కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు..
సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.
సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి.
నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.
పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.
తేడాలు ఇవే..
ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..
ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.
ముందస్తు సూచనలు
కొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి.
ఇలా చేస్తే..
ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి.
Comments
Please login to add a commentAdd a comment