కొందరు ఆయన్ను ప్రేమిస్తారు.. మరికొందరు ఆయన్ను ద్వేషిస్తారు.. కానీ ఆయన్ను విస్మరించడం మాత్రం ఎవరి వల్లా కాదు.. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు అభిశంసనకు గురైన మిస్టర్ ట్రంప్..రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు.
విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గతంలో ట్విట్టర్ ఆయన్ను వెలివేసింది.. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన పడిన పాట్లు అన్నీఇన్నీ కావు.. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తలదించలేదు.. వెన్నుచూపని వీరుడిలా మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి కమల హారీస్ ఉన్నా ఏ మాత్రం బెదరలేదు... వణకలేదు..! డొంక తిరుగుడు మాటలు ఏ మాత్రం తెలియని ట్రంప్.. తన ముక్కుసూటితనంతోనే ఓటర్ల మనసును గెలిచి 47వ ప్రెసిడెంట్‌గా 2025 జనవరి 20న రెండోసారి ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. పడి చోటే లేచిన ట్రంప్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండోసారి వైట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిలియనీర్ ట్రంప్
నేపథ్యం..
డోనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్‌లోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు.ట్రంప్ తండ్రి ఫ్రెడ్ విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి. న్యూయార్క్‌తో పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ట్రంప్ కుటుంబానికి చాలా అపార్ట్‌మెంట్లు, ఆస్తులు ఉన్నా...ట్రంప్ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఆయన కుటుంబానికి ఉన్న డబ్బే ట్రంప్‌కు స్కూల్‌లో శాపంగా మారింది. ట్రంప్‌ను చాలా మంది వేరుగా చూసేవారు. అందరిలో ఒకడిలా ట్రంప్‌ని ఉండనివ్వలేదు. ఇదే ఆయన్ను స్కూల్‌లో క్రమశిక్షణ తప్పేలా చేసింది. పదేపదే స్కూల్ టీచర్ల నుంచి కంప్లైంట్ వస్తుండడంతో ట్రంప్‌ను మిలటరీ స్కూల్‌కు పంపారు తల్లిదండ్రులు. అక్కడే ట్రంప్‌కు డిసిప్లెన్ అలవాటైంది. అయితే అదే స్కూల్ ఆయన్ను తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరిగేలా చేసింది. అటు తండ్రి ఫ్రెడ్ కూడా చాలా స్ట్రిక్ట్. దీంతో ట్రంప్ బాల్యం ఆంక్షలు మధ్య ఏ మాత్రం స్వేచ్ఛ లేనట్టే గడిచింది.
వ్యాపారవేత్తగా..
చదువులు పూర్తి చేసిన తర్వాత ట్రంప్ తన తండ్రి లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లారు. తండ్రిలా కాకుండా వ్యాపారంలో రిస్క్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. బోల్డ్‌గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లిన ట్రంప్ చాలాసార్లు వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నారు. 1980లలో విలాసవంతమైన భవనాలు, హోటళ్ళు, కాసినోలలో భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే 1990ల ప్రారంభంలో అమెరికాను చుట్టేసిన మాంద్యం ట్రంప్ కు నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ అప్పులు ఆయన నెత్తిమీద వచ్చి పడ్డాయి. కొన్నాళ్లపాటు దివాలా అంచు వరకు ఉన్న ట్రంప్ 2000వ సంవత్సరం తర్వాత కోలుకున్నారు. నాడు రియాలిటీ టీవీ షోలలో కనిపించి మెరిశారు. ది అప్రెంటిస్ అనే బిజినెస్ పోటీ షోతో ప్రజలకు దగ్గరయ్యారు . ఈ ప్రొగ్రామ్‌లో 'యు ఆర్ ఫైర్' అని ట్రంప్ చెప్పే డైలాగ్ నాడు అమెరికాలో మారుమోగింది. ఇలా తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ట్రంప్ మరోసారి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు.
రాజకీయాల్లోనూ..
ఇలా 2015 వరకు వివిధ వ్యాపారాల్లో బిజీగా ఉన్న ట్రంప్ అదే సంవత్సరం నుండి ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ట్రంప్ చెప్పినప్పుడు అంతా నవ్వారు. పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసినవారు కూడా ఉన్నారు. అయితే ట్రంప్ ఎవరి మాటలు పట్టించుకోలేదు.. చేయాల్సింది చేశారు.. నామినేషన్ వేయడమే కాదు.. 2016ఎన్నికల్లో గెలిచి అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ మెట్లెక్కారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారే కానీ ఎన్నో సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. వివిధ అంశాల్లో ఆయన విధానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానాలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లిం వ్యతిరేకి అంటూ దుయ్యబట్టాయి. అంతేకాదు అనేకసార్లు నల్లజాతీయులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.ఆయన హయంలోనే ప్రపంచాన్ని కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగింది.ట్రంప్ పాలనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అటు NATO మిత్రదేశాలతోనూ అమెరికా సంబంధాలు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే దెబ్బతిన్నాయి.
ఓటమి తర్వాత..
2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఆ తర్వాత మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడం, అక్కడి పరిసరాలకు నిప్పు పెట్టడం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. నాడు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ తన సపోర్టర్స్‌ను ప్రసంగాలతో రెచ్చగొట్టడం కారణంగానే వారంతా విధ్వంసానికి దిగారని నాటి సైనికాధికారులే ప్రకటించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ నుంచి ట్రంప్ అభిశసంనలకు గురవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే అందరి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆయన ట్రంప్ ఎందుకవుతారు.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అయ్యారు.
పడిలేచిన కెరటంలా..
భారీ సంపద, హోదా ఉన్నప్పటికీ ఆయన ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, కిందపడి మళ్లీ లేచి గెలిచిన నైజం ఆయనలోని పోరాటయోధుడిని కళ్లకు కడుతోంది. ఎన్నో కష్టమైన ఆర్థిక, రాజకీయ క్షణాలను ఒంటరిగానే ఎదుర్కొన్న ట్రంప్ వ్యక్తిగతంగానూ ఎన్నో బాధలు పడ్డారు. ట్రంప్‌ని ఎన్నో అంశాల్లో తిట్టేవారు ఉండొచ్చు కానీ ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేని విషయం ఒకటుంది. ఆయన మందు తాగరు.. అల్కహాల్‌కు చాలా దూరంగా ఉంటారు. 1981లో తన సోదరుడు అల్కహాల్ అలవాటు కారణంగానే అనారోగ్యంతో చనిపోయాడు. ఇది ట్రంప్‌ను ఎంతగానో కుంగదీసింది. అందుకే మద్యాన్ని పుచ్చుకోని ట్రంప్ తన తోటివారికి కూడా మందు తాగవద్దని చెబుతుంటారు. అటు ట్రంప్ వైవాహిక జీవితం కూడా ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. 1990లో మొదటి భార్య ఇవానాతో విడాకులు ట్రంప్‌ను మానసికంగా కుమిలిపోయేలా చేసింది. అటు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలా వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలవడాన్ని ఒక ఏడాది ముందు వరకు ఎవరు ఊహించి ఉండరు కూడా. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా తమతో తామే మూసివేసిన తలుపుల లోపల సొంత యుద్ధాలను ఎదుర్కొంటారని చెప్పేందుకే ట్రంప్ జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం.. మరి అగ్రరాజ్యపు అధ్యక్షునిగా మున్ముందు ప్రపంచానికి ఎటువంటి దక్షత ప్రదర్శిస్తాడో ఈ మొక్కవోని వ్యాపారి ట్రంప్. తన టెంపరితనంతో ప్రత్యర్ధులకు టెంపరేచర్ పెంచి ఎదురులేని విక్టరీ సాధించిన ట్రంప్ వచ్చే నాలుగేళ్లు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి
:::నాగ త్రినాథ్ బండారు , సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment