
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన జరిగింది. గోమతినగర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగిని ఆఫీసులోనే తన డెస్క్లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి మరణించింది. గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.
ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. గమనించిన తోటి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెబుతున్నారు.
ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఇక ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటన దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తడిని ప్రతిబింబిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment