స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి మరో వివాదపు సెగ తగిలింది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఆఫ్రికన్ క్వీన్స్: క్వీన్ క్లియోపాత్ర’ ట్రైలర్ ద్వారానే రచ్చ రేపింది. చరిత్రలో ఉన్న బ్లాక్ క్వీన్స్‌ను హైలెట్ చేస్తూ నిర్మించిన ఈ సిరీస్‌లో క్లియోపాత్ర మీద తీసిన పోర్షన్ ట్రైలర్‌పై ఈజిప్ట్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. క్లియోపాత్రా పాత్ర కోసం ఓ బ్లాక్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం!.
క్వీన్ క్లియో పాత్రా దేహం నలుపు రంగు కాదని.. ఆమె ఛామన ఛాయ రంగులో ఉండేదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జాహి హవాస్ నెట్‌ఫ్లిక్స్ క్వీన్ క్లియోపాత్రాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది యూరోపియన్ మూలాలని చెప్తున్నారాయన. క్లియోపాత్రా గ్రీకుకు చెందిన వ్యక్తి. మాసిడోనియా రాజులు, రాణులతో ఆమెకు దగ్గరి పోలికలు ఉన్నాయి అని పేర్కొన్నారు. మరోవైపు క్లియోపాత్ర రంగును నలుపుగా చూపించడం ద్వారా.. ఆమె ఈజిప్ట్ గుర్తింపును తుడిచేసే ప్రయత్నం జరుగుతోందంటూ మహమొద్ అల్ సెమారీ అనే లాయర్ ఈజిప్ట్ అటార్నీ జనరల్‌కు ఓ విజ్ఞప్తి సమర్పించాడు. ఈజిప్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఆ వివాదాస్పద సిరీస్ ప్రసారం కాకుండా చూడాలంటూ కోరారాయన. అయితే..
ఇది అనవసర వివాదమంటోంది ఈ సిరీస్ నిర్మాణంలో భాగం పంచుకున్న జడా పింకెట్ స్మిత్(విల్‌స్మిత్ భార్య). ఇది కేవలం బ్లాక్ క్వీన్స్ గురించి, వాళ్ల గొప్పదనం గురించి చెప్పడమేగానీ ఇతర ఉద్దేశం లేదని ఆమె ఆంటోంది. అయినప్పటికీ.. ఈజిప్ట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఊగిపోతోంది. బ్యాన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్‌ను నడిపిస్తోంది అక్కడి సోషల్ మీడియా.
హిస్టరీ ఐకాన్.. క్లియోపాత్రా
గ్రేట్ ఫిగర్స్ ఆఫ్ హిస్టరీలో ఒకరిగా పేరుంది క్లియోపాత్రాVII ఫిలోపేటర్‌కి. ముందున్న ఆరుగురు క్లియోపాత్రాల్లో ఎవరికీ లేని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈమె గురించి ఇంత చర్చ. రాజకీయ వ్యూహాలు రచించడంలో క్లియోపాత్రాVII సిద్ధహస్తురాలని, కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు.. గొప్ప అందగత్తె అయినప్పటికీ శారీరక సుఖం కోసం ఆమె ఎంతదాకా అయినా వెళ్తుందనే ప్రచారమూ ఒకటి ఉంది.
👉 క్రీస్తు పూర్వం 48లో ఆమె ఈజిప్ట్‌ను మహారాణిగా పాలించారు. ఆమె ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో క్రీస్తు పూర్వం 69లో జన్మించారు. టాలమీ వంశస్థురాలైన క్లియోపాత్రా.. పాలనలోనే కాదు పలు రంగాల్లోనూ నేర్పరి. బహుభాషా కోవిదురాలు. గొప్ప రచయిత. కాస్మోటిక్స్, హెయిర్ కేర్ మీద ఆమె ఓ పుస్తకం కూడా రాశారట.
👉 క్లియోపాత్రా అధికారం కోసం.. సోదరి బైరినైస్, తండ్రి 12వ టాలెమీ మరణాంతరం రాజైన సోదరుడు 13వ టాలెమీ (ఆచారం ప్రకారం.. ఇతన్నే వివాహం చేసుకుని ఈజిప్ట్‌కు రాణి అయ్యింది) పథకం ప్రకారం అడ్డు తొలగించుకుంది. ఆపై ఇరవై ఏళ్లపాటు ఈజిప్ట్‌ను పాలించింది క్లియోపాత్రా.
👉 రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్, అతని కుడిభుజం మార్కస్ ఆంటోనియస్‌లతో క్లియోపాత్రా రొమాంటిక్ రిలేషన్‌షిప్ నడిపింది.
👉 క్లియోపాత్రాతో జూలియస్ సీజర్ బంధాన్ని రోమన్ సైన్యాధికారులు తట్టుకోలేకపోయారు. తిరుగుబాటు చేశారు. ఆ పరిణామంతో మనస్తానం చెంది.. కత్తితో పొడుచుకుని క్లియోపాత్రా ఒడిలోనే చనిపోయాడని ఓ కథనం, శత్రువుల చేతిలోనే మరణించాడని మరో కథనం ప్రచారంలో ఉంది.
👉 క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని మరీ ప్రాణం విడిచింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అదే విధంగా చనిపోయారు. అయితే.. ఇది ఒక వర్షన్. ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారు. ఇది రెండో వర్షన్. దీంతో.. క్లియోపాత్రా మరణం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది.
👉 టాలోమీ రాజవంశం.. మొదటి శతాబ్దం BCలో రోమన్ ఆక్రమణతో ముగిసింది.
👉 క్లియోపాత్రాకు మొత్తం 4 మంది సంతానమని ఈజిప్ట్ చరిత్ర పుస్తకాలు చెబుతుంటాయి. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారట. ఆమె క్లియోపాత్రా సెలిన్.
👉 క్లియోపాత్రా నల్లజాతి మూలాలున్న వ్యక్తేనని ఆఫ్రోసెంటిస్ట్ స్కాలర్స్ ప్రతిపాదించారు. కానీ, చాలామంది మేధావులు మాత్రం ఆమె అందగత్తె కాబట్టే చక్రవర్తులు వెర్రెత్తిపోయారని చెబుతూ ఆ వాదనను కొట్టేశారు.
కొసమెరుపు.. క్లియోపాత్రాను ఆఫ్రికన్ సంతతి వ్యక్తిగా చూపించిన ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ నటి అడెలె జేమ్స్ లీడ్‌రోల్‌లో నటించింది.
:::సాక్షి వెబ్ ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment