డెలివరీ ఏజెంట్ల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సరుకులు సరఫరా చేసే డెలివరీ ఏజెంట్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలకు గిరాకీ పెరిగింది. దీంతో వేలాది మందికి ఇది ఉపాధి మార్గంగా మారింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటిని వినియోగదారులకు సరైన సమయంలో చేరవేయడం డెలివరీ ఏజెంట్ల పని. అయితే చెప్పినంత ఈజీ కాదు ఈ జాబ్ చేయడం.
సవాళ్లు ఎన్నో..
విధి నిర్వహణలో డెలివరీ ఏజెంట్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమయానికి సరుకులు చేరవేయడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నగరాల్లో అయితే తీవ్రమైన ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకోసారి అడ్రస్ వెతుకులాటలోనే సమయం గడిచిపోతుంటుంది. లేటుగా వెళితే కస్టమర్లు నెగెటివ్ రేటింగ్ ఇస్తారనే భయంతో వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. వీటితో పాటు దాడులు కూడా పెరిగాయి.
ఐ ఫోన్ కోసం హత్య
తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఐ ఫోన్ కోసం ఓ డెలివరీ ఏజెంట్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్హాట్‌కు చెందిన గజేంద్ర ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్‌లో లక్షన్నర రూపాయల ఐ ఫోన్ ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. సెప్టెంబర్ 23న ఆర్డర్ ఇవ్వడానికి డెలివరీ ఏజెంట్ భరత్ సాహు వచ్చాడు.
ఫోన్ తీసుకున్న గజేంద్ర, డబ్బులిస్తానంటూ అతడిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఫ్రెండ్‌తో కలిసి సాహును చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని కాల్వలో పడేశారు. సాహు కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాస్ట్ డెలివరీ గజేంద్రకు చేశాడని విచారణలో తేలింది. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడి ఫ్రెండ్ ఆకాశ్‌ను పట్టుకున్నారు. అతన్ని విచారించగా ఈ దారుణం బయటపడింది.
గతంలోనూ దాడులు
కాగా, డెలివరీ ఏజెంట్లపై దాడులు గతంలోనూ పలుచోట్ల చోటుచేసుకున్నాయి. 2021లో బెంగళూరులో దోపిడీ యత్నంలో ఫుడ్‌డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. డబ్బుల విషయంలో కస్టమర్‌తో గొడవ జరగడంతో డెలివరీ ఏజెంట్ ఒకరు కత్తిపోట్లకు గురయిన ఘటన 2022లో నోయిడాలో కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా యూపీ ఘటన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment