ఇండియన్ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై సగర్వంగా మెరిసింది. అదీ ఒక తెలుగు సినిమా ద్వారా కావడం గమనార్హం. ఏ సినిమా దక్కించుకోని ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గౌరవాన్ని దక్కించుకుందీ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్. నాటు నాటు సాంగ్‌కి గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు. అయితే రాజమౌళి పాన్ ఇండియా రేంజ్‌లో ట్రిపుల్ ఆర్ మీద విపరీతమైన బజ్ నెలకొన్న టైంలోనూ.. నాటు నాటు రిలీజ్ అయ్యి నెగెటివిటీ చుట్టూరానే తిరిగింది. మరి అది దాటుకుని గ్లోబల్ స్థాయి అవార్డును ఎలా దక్కించుకుందో ఓసారి విశ్లేషిస్తే..
పొలం గట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రి సెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరప తొక్కు కలిపినట్టు..
నా పాట సూడు నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి నాటు
ఏం పాట ఇది? నిజంగానే బాహుబలి లాంటి మహత్తర ప్రాజెక్టు తీసిన రాజమౌళి సినిమాలో ఉండాల్సిన రేంజ్ పాటనా ఇది?.. చంద్రబోస్ రాసి రాసి ఎలా రాయాలో మరిచిపోయి ఉంటాడు!. నాటు నాటు అంటూ అర్థం పర్థం లేకుండా రాసేస్తాడా?.. కీరవాణి ఎలాంటి బీట్ కొట్టాడు.. అసలు ఏమాత్రం శ్రద్ధ లేకుండా. నాటు సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఓ ఇండిపెండెంట్ తెలుగు సీనియర్ జర్నలిస్ట్ తనదైన శైలిలో గుప్పించిన విమర్శలివి. ఈయనొక్కడే కాదు.. చాలా వరకు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్, చివరాఖరికి మీమ్స్ పేజీలు కూడా కూడా నెగెటివ్ రివ్యూలు ఇచ్చాయి ఈ పాటకు. కానీ,
టాలీవుడ్‌లో ఇద్దరు యంగ్ స్టార్‌లు. పైగా టాప్ డ్యాన్సర్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు. ఆ ఇద్దరూ కలిసి గంతులేసే పాట ఎలా ఉండాలి?. ఆడియొన్స్ పూనకాలతో ఊగిపోవాలి.. థియేటర్లు దద్దరిల్లిపోవాలి కదా. అందుకే ఆ మూడ్‌కు తగ్గట్లు పాటను రాయమని రాజమౌళి.. రచయిత చంద్రబోస్‌ను పురమాయించారు. సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి లిరిక్స్ రాసిన చంద్రబోస్.. దానికి అంతే సమయం తీసుకుని 30కిపైగా స్వరాలు సమకూర్చారు కీరవాణి. చివరకు ఒక్క ట్యూన్ ఒకే కావడం, యువ సింగర్లు సిప్లీగంజ్-కాలభైరవలు గాత్రం అందించడం.. విమర్శలను తొక్కిపారేసి ఆ పాట సూపర్ హిట్ కావడం చకచకా జరిగిపోయాయి. కేవలం ఒకేఒక్క పాట విషయంలోనే రాజమౌళి కనబరిచిన శ్రద్ధ ఇది. అది ఫలించి ఇప్పుడు అవార్డు వరించేలా చేసింది.
పాట విజయంలో విజువలైజేషన్స్ ప్రధాన భూమిక పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటు నాటు సాంగ్‌కు దక్కిన అవార్డు.. ట్రిపుల్ ఆర్‌కు దక్కిన భారీ విజయమనే చెప్పొచ్చు. అయితే.. ఈ పాట రిలీజ్ అయినప్పుడు పెదవి విరిచిన వాళ్లూ ఎక్కువే. సాంగ్ ప్రొమో రిలీజ్ అయినప్పుడు కేవలం స్టార్‌ల అప్పీయరెన్స్ తప్పించి పాట అంతగా ఏం లేదని తేల్చేసిన విశ్లేషకులు కొందరు ఉన్నారు. కానీ, ఆ నెగెటివిటీని తొక్కి పాడేసి గ్లోబల్ గుర్తింపు దక్కించుకుంది నాటు సాంగ్. మన నాటు సాంగ్‌కు దేశ విదేశాల నుంచి కూడా గుర్తింపు దక్కింది.
షార్ట్ వీడియోల ద్వారా ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. సెలబ్రిటీల దగ్గరి నుంచి టీవీ షోలు, ఈవెంట్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ పాట సందడే కనిపించింది. మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నాటు స్టెప్పులకు ఫిదా అయ్యారు జనాలు. షార్ట్ వీడియోస్‌తో అనుకరణకు యత్నించారు. అలా పాటకు దక్కిన పాపులారిటీ మరింతగా విస్తరించింది.
2021, నవంబర్ 10వ తేదీన నాటు నాటు సాంగ్ రిలీజ్(లిరిక్ వెర్షన్) అయ్యింది. సోకాల్డ్ విశ్లేషకుల సంగతి పక్కన పెడితే.. నాటు నాటు సాంగ్ లిజనర్స్‌కు తెగ ఎక్కేసింది. నాటు లిరిక్స్.. నాటు మ్యూజిక్.. దానికి తోడు చెర్రీ-తారక్‌ల సింక్రనైజ్డ్ నాటు స్టెప్పుల బిట్టు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా.. సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరు హీరోలేసిన ఆ స్టెప్పు కీలక పాత్ర పోషించింది కూడా. 25 మార్చి 2022న సినిమా రిలీజ్ అయ్యాక.. ప్రేక్షకులు, అభిమానుల కోలాహలంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చివరకు ఆ పాట సక్సెస్.. సక్సెస్ మీట్‌లోనూ రాజమౌళి చేత ఆ స్టెప్పు వేయించింది మరి.
రికార్డులు..
తెలుగులో నాటు నాటు.. హిందీలో నాచో నాచో, తమిళ్‌లో నాట్టు కూథూ, కన్నడలో హల్లి నాటు, మలయాళంలో కరినోథల్.. ఇలా భాష ఏదైనా సరే బీట్ ఒక్కటే. ఊపు తెప్పించే స్టెప్పులొక్కటే. అందుకు సాంగ్ అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక ఫుల్ వీడియో సాంగ్.. ఏప్రిల్ 11, 2022లో రిలీజ్ అయ్యింది. నాటు నాటు సాంగ్‌కు అన్ని భాషల్లో కలిపి వ్యూస్ కుమ్మేశాయి. తెలుగులో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న పాట ఇదే. ప్రస్తుతం తెలుగులోనే 140 మిలియన్ వ్యూస్(లిరిక్స్ వెర్షన్‌కి), వీడియో వెర్షన్‌కి 111 మిలియన్ వ్యూస్ దక్కాయి. హిందీ లిరిక్స్ వెర్షన్ 87 మిలియన్ వ్యూస్, వీడియో వెర్షన్‌కి 217 మిలియన్ వ్యూస్ దక్కాయి. 4కే వ్యూస్ ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతా అన్ని భాషల్లో అన్ని వెర్షన్‌లకు కలిపి వంద మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. అలా.. ఒక తెలుగు మాస్ సాంగ్‌కు మిగతా భాషల్లోనూ విపరీతమైన ఆదరణ దక్కింది.
గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు
సేవులు సిల్లు పడేలాగా
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటీకేలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా
దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు
నాటు నాటు నాటు పచ్చి గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు ఉక్కపోత లాగా తిక్క నాటు
ఆర్‌ఆర్‌ఆర్‌లో.. నాటు నాటు సాంగ్ నేపథ్యం ఇంగ్లీషోళ్ల పార్టీలో మన డ్యాన్స్ సామర్థ్యాన్ని హేళన చేయడం నుంచి పుడుతుంది. అక్తర్(భీమ్)కు కలిగిన అవమానం భరించలేక స్నేహితుడైన రామ్.. ఈ మాస్ బీట్‌కు ఆజ్యం పోస్తాడు. అక్తర్‌తో కలిసి ఊర మాస్ స్టెప్పుల మంట రాజేస్తాడు. మన లోకల్ డ్యాన్స్ సత్తా చాటుతారిద్దరూ. పాట వచ్చే సందర్భానికి ఆడియొన్స్ కనెక్ట్ కావడం, అందులో హుషారైన స్టెప్పులు.. ఆయా భాషల్లో లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగలిగాయి.
ఉక్రెయిన్‌లో షూటింగ్
నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగింది ఎక్కడో తెలుసా? ప్రస్తుతం రష్యా ఆక్రమణతో విలవిలలాడుతున్న ఉక్రెయిన్ గడ్డపై. అవును.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అధికారిక భవనం మరియిన్‌స్కీ ప్యాలెస్ బయట.. ఆగష్టు 2021లో నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగింది. విశేషం ఏంటంటే.. ట్రిపుల్ ఆర్ సినిమాకు అదే చివరి షెడ్యూల్ కూడా. ఆ సమయంలో మెడలో ఐడీ కార్డు ధరించి ఎన్టీఆర్ జక్కన్న తో ఫొటోను షేర్ చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడి పరిణామాలపై తమకు అవగాహన లేదని, యుద్ధ సమయంలోనే అక్కడి పరిస్థితులు తెలిశాయని దర్శకధీరుడు దిగ్భ్రాంతి సైతం వ్యక్తం చేశాడు.
రెండు వారాల నరకం..
నాటు నాటు సాంగ్ చిత్రీకరణకు రెండు వారాలకు పైనే పట్టిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పాటలో ప్రేమ్ రక్షిత్ కంపోజిషన్ ప్రకారం.. కాళ్లను ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండాలి. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్ గా రావడానికి ఇద్దరం దాదాపు 15-18 టేక్స్ తీసుకున్నామని స్వయానా తారక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. స్టెప్స్ సరిగ్గా రావడం కోసం జక్కన్న నరకం చూపించాడని, మధ్య మధ్యలో డ్యాన్స్ ఆపేసి మరీ చూసేవాడని ఇద్దరూ వాపోయారు(సరదాగా) కూడా. పోనీ.. 18 టేక్స్ తీసుకున్న తర్వాత అందులో ఓకే చేసింది రెండో స్టెప్పు అని, అప్పుడే ఆపేసి ఉంటే అంత కష్టం ఉండేది కాదు కదా అని చెప్పారు కూడా. అయితే.. పర్‌ఫెక్షన్ కోసమే తాను ఆ పని చేశానంటూ రాజమౌళి వివరణ ఇచ్చుకున్నాడులేండి.
భూమి దద్దరయ్యేలా
వొంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఎసెయ్ రో ఏక ఏకి
నాటు నాటు నాటు..
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయ్ రో సరాసరి
నాటు నాటు నాటు
నాటు నాటు సాంగ్ రిలీజ్ అయిన తొలినాళ్లలో భయంకరమైన విశ్లేషణలతో ఏకిపడేసినవాళ్లలో కొందరు ఇప్పుడు ఆ పాటను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాట సక్సెస్‌ను జీర్ణించుకోలేని మరికొందరు గప్‌చుప్‌గా ఉండడమో, మరింత విశ్లేషించి విమర్శించడమో చేస్తున్నారు. కానీ, అదే పాట దేశ విదేశాలు దాటుకుని.. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకోగలిగింది. ఆ విజయం వెనుక పాట కోసం కృషి చేసిన ట్రిపుల్ ఆర్ టీం కష్టం ఉంది. ఆ కష్టానికి ఓ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment