ఆంధ్రప్రదేశ్‌లో క్షుద్ర రాజకీయం రోజురోజుకు శృతి మించుతోంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న వ్యవహారంగా కనిపిస్తోంది. గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తన కంపెనీ అయిన అమరరాజా బాటర్ యూనిట్ ఒక దానిని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే పదేళ్లలో తొమ్మిదివేల కోట్లు పెట్టుబడులు పెడతామని ఆయన అంటున్నారు. తొలి దశలో రెండువేల కోట్లు వ్యయం చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. అంతవరకు సంతోషమే. ఎక్కడ ఎవరు కొత్త కంపెనీ పెట్టినా స్వాగతించాల్సిందే. కాకపోతే ఆయన తెలంగాణలో యూనిట్ పెట్టడానికి, ఏపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం?ఆయన పెట్టుబడి , ఆయన ఇష్టం. ఏ పెట్టుబడిదారుడు అయినా అనేక అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాని గల్లా జయదేవ్ ను ఏపీ ప్రభుత్వం వేధించిందని, అందుకే ఆయన అక్కడ పెట్టుబడి పెట్టారని ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయి. జయదేవ్ ఆ మాట చెప్పలేదు. కాని ఈ మీడియా మాత్రం ప్రపంచం తలకిందులైనంతగా గగ్గోలుపెట్టాయి. జయదేవ్ ఏపీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయి తాను ఈ పెట్టుబడి పెట్టదలిచానని అడిగి, అప్పుడు ప్రభుత్వం నుంచి సహాకరం అందకపోతే తాను వేరే రాష్ట్రానికి వెళుతున్నారని చెప్పవచ్చు. అలాంటిదేమీ జరగలేదు.
అయినా ఆయన ఏపీలో పెట్టుబడి పెట్టలేదు కనుక, వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి టీడీపీ మీడియా దీనిని ఒక అవకాశంగా వాడుకునే యత్నం చేసింది. ఇదంతా చూస్తే ఒక అనుమానం వస్తోంది. గల్లా జయదేవ్ తో టీడీపీ వారు, లేదా వారికి మద్దతు ఇచ్చే మీడియా వారు ఈ విధంగా ప్లాన్ చేసి, తెలంగాణలో పెట్టుబడులు అని అనౌన్స్ చేయించి ,ఏపీ ప్రభుత్వంపై విషం కక్కాలని అనుకున్నారా అన్న సందేహం కలుగుతుంది.ఈ దిక్కుమాలిన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక పత్రిక కావాలని 1.73 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని పచ్చి అబద్దపు వార్త ప్రచురించడం, తదుపరి గల్లా వార్తను ఇవ్వడం ఇవన్ని చూస్తుంటే వచ్చే ఏడాదిన్నరలో ఇంకెన్నో డ్రామాలు చూడాల్సిరావచ్చనిపిస్తుంది. నిజానికి గల్లా జయదేవ్ ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదో ఆయనను అడగాలి.
గుంటూరు నుంచి ఆయన రెండుసార్లు టీడీపీ పక్షాన గెలిచారు. ఆయన తల్లి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తాత రాజగోపాలనాయుడు ఎంపీగా, ఎమ్మెల్యేగా పదవులు చేశారు. ఏపీ ప్రజలు ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలు వారికి ఇన్ని అవకాశాలు ఇస్తే , ఆ కృతజ్ఞతతో ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా అక్కడికి ఎలా వెళతావు అని అడగవలసిన మీడియా, ఆయన అక్కడకు వెళ్లగానే రెచ్చిపోయి ప్రభుత్వంపై చెడరాసేశాయి. అదేమంటే ఆయన పరిశ్రమలలో కాలుష్యం పేరుతో వేధించారని ఈ పత్రికలుచెబుతున్నాయి.
అంటే ఏదైనా పరిశ్రమలో కాలుష్యం వస్తుంటే దానిని అరికట్టడం ప్రభుత్వ బాద్యత కాదా? నిజంగానే కాలుష్యం లేకపోతే ,సంస్థ యాజమాన్యం ఆ విషయం ప్రభుత్వానికి వివరించవచ్చు. అయినా ప్రభుత్వం వినకపోతే అప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వవచ్చు. విశాఖలో ఎల్.జి పాలిమర్స్ సంస్థలో విష వాయువులువెలువడి 13 మంది మరణించినప్పుడు ఇదే మీడియా ఏమని రాసింది. ఆ సంస్థ యాజమాన్యాన్ని జగన్ కాపాడుతున్నారని, అరెస్టు చేయడం లేదని ఆరోపించింది.కాని జగన్ ప్రభుత్వం వారిని కూడా అరెస్టు చేయించింది.
అంటే మనవాడు అయితే ఒకలా, వేరే వాడు అయితే ఇంకోలా చూడాలని టీడీపీ మీడియా చెబుతోందన్నమాట.అసలు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా, సార్ట్ అవుట్ చేసుకుని ఇక్కడ పెట్టాలి కాని, వేరే రాష్ట్రానికి ఇలాంటి రాజకీయ నేతలు వెళితే ఏమిటి దాని అర్ధం. సరే.. ఇప్పుడు ఏపీలో పరిశ్రమ పెట్టలేదు. మరి తెలుగుదేశం అధికారంలో ఉన్న ఐదేళ్లలో గల్లా ఇదే పరిశ్రమను ,లేదా మరో పరిశ్రమను ఎందుకు పెట్టలేదు ?ఆయనే కాదు.. టీడీపీ పారిశ్రామిక వేత్త ఎవరూ కూడా ఆ పని చేయలేదు. చంద్రబాబును చూసి ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు పెట్టి ఉండాలి కదా? అమరావతి రియల్ ఎస్టేట్ పై చూపిన శ్రద్ద ఈ విషయంలో ఎందుకు చూపలేదు.
ఇక మరో సంగతి చూద్దాం. నిజంగానే జగన్ ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉందా? అలా అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పలు పరిశ్రమల సంగతేమిటి? బద్వేలులో సెంచరీ ప్లైవుడ్ కంపెనీని పెట్టిన యజమాని ఏమన్నారు..తమిళనాడులో పెట్టాలనుకున్న 2900 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ఏపీలోనే వ్యయపరుస్తానని అన్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ చూపిన చొరవే అని ఆయన చెప్పారు. తూర్పుగోదావరిలో ఒక కర్మాగారం స్థాపిస్తున్న టెక్ మహింద్ర ఎమ్.డి గుర్నానీ దావోస్ లో జగన్ ను కలిసిన అరక్షణంలో తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు కదా! ఆదిత్య బిర్లా తొలిసారిగా ఏపీలో పరిశ్రమ స్థాపించింది జగన్ ప్రభుత్వ హయాంలోనే.
విశాఖలో ఇన్ పోసిస్ కాంపస్ ఎలా వచ్చింది. మరో ఐటి పరిశ్రమ 3 వేల మందికి ఉపాధి కల్పించేలా ఎలా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీసిటీ, అనకాపల్లి తదితర చోట్ల వచ్చిన పరిశ్రమల సంగతేమిటి? గ్రీన్ ఎనర్జీ మాటేమిటి? జగన్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలుఏమీ రాలేదని, వెళ్ళిపోతున్నాయని వెకిలి రాతలు రాస్తున్నవారి అంధత్వాన్ని చూసి జాలిపడడం తప్ప ఏమి చేయగలం!నిజమే ! ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని రాసి నిర్మాణాత్మకంగా సూచనలు చేయవచ్చు. కాని ఒక పరిశ్రమ ఇక్కడ పెట్టకపోతే, అది కూడా టీడీపీ ఎమ్.పి చేస్తే, ఆనందంతో తాండవం చేస్తూ,ఏపీకి భలే అయింది అని చంకలు గుద్దుకునే మీడియా,ప్రతిపక్షం ఉంటే ఏపీకి ఏమి మేలు జరుగుతుంది?అందుకే ఇదంతా టీడీపీ వారే కావాలని గల్లా జయదేవ్ ను అడ్డుపెట్టుకుని ఈ డ్రామా ఏమైనా ఆడిస్తున్నారా అన్న సందేహం వస్తుంది. అయితే గల్లా జయదేవ్ ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాని ఆయనను అడ్డుపెట్టుకుని టీడీపీ మీడియా నానా రభస చేశాయి.వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ విన్యాసం తప్పదు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తప్ప, వీరి నోర్లు మూతపడవు. విషపు రాతలు ఆగవు..అంతవరకు వెయిట్ చేయాల్సిందే.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment