంలో ఉంది. లక్నోతో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే టాప్ 4లో ముగించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. లక్నో మిగిలిన రెండు మ్యాచ్ లు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కనీసం ఒక్కో మ్యాచ్ లో ఓడాల్సి ఉంటుంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా నెగటివ్ గా ఉండటంతో ఆ టీమ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువే అని చెప్పాలి.

చదవండి: మార్క్రమ్‌ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement