తొక్కిసలాట జరిగిన ప్రాంతం
నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద జరిగిన దుర్ఘటన విచారకరం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఒక కార్యక్రమం చేపట్టి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కందుకూరు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేతలు ఎలా స్పందించాలి? అసలు ఈ ఘటనకు కారణం ఏమిటి? ఇందులో పోలీసుల తప్పు ఏమైనా ఉందా? లేక నేతల అతి తెలివి వల్ల ఇంతమంది బలయ్యారా? రాజకీయ ప్రచారం ఇరుకు రోడ్లపై పెడితే ఆ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా? జనం సరిపడ రాకపోతే, వెలితిగా కనిపించి పార్టీకి నష్టం జరుగుతుందని ఇలా చేస్తుంటారా? ఇలాంటి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఒక అవగాహనకు రావాలి.
ప్రజల ప్రాణాలతో ఆటలా?
మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కందుకూరులో మరో పెద్ద సర్కిల్ ఉన్నప్పటికీ, చిన్న ప్రదేశంగా ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ ను తెలుగుదేశం ఎందుకు ఎంపిక చేసుకుంది? టీడీపీ అధిష్టానం సూచనల మేరకే ఎక్కడ సభ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయిస్తారు. కొన్ని కధనాల ప్రకారం తెలుగుదేశం అధినాయకత్వం అనండి.. చంద్రబాబు లేదా.. లోకేష్ వంటివారు ఇలా కాస్త చిన్న , చిన్న రోడ్లపై మీటింగ్ లు పెడితే తక్కువ జనం వచ్చినా.. పత్రికలలోను, టివీలలోను జనం బాగా వచ్చారని ప్రచారం చేసుకోవచ్చన్న యావతో ఇలా చేస్తున్నారట. ఏ పార్టీ ఇలా చేసినా మంచిది కాదు.
నిజానికి ప్రజల మద్దతు తమకు ఉందని భావించే ఏ పార్టీ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు పొడవాటి రోడ్లను, ఉన్నంతలో విశాలమైన రోడ్లను ఎంపిక చేసుకుని అనుమతి తీసుకుని , అందుకు తగ్గ ఏర్పాట్లను ముందుగానే చేసుకుని సభ నిర్వహించేవారు. కానీ చంద్రబాబు సభలకు అలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. సన్నని సందు ఉంటే ఫోటో బాగా వచ్చి విశేష సంఖ్యలో జనం వచ్చారని రాష్ట్రం అంతటా నమ్మించవచ్చన్నది వారి ఆలోచన అట. అలాంటి దిక్కుమాలిన ఐడియా వల్ల ఇప్పుడు కందుకూరులో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. దీనికి ఎవరు బాద్యత వహించాలి?
సంఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు.. వీడియోలో 17వ నిమిషం దగ్గర చూడండి. చాలా చిన్న దారిలో సభ ఏర్పాటు చేశారు, అక్కడే లైవ్ కవరేజ్ కోసం వ్యాన్ పెట్టారు. 17వ నిమిషం నుంచి 19వ నిమిషం వరకు చంద్రబాబు ఏం మాట్లాడారో పరిశీలిస్తే.. జనం ఎక్కుతున్నందున తన లైవ్ ప్రసారాలకు ఆటంకం ఏర్పడుతుందన్నదే తన ఆందోళనగా కనిపించింది. ఆ వ్యాన్కు అత్యంత సమీపంలోనే తొక్కిసలాట జరిగింది. నిజానికి జనాన్ని సరిగా సమన్వయం చేసుకుంటే .. పరిస్థితి మరోలా ఉండేది. లైవ్ ప్రసారాలు బాగా రావాలన్నా తాపత్రయం తప్ప.. జనాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలన్న అంశాన్ని విస్మరించినట్టు అనిపిస్తుంది.
పాపం.. పచ్చ ప్రకోపం
దీని ప్రభావాన్ని తగ్గించడానికి ఈనాడు వంటి టీడీపీ మీడియా సంస్థలు చాలా పాట్లు పడినట్లు వారు రాసిన కథనాలు చదివితే అర్దం అవుతుంది. వాస్తవ విశ్లేషణతో నిమిత్తం లేకుండా పోలీసులు తక్కువగా ఉన్నారని ఒక వార్త ఇచ్చారు. పోలీసులు ఎక్కువమంది ఉంటే అప్పుడు తొక్కిసలాట జరగకుండా వారు ఎలా ఆపగలుగుతారు? పోలీసులు ఎక్కువ మందిని పెడితే జనాన్ని రాకుండా పోలీసులు అడ్డుపడ్డారని అప్పుడు రాసేవారు. అసలు ఇరుకు రోడ్డులో సభ పెట్టడమేమిటని ఈ మీడియా ప్రశ్నించాలి. పైగా చంద్రబాబు ముందు నుంచీ జాగ్రత్తలు చెపుతూనే వున్నాడు అంటూ ఓ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. వ్యాన్ దిగండి, లేకపోతే లైవ్ టెలికాస్ట్ ఆగిపోతుందని చంద్రబాబు చెప్పారు కానీ, అంత మంది ఒకే చోట గుమ్మిగూడితే ప్రమాదం , జాగ్రత్త అని చెప్పలేదు, హెచ్చరించలేదు. చేయాల్సిన పని చేయకపోగా, గతంలోను ఇలాంటి ఘటనలు జరిగాయని ఒకసారి జగన్ సభలో గోడ కూలి ఒకరు, పవన్ సభలో ఒకరు, కుప్పం సభలో మరొకరు మరణించారంటూ కందుకూరు విషాదం తీవ్రతను తగ్గించే యత్నం చేశారు.
బాబుకు ఇవి కొత్తేం కాదు
ఇది చూశాక ఒక విషయం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు జరిగాయి. తనకు కేటాయించిన ఘాట్ లో కాకుండా సామాన్య భక్తుల ఘాట్లో చంద్రబాబు తన కుటుంబంతో సహా స్నానాలు చేయడం, ఈ కార్యక్రమం ప్రచారం కోసం కెమెరాలు పెట్టడం, ఓ స్టార్ డైరెక్టర్ను తెచ్చి షూటింగ్ ఏర్పాట్లు చేయడం, ఆ క్రమంలో భక్తులందరిని గేటు వద్ద నిలిపివేయడం, తదుపరి ఒక్కసారిగా గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు వేల మంది పోలీసులు చంద్రబాబు భద్రతకు, పుష్కరాల నిమిత్తం ఉన్నారు. అయినా అంతమంది ఎలా చనిపోయారు? పైగా ఆ ఘటన నేపధ్యంలో చంద్రబాబు ఏమన్నారు? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో జరగలేదా? అని ఎదురు ప్రశ్నించి అంత విషాదాన్ని అపహాస్యం చేశారు. పైగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ అంటూ హడావిడి పెట్టి ఫైల్ మూసేశారు. చంద్రబాబు కుటుంబ స్నానాల వల్లే ఆ ఘటన జరిగిందని కలెక్టర్ ఇచ్చిన నివేదికను తొక్కేశారు.
తప్పెవరిదో తెలుసా బాబు.?
ఇప్పుడు చంద్రబాబు మరో ప్రకటన చేశారట. ప్రభుత్వంపై అవేశంతో ఎక్కువ మంది వచ్చారట. అది నిజమో,కాదో, ఆయనకు తెలుసు.సభలకు జనాన్ని ఎలా సమీకరిస్తారో, అందులో చంద్రబాబు స్టైల్ ఏమిటో, ఒక్కో సభకు ఎంత ఖర్చు చేస్తారో పార్టీ వారిని రహస్యంగా అడిగితే అంతా చెబుతారు. పాపం.. కొంతమంది డబ్బుకు ఆశపడి ఇలా సభలలోకి వస్తుంటారు. కొందరు మద్యం కోసం వస్తుంటారు. ఎలాగైనా రానివ్వండి.. అది వేరే విషయం. కాని వారు ఇలాంటి విషాద ఘటనలో మరణించడం మాత్రం బాధాకరం.
నిజంగానే ప్రజలలో ప్రభుత్వంపై అంత ఆవేశం ఉందని టీడీపీ భావిస్తుంటే పెద్ద సభా స్థలి తీసుకునో, ఏ కాలేజీ మైదానమో తీసుకుని సభ జరిపితే వారికి మైలేజీ వచ్చేది కదా? వేలాది మంది వచ్చారని చెప్పుకునే అవకాశం ఉండేది కదా! మరి ముప్పై అడుగుల పట్టి,పట్టని రోడ్డు, అందులోను మళ్లీ తోపుడు బండి , లైవ్ వాన్ అన్నీ ఆ సందులోనే.. ఇదంతా కచ్చితంగా నిర్వాహకుల తప్పిదం. దానిని అనుమతించిన చంద్రబాబు నాయుడి తప్పిందం అన్నది తెలుస్తూనే ఉంది. తనంత సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన సభలను ఇలా చిన్న రోడ్లపై ఎందుకు పెడుతున్నారు? వీటిని డ్రోన్ ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. నిజమే. ఏ సభకైనా ప్రచారం కోరుకుంటారు. తప్పు లేదు. కానీ ఆ ప్రచార యావలో ఇలా మనుషులను బలి తీసుకునే పరిస్థితి మంచిదికాదు. ఇప్పుడు జనం ఏమనుకోవాలి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కాదు .. తెలుగుదేశం సభలకు వెళ్లినవారికని ప్రజలు అనుకోరని ఎవరైనా భావించగలమా!
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment