IND Vs AUS Day-2 Analaysis.. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. విశ్లేషణ విషయానికి వస్తే.. రెండోరోజు ఆటలో మొదట ఆస్ట్రేలియాదే ఆధిపత్యంలా కనిపించినప్పటికి చివరాఖరికి టీమిండియాదే పైచేయి. తొలి రెండు సెషన్‌లలో ఆస్ట్రేలియా ఆధిక్యం కనబరిచినప్పటికి రోహిత్ సెంచరీతో ఆసీస్ ఆధిపత్యం ఒక సెషన్‌కు పరిమితమైనట్లే. ఎందుకంటే చివరి సెషన్‌లో జడేజా, అక్షర్ పటేల్‌ల ఆటతో టీమిండియా నిలదొక్కుక్కుంది.
నిలదొక్కుకోవడమే కాదు టీమిండియాకు భారీ ఆధిక్యం కట్టబెట్టేలా కనిపిస్తున్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో ఈ ఇద్దరు లంచ్ వరకు నిలబడితే చాలు.. మ్యాచ్ టీమిండియాదే అవుతుంది. ఒకవేళ ఆధిక్యం 200 పరుగులు దాటినా మ్యాచ్ టీమిండియావైపే మొగ్గి ఉంటుంది. మొదటి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ మూడో రోజుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది.
ఆకట్టుకున్న ఆసీస్ కుర్రాడు..
ఇక రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా ఏదైనా లాభపడిందంటే టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో రాణించడం. 22 ఏళ్ల ఈ కుర్రాడికి ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం అంటే మాములు విషయం కాదు. తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో మొదటిరోజే కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టిన టాడ్ మర్ఫీ.. రెండోరోజు ఆటలో తన మ్యాజిక్ బౌలింగ్‌తో కోహ్లి, పుజారా, అశ్విన్, శ్రీకర్ భరత్‌లను బుట్టలో వేసుకొని పెవిలియన్ చేర్చాడు.
అయితే తొలి టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రభావం చూపిస్తాడని అనుకున్నారు.. కానీ ఎవరు ఊహించని విధంగా టాడ్ మర్ఫీ తన బౌలింగ్‌తో హైలైట్ అయ్యాడు. అతని బౌలింగ్‌లో స్టీవ్ ఓ కఫీ(2017లో టీమిండియాను తొలి టెస్టులో శాసించిన బౌలర్) బౌలింగ్ శైలి కొట్టొచ్చినట్లు కనిపించింది. 2017లో ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు.. తొలి టెస్టులో స్టీవ్ ఓ కఫీ సంచలన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 333 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఓ కఫీ ఆరు వికెట్లతో చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించాడు.
2014లోనే అరంగేట్రం చేసినప్పటికి స్టీవ్ ఓ కఫీ బౌలింగ్ టీమిండియా బ్యాటర్లకు కొత్త. అందుకే అతని కొత్త బౌలింగ్ శైలిలో ఇబ్బందులు పడి వికెట్లు చేజార్చుకొని మ్యాచ్ ఓటమిపాలయ్యారు. అయితే ఇదే స్టీవ్ ఓ కఫీ బౌలింగ్‌ను తర్వాతి మ్యాచ్‌ల్లో చీల్చి చెండాడారు. ఆ దెబ్బకు ఓ కఫీ మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు.
తాజాగా టాడ్ మర్ఫీ కూడా అతని బౌలింగ్ శైలినే అనుకరిస్తుండడంతో అభిమానులు మరో స్టీవ్ ఓ కఫీ వచ్చాడని అభిప్రాయపడ్డారు. ఐదు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే చివరి సెషన్‌లో జడేజా, అక్షర్ పటేల్‌లు అర్థశతకాలతో రాణించి టీమిండియాను నిలబెట్టారు. మర్ఫీ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికి జడ్డూ, అక్షర్ పటేల్‌లు తమ బ్యాటింగ్‌తో అతన్ని తొక్కేశారని అభిమానులు సరదాగా పేర్కొన్నారు.
చదవండి: IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్‌లో ఇరగదీసిన అక్షర్ పటేల్
Comments
Please login to add a commentAdd a comment