
Photo Courtesy: BCCI
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ సారీ చెప్పినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
The average Delhi vs Mumbai debate in comments section 🫣
Don't miss @ImRo45 's reaction at the end 😁
Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025
ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి) కరుణ్ పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్ కల్పించుకుని కరుణ్‌కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.
పొరపాటున జరిగిన దానికి కరుణ్ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్‌లో, అంతకుముందు ఓవర్‌లో కరుణ్ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్‌లో ఏ బ్యాటర్ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు.
Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025
బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో కరుణ్ ట్రెంట్ బౌల్ట్‌పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌లో కరుణ్ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్ దెబ్బకు హార్దిక్ బౌల్ట్‌ను బౌలింగ్ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ కర్ణ్ శర్మ, హార్దిక్ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్.. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదాడు.
ఈ మ్యాచ్‌లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
సింగిల్స్ తీసుకుని స్ట్రయిక్ రొటేట్ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్ ఔటయ్యాక (13వ ఓవర్‌లో) కొత్త బంతి తీసుకోవడం కూడా ముంబైకి కలిసొచ్చింది.
కొత్త బంతితో కర్ణ్ శర్మ, సాంట్నర్, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.