లక్నో సిటీ సివిల్ కోర్టులో బుధవారం విచారణ జరుగుతుండగానే కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే డాన్ అక్కడికక్కడే చనిపోయాడు. మూడు దశాబ్దాలుగా దాదాపు పాతిక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు సంజీవ్ జీవా. కానీ, ఒకప్పుడు అతనికి కుటుంబమే ముఖ్యంగా ఉండేంది. దానిని పోషించుకునేందుకు కాంపౌండర్ పని కూడా చేశాడు. అలాంటోడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు?.. అతని నేరచరిత్ర నెత్తుటి మరకలతో ఎలా సాగిందో చూస్తే..
అది 90వ దశకం ప్రారంభం కాలం అది. పశ్చిమ యూపీలోని ముజఫ్ఫర్ నగర్లో శంకర్ హాస్పిటల్ ఉండేది. అక్కడ కంపౌండర్గా పనిచేసే ఒక యువకుడు అందరికి మందులు పొట్లాలు కట్టేవాడు. చేసేది కంపౌండర్ పనే అయినా అందరూ అతన్ని ‘డాక్టర్’ అనే సరదాగా పిలిచేవారు. ఆ టైంలో అతనికి కుటుంబం తప్ప మరో ఊసు ఉండేది కాదు. వాళ్ల కోసం పగలురాత్రి తెగ కష్టపడేవాడు. అయితే.. ఆ డబ్బు సులువుగా వచ్చే మార్గం ఏంటో త్వరలోనే అతను అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా అతనిలో నేర స్వభావం బయటపడడం ప్రారంభమైంది.
తాను, తన కుటుంబం బతకాలంటే డబ్బు కావాలి. అది ఎంత ఖర్చు చేసినా తరగనంత. అందుకోసం నేరవృత్తిని ఎంచుకున్నాడు. తన డాక్టర్‌కు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ఒక వ్యాపారిని బెదిరించడం ద్వారా ఆ యువకుడు తన నేరసామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. అక్కడతో ఆగలేదు… తరువాతి కాలంలో తన డాక్టర్నే కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు.
సంజీవ్ జీవా పూర్తి పేరు సంజీవ్ మహేశ్వరి . యూపీలోని ముజఫ్పర్ నగర్కు చెందిన వ్యక్తి. తన నేర సామ్రాజ్యం ప్రారంభంలోనే కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 90వ దశకం చివరికి వచ్చేనాటికి సంజీవ్ కలకత్తాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి 2కోట్లు డిమాండ్ చేశాడు. అప్పట్లో కిడ్నాపర్ డిమాండ్ చేసే డబ్బు విలువను బట్టి ఆ గ్యాంగ్ ఎంత పెద్దదో డిసైడ్ చేసేవారు.
తరువాతి కాలంలో తనదంటూ ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్న సంజీవ్… విదేశాల నుంచి ఆయుధాలను తీసుకువచ్చాడు. యూపీలోని షామ్లీ జిల్లాలో పోలీసులు చెక్పోస్టు వద్ద అనిల్ అనే ఒక రౌడీ దగ్గర నుంచి ఏకే-47తోపాటు 1300బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ యూనివర్సిటీ డీన్ హత్యకేసులో నిందితుడు. అనిల్కు ఈ ఆయుధాలు అమ్మింది సంజీవ్ అని పోలీసులు తేల్చారు. ముజఫ్పర్నగర్ కేంద్రంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన సంజీవ్ … మెల్లిగా కాంట్రాక్టు కిల్లింగ్లను ప్రారంభించాడు.
సంజీవ్ నేర ప్రపంచంలో బ్రహ్మదత్త ద్వివేది హత్య సంచలనం సృష్టించింది. 90వ దశకంలో యూపీ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా బ్రహ్మదత్త ద్వివేదికి పేరుంది. బీఎస్పీ రాజకీయాలను మలుపు తిప్పిన గెస్ట్‌హౌజ్ సంఘటనలో మాయావతికి ద్వివేది సహాయం చేశారు. కవిగా, సిద్ధాంత కర్తగా బ్రహ్మదత్తకు బీజేపీలో మంచి గుర్తింపు ఉండేది. బీజేపీ నాయకుడైనప్పటికీ… మాయావతి ఆయనను సోదరుడిగా భావించేది. ఫిబ్రవరి 1997లో తన ఇంటి దగ్గర నుంచి వెలుతున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ద్వివేది అక్కడికక్కడే చనిపోయారు. అద్వానీ, వాజ్‌పేయి హుటాహుటిన లక్నో వచ్చి ద్వివేది అంత్యక్రియల్లోపాల్గన్నారంటే.. ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. ఫరూకాబాద్ ఎమ్మెల్యే విజయ్సింగ్ తో పాటు సంజీవ్ జీవా కూడా ఇందులో దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసులో సంజీవ్ జీవాకు యావజ్జీవా కారాగార శిక్షపడింది. అయితే సంజీవ్ జీవా మాత్రం పోలీసులకు చిక్కలేదు.
మున్నా బజరంగీతో చేరడం ద్వారా సంజీవ్ తన నేరసామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. 2005నాటికి సంజీవ్ జీవా బీఎస్పీ ఎంపీగా ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీతో జీవా చేతులు కలిపాడు. ఇదే సమయంలో జరిగిన కృష్ణానంద్ రాయ్ హత్యతో సంజీవా ఫేమస్ అయిపోయాడు.
మహమ్మదాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణానంద్ రాయ్ బీజేపీలో కీలకమైన నేత. 2005 నవంబర్లో రాయ్ తన ఇంటి నుంచి ఒక కార్యక్రమానికి వెళ్లివస్తుండగా నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఆయనను అడ్డుకున్నారు. ఏకంగా ఏకే-47 ఆయుధాలతో దాదాపు 500బుల్లెట్లు ఫైర్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ వాహనం పూర్తిగా బుల్లెట్లతో జల్లెడలా మారిపోయింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారి శరీరాల నుంచి దాదాపు 50బుల్లెట్లు బయటకు తీశారు.
కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మున్నాబజరంగీని జైలులో హత్య చేశారు. లోక్సభ సభ్యుడు ముఖ్తార్ అన్సారి కేసు నుంచి తప్పించుకోగలిగారు. ఇక సంజీవ్ జీవా ఈ కేసులో కీలక నిందితుడని విచారణలో తేలింది.
ప్రస్తుతం జైలులో ఉన్న సంజీవాను కోర్టులో జడ్జి ముందు విచారణ జరుగుతుండగానే.. లాయర్ల దుస్తుల్లో వచ్చి మరీ కాల్చి చంపారు. సంజీవా భార్య పాయల్ చౌదరి ఆర్ఎల్డీ పార్టీ నుంచి ముజఫ్ఫర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తన భర్తకు ప్రాణహాని ఉందని సంజీవ్ భార్య ఆ మధ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏది ఏమైనా సంజీవ్ చావుతో… యూపీ రక్తచరిత్రలో ఓ అంకం ముగిసినట్లయ్యింది.
:::ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment