Happy Birthday Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! | Die-Hard Fan Sudhir Kumar Chaudhary Special Story In Telugu - Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే సచిన్‌: ఆయన క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! వీర సూపర్‌ ఫ్యాన్‌ సుధీర్‌

Published Mon, Apr 24 2023 12:00 AM | Last Updated on Mon, Apr 24 2023 8:35 AM

Happy Birthday Sachin:Die-Hard Fan Sudhir Kumar Chaudhary Special Story - Sakshi

సచిన్‌ను క్రికెట్‌కు దేవుడంటారు. ఎందుకంటే క్రికెట్‌ అనే విశ్వమతంలో ఆ దేవుడు చేసిన అద్భుతాలు అలాంటివి. మరి ఆ దేవుడికి అభిమానులనే భక్తులు ఉండడం సహజమే కదా. అందులో ప్రియ భక్తులు వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉంటారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో.. సచిన్‌కు సుధీర్‌ సుకుమార్‌ చౌదరీ అలాగ!. గుండెల నిండా సచిన్‌ను నింపేసుకున్న సుధీర్‌.. ఆయన మ్యాచ్‌ ఆడే సమయంలో మువ్వన్నెల రంగును ఒళ్లంతా పూసుకుని.. చేతిలో జెండాతో ప్రేక్షకుల గ్యాలరీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కేవలం సచిన్‌ కోసమే వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన సుధీర్‌ గురించి.. ఇవాళ్టి సచిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుంటూ..  

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏప్రిల్‌ 24న(సోమవారం) సచిన్‌ 50వ పడిలోకి అడుగుపెట్టారు. క్రికెట్‌లో లెక్కకు మించి సాధించిన రికార్డులు ఎన్నో. వంద సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అందుకే సచిన్‌ అభిమానించేవారు కోట్లలో ఉండేవారు. కానీ ఆ కోట్లాది మంది అభిమానుల్లో కొందరు ప్రత్యేకంగా కనిపించేవారు.  ఆ కొందరిలోనూ మరింత ప్రత్యేకంగా కనిపించాడు సుదీర్‌ కుమార్‌ చౌదరీ. 

👉 శరీరాన్ని మొత్తం భారతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో నింపుకొని ఛాతిపై సచిన్‌ టెండూల్కర్‌ జెర్సీ నెంబర్‌ ముద్రించుకొని చేతిలో జాతీయ జెండాను పూని టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడితే అక్కడికి ఒక సైకిల్‌పైనే వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు. అలా సచిన్‌ ఆటను.. టీమిండియా మ్యాచ్‌లను చూడడం కోసం దేశం మొత్తం తిరిగిన ఘనత అతని సొంతం. మరి సుదీర్‌ కుమార్‌ జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరం

ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమాని..



👉 ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమానిగా మారిపోయిన సుదీర్‌ కుమార్‌ చౌదరీ 1982లో బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో కడు పేదరిక కుటుంబంలో పుట్టాడు. ఆరేళ్ల వయసులో సచిన్‌పై ఇష్టం పెంచుకున్న సుధీర్‌ 14 ఏళ్ల వయసులో తన చదువును వదిలేశాడు. నిరుద్యోగి అయిన అతను కొన్నాళ్లు పాల కంపెనీలో చిరుద్యోగిగా పనిచేశాడు. ఆ తర్వాత టీటీసీ ట్రైనింగ్‌ తీసుకొని కొంతకాలం టీచర్‌గా పనిచేశాడు. కానీ ఇవేవి అతనికి ఆ‍త్మసంతృప్తిని ఇవ్వలేకపోయాయి. 

👉 సచిన్‌పై ఉన్న అభిమానం అతని పెళ్లి వాయిదా వేసుకునే వరకు వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్‌ అలా బతకడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. తీరు మార్చుకోకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు. తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయని సుధీర్‌ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకి వచ్చేశాడు. తన జీవితం క్రికెట్‌ మ్యాచ్‌లకే అంకితమని  తీర్మానం చేసుకున్న సుధీర్‌.. పబ్లిక్‌ సపోర్ట్‌తో వచ్చిన డబ్బులతో స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు.

👉2003 అక్టోబర్‌ 28న భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌ ఆటను చూడడం కోసం సుదీర్‌ పెద్ద సాహసమే చేశాడు. దాదాపు 21 రోజుల పాటు ముజఫర్‌పుర్‌ నుంచి మ్యాచ్‌ జరిగిన ముంబైకి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చాడు. ఈ మ్యాచ్‌ ద్వారానే తొలిసారి సుదీర్‌ కుమార్‌ చేతిలో భారత జెండాను పట్టుకొని రెపరెపలాడించడం మొదలుపెట్టాడు. ఇక 2010 వరకు దాదాపు 150 మ్యాచ్‌లు వీక్షించడం విశేషం. ఉపఖండపు దేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో భారత్‌ ఆడిన సిరీస్‌లకు సైకిల్‌పైనే వెళ్లడం ఆటపై అతనికున్న అభిమానిన్ని చూపిస్తోంది.

సచిన్‌ను మెప్పించిన అభిమాని.. పోలీసుల క్షమాపణ
👉2010లో కాన్పూర్‌ వేదికగా టీమిండియా మ్యాచ్‌ ఆడేందుకు వచ్చింది. అయితే ప్రాక్టీస్‌సెషన్‌ సమయంలో సచిన్‌తో కరచాలనం చేయడానికి సుదీర్‌ కుమార్‌ ప్రయత్నించాడు. కానీ పోలీసులు సుదీర్‌ పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ఇది గమనించిన సచిన్‌ టెండూల్కర్‌ నేరుగా పోలీసుల వద్దకు చేరుకొని.. అతను నా వీరాభిమాని.. అతను నాకు ఫ్యాన్‌ కాదు.. నేనే అతని ఫ్యాన్‌ను అని చెప్పాడు.

👉 దిగ్గజం సచిన్‌ ఆ మాట అనడంతోనే పోలీసులు సుదీర్‌ కుమార్‌ను క్షమాపణ కోరారు. అలా క్రికెట్‌ దేవుడిని మెప్పించిన ఘనత సుదీర్‌ కుమార్‌కే దక్కింది. ఈ సంఘటన తర్వాత సుధీర్‌ కుమార్‌ అభిమానానికి పడిపోయిన బీసీసీఐ.. అప్పటినుంచి టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు అతని టికెట్‌కు స్పాన్సర్‌ చేయడం మొదలుపెట్టింది.

👉 2011 వన్డే వరల్డ్‌కప్‌.. మరిచిపోలేని క్షణం
సుదీర్‌ కుమార్‌ జీవితంలో 2011, ఏప్రిల్‌ 2.. మరిచిపోలేని క్షణాలు. ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన రోజు కావడంతో  యావత్‌ భారతావని పులకించిపోయింది. భారత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి. ఆ సమయంలో సచిన్‌ సుదీర్‌ చౌదరీని డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఆహ్వానించాడు. జహీర్‌ ఖాన్‌ చేతుల మీదుగా వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందుకున్న సుదీర్‌.. సచిన్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

👉 తన అభిమాన క్రికెటర్‌ అలా పిలిచి కప్‌ చేతిలో పెట్టడంతో ఎమోషనల్‌ అయిన సుదీర్‌ను సచిన్‌ హగ్‌ చేసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. వరల్డ్‌కప్‌ ట్రోఫీతో భారత్‌.. భారత్‌ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. క్రికెట్‌ చరిత్రలోనే ఇదొక అద్బుత ఘట్టమని చెప్పొచ్చు. తనను అంతగా ప్రేమించిన ఒక అభిమాని సంతోషపెట్టిన సచిన్‌ పేరు అప్పట్లో మార్మోగిపోయింది.

👉ఇక సచిన్‌ తన రిటైర్మెంట్‌ రోజున సుదీర్‌ చౌదరీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నా 24 ఏళ్ల కెరీర్‌లో 14 ఏళ్ల పాటు నాపై అభిమానంతో ప్రతీ మ్యాచ్‌కు హాజరై టీమిండియాను ఆశీర్వదించిన సుదీర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాంటి అభిమాని నాకుండడం గర్వకారణం అని చెప్పుకొచ్చాడు.

సచిన్‌ రిటైర్మెంట్‌ తర్వాత కొన్నాళ్ల పాటు ధోని అభిమానిగా మారిన సుదీర్‌ పలు మ్యాచ్‌లకు అతని జెర్సీ నెంబర్‌ ముద్రించుకొని వచ్చాడు. కానీ ఈ మధ్యన సుదీర్‌ కుమార్‌ చౌదరీ పెద్దగా కనిపించడం లేదు. అలా సచిన్‌ ఉన్నంతకాలం అతని ఆటను చూస్తూ సంతోషపడిన సుదీర్‌.. భారత్‌ క్రికెట్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే అభిమానిగా మిగిలిపోవడం ఖాయం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement