ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్‌బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు.
ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు.
ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్‌లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్‌లు తమ పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్‌బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్‌కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్‌లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్‌లో పిచ్‌పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్‌లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది.
కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్‌లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది.
Ball by ball
— Spartan (@_spartan_45) June 20, 2023
Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW
Comments
Please login to add a commentAdd a comment