కందుకూరు విషాద ఘటన తర్వాత కూడా ప్రతిపక్ష తెలుగుదేశం విపరీత ధోరణిలో ఏ మాత్రం మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కందుకూరులో టీడీపీ అదినేత చంద్రబాబు రోడ్ షో లో ఎనిమిది మంది మరణిస్తే దాని ప్రభావాన్ని తగ్గించి ప్రచారం చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇదే వైసీపీ వారి సభలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు,పలవలుగా రాసేవి. ఇలాంటివి ఏ సభలోను జరగకూడదు.
ఇక్కడ జరిగింది మానవ తప్పిదమా? ప్రచార యావతో జరిగిన తప్పిదమా? లేక ఇంకేదైనా కారణమా ? అన్న విషయాలపై విశ్లేషణకు వెళ్లకుండా టీడీపీ మీడియా జాగ్రత్తపడుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీనికి ఎలా కవరింగ్ ఇస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఇలాంటి ఘటనలను కూడా దిక్కుమాలిన రాజకీయాలకు వాడుకుంటారా అన్న బాద కలుగుతుంది. బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని అన్నారట. ఆయన ఉద్యమం రాష్ట్రం కోసం చేస్తున్నారట. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయినవారు రాష్ట్రం కోసం సమిదలుగా మారారని ఆయన చెబుతున్నారు.
ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. కందుకూరులో డ్రోన్‌తో షూటింగ్ జరపడం కోసం, జనం బాగా వచ్చారని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు గాను చిన్న బజారులో సభ పెట్టి, తొక్కిసలాటకు కారణమై, పలువురు మురికి గోతిలో పడిపోతే రాష్ట్రం కోసం చనిపోయినట్లా?మరి అలాగైతే గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే వారు ఎందుకు మరణించారు?అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?కుంభ మేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. మరి ఇప్పుడేమో రాష్ట్రం కోసం చనిపోయారని అంటున్నారు. నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నిటిని వాయిదా వేసుకుని కందుకూరు బాధితులను పరామర్శించిన తర్వాత విజయవాడకో, హైదరాబాద్ కో వెళ్లిపోయి ఉంటే బాగుండేది.
కాని అలాకాకుండా తన టూర్ షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసుకోకుండా ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ యాత్ర కోసం పర్యటించడం పద్దతిగా కనిపించదు. ఘటన జరిగిన తర్వాత బాదితులను పరామర్శించి వస్తానని, అంతవరకు జనం రోడ్డు మీదే ఉండాలని ఆయన కోరారంటే ఆయన యావ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. అయినా ఆయన ఇష్టం. రాజకీయమే ఊపిరిగా జీవించే ఆయనకు ఇలాంటివి చిన్నవిగానే ఉండవచ్చు. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ లో ప్రభుత్వం కోటి రూపాయలు సాయం ప్రకటిస్తే అదేమి సరిపోతుంది అని ప్రశ్నించి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు పది లక్షలతో సరిపెట్టుకున్నారు. మరో పాతిక లక్షలు పార్టీ ఇతర నేతలు ఇస్తారట. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు.
టీడీపీ ఆర్దికంగా పటిష్టంగా ఉన్న పార్టీనే. అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. విరాళాలు కూడా కోట్లలోనే వస్తుంటాయి. అయినా పది లక్షలకే పరిమితం అయ్యారు. ఎదుటివాడికి చెప్పడం కాకుండా మరికొంత అదనంగా పార్టీ తరపున సాయం చేసి ఉండాల్సింది. చంద్రబాబు సభకు వెళితే మంచి కూలీ వస్తుందనుకున్నవారు ఈ తొక్కిసలాటలో మరణించారని వార్తలు వచ్చాయి. కూలి కోసం వచ్చినవారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు చెప్పడం ఆత్మవంచనే అవుతుంది.ఇక పోలీసులు భద్రత ఎక్కువగా ఉండాల్సిందని ఆయన చెబుతున్నారు.ఎక్కువ మందిని పెడితే ఒక ఆరోపణ. ఇలాంటివి జరిగితే మరో ఆరోపణ. అసలు ప్రజలంతా అంత ఎగబడి వస్తుంటే ఏదైనా పెద్ద మైదానంలో సభ పెట్టుకుని సవాల్ విసిరి ఉండవచ్చు కదా! దాని గురించి మాట్లాడారు.
గతంలో ఎన్.టిఆర్ సర్కిల్ లో సభలు జరిగాయని అంటున్నారు. జరిగి ఉండవచ్చు.కాని ఏభై మీటర్ల దూరం వెళ్లి సభ ఎందుకు పెట్టినట్లు? పర్మిషన్ తీసుకున్నదెక్కడ? మీటింగ్ జరిగిందెక్కడ?వాటన్నిటిని పోలీసులు వివరిస్తున్నారు కదా? అయినా ఇక్కడా డబాయింపేనన్నమాట. తెలుగుదేశం, చంద్రబాబు చేసిన తప్పులను పోలీసులపై తోసి వేయడానికి ఈనాడు పత్రిక ముందుగానే వ్యూహం రచించింది. ముఖ్యమంత్రి సభకు వందల సంఖ్యలో పోలీసులు వస్తున్నారని, చంద్రబాబు సభకు అలా రావడం లేదని పేర్కొంది.ఇది ఎంత దారుణంగా ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పోలీసులు ఉండేవారు?ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌కు భద్రతగా ఎందరు ఉండేవారు? ఆ సంగతి తెలియదా? మరో సంగతి ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు ఉన్నంత మంది భద్రతా సిబ్బంది మరే నేతకు లేరు.
కేంద్ర బలగాలు సైతం ఆయన వెన్నంటి ఉంటాయి. అయినా వారెవ్వరూ చాలలేదట. రోడ్ షో లో ఎవరినైనా పోలీసులు ఆపితే ఇదే ఈనాడు, టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. సీఎం సభ నిమిత్తం రోడ్డుపై బారికేడ్లు పెట్టారని వీరే కదా విమర్శించింది. ఇలా ఎక్కడ ఏ అవకాశం వస్తే, ఆ విదంగా అడ్డగోలుగా కథనాలు రాయడం, వాటిని టీడీపీవారు ప్రచారం చేయడం మామూలు అయింది . మామూలుగా అయితే రెండు, మూడు రోజుల పాటు ఈ ఘటనపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసే ఈనాడు, ఈ ఘటనకు వచ్చేసరికి పందా మార్చేసింది. చంద్రబాబు వారిని ఆదుకుంటానన్నారన్న విషయాలకే ప్రాదాన్యత ఇచ్చి ఇక్కడ కూడా సానుభూతి సంపాదించాలన్న నీచమైన ఆలోచన చేసినట్లు అనిపిస్తుంది. లేకుంటే రోడ్డు అంతా కొలతలు వేసి, ఎక్కడ సభ జరగాలి? ఎక్కడ జరిగింది?రోడ్డు పై ఏమి అడ్డం ఉన్నాయి..
డ్రోన్ ఎవరు పెట్టారు? ఎవరు సలహా ఇచ్చారు? ఇలా నానా పరిశోధనలతో వార్తలు ముంచెత్తే ఈనాడు తెలుగుదేశం విషయంలో మాత్రం పూర్తిగా నోరుమూసుకుని ఉండడం వారి ప్రమాణాల పతనానికి అద్దం పడుతుంది. కావలిలో జరిగిన సభలో చంద్రబాబు పోలీసులను మళ్లీ ఎలా బెదిరిస్తున్నారో చూడండి. మా పై కేసులు పెడతారా? పెట్టండి. అక్రమ కేసులు పెట్టిన ఏ అధికారిని వదలం. చట్టం ప్రకారం శిక్షిస్తాం. కావలిలో ఇరవై కేసులు పెట్టారు. మేము వచ్చాక 200 కాదు.. రెండువేల కేసులు పెడతాం అని ఆయన అంటున్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయా? చంద్రబాబును ఎన్నుకుంటే వేల కేసులు పెడతామని ఆయన పోలీసులను కాదు హెచ్చరిస్తున్నది. ప్రజలందరిని అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. కేసులు కావాలంటే ఆయనను ఎన్నుకోవాలన్నమాట!ఇది కొత్త నినాదమే. దీని ఆధారంగానే తెలుగుదేశం ఎన్నికలకు వెళుతుందా!
Comments
Please login to add a commentAdd a comment