ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్‌బాల్’ శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నది. దీంతో ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదల కనబరుస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జరుగుతున్నది టెస్టు మ్యాచ్ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ ఇరు జట్ల బ్యాటర్లు తమదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.
నిర్దేశిత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మెరుగైన శుభారంభమే దక్కింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న వార్నర్(36) ఫర్వాలేదనపించగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజ(34 నాటౌట్) అద్భుత పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను కాచుకుంటూ వీరిద్దరు లక్ష్యఛేదనను ప్రారంభించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వార్నర్‌ను రాబిన్సన్ ఔట్ చేయడం ద్వారా ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
వార్నర్ వెనుదిరుగడంతో తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్(13) మరోమారు నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో జట్టును గట్టెక్కించే లబుషేన్(13) బ్రాడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్ (6)..బ్రాడ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది.
ఇంగ్లండ్ 273 ఆలౌట్:
ఓవర్‌నైట్ స్కోరు 28/2 నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమదైన రీతిలో దూకుడు మంత్రాన్ని పటించింది. బ్యాటర్లు ఆది నుంచే బాదుడు మొదలుపెట్టారు. ముఖ్యంగా జో రూట్(46), హ్యారీ బ్రూక్(46), కెప్టెన్ బెన్ స్టోక్స్(43) కీలక పరుగులు జత చేశారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తూ వైవిధ్యమైన షాట్లతో స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. ఇన్‌ఫామ్ బ్యాటర్ రూట్..ర్యాంప్ షాట్లతో టి20 ఫార్మాట్ బ్యాటింగ్‌ను తలపించాడు. అయితే మరో ఎండ్‌లో కమిన్స్(4/63), లియాన్(4/80) బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వీరిద్దరు ఇంగ్లండ్ భారీ స్కోరు ఆశలకు గండికొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386,
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 103/3
Comments
Please login to add a commentAdd a comment